Ideas of India 2023:


ముంబయితో ప్రత్యేక అనుబంధం..


ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా (Ideas of India Summit 2023) సదస్సులో ముఖ్య అతిథిగా యూకే మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ముంబయితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడిన ఆమె...భారత్ ప్రపంచ దేశాలకు ఆశాకిరణంగా కనిపిస్తోందని కొనియాడారు. ఈ సదస్సులో పాల్గొనడం ఎంతో ఉత్సాహాన్నిస్తోందని చెప్పారు. 


"నేను 90ల్లో ముంబయికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ నాకు ఉత్సాహం పెరుగుతూనే ఉంటుంది. నేను కొద్ది రోజులుగా ఇక్కడే ఉంటున్నాను. G20 సదస్సుకి జరుగుతున్న ఏర్పాట్లను చాలా ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. భారత్‌ ఎంతో పురోగతి సాధించడమే కాకుండా ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా మారింది. ఆర్థిక పరంగా చూసినా భారత్‌ మెరుగైన స్థానంలో ఉంది. భారత్ గొంతుకను ప్రపంచమంతా వింటోంది" 


-లిజ్ ట్రస్, యూకే మాజీ ప్రధాని 






అంతర్జాతీయ అంశాలనూ  (Ideas of India by ABP Network) ప్రస్తావించారు లిజ్ ట్రస్. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకుని ఉండాల్సిందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 


"రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పశ్చిమ దేశాలు ఇంకాస్త ముందుగానే స్పందించి ఉంటే బాగుండేది. అడిగిన వెంటనే ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చి ఉండాల్సింది. గ్యాస్, చమురు కోసం రష్యాపై ఆధారపడాల్సిన అవసరం లేదన్న సంకేతాన్ని ఇచ్చి ఉండాల్సింది. భారత్‌లో ప్రజాస్వామ్యం ఎంతో మెరుగ్గా ఉంది. ఎంతో వేగంగా భారత్ అభివృద్ధి చెందుతోంది. పౌరులకు వాక్‌స్వాతంత్రమూ ఉంది. UNSCలో ఇండియా శాశ్వత సభ్యత్వం దక్కాలి. చాలా విషయాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. "


- లిజ్ ట్రస్, యూకే మాజీ ప్రధాని 
  



"బ్రిటన్ కూడా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన తరవాత ఆ దేశ వైఖరి చాలా మారిపోయింది. ఆ దేశంలో వాణిజ్య వ్యవహారాలు ఎక్కువగా పెట్టుకోవడం వల్లే మనకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇప్పటికీ చైనా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. బ్రిటన్‌ చైనాతో సంబంధాలు పెట్టుకోకుండా ఉండాల్సింది. ప్రజా స్వామ్యం,వాక్‌ స్వాతంత్య్రం గురించి ఆ దేశం తెలుసుకుంటుందేమో అన్న ఆశతో ట్రేడింగ్ చేశాం. కానీ ఆ లక్ష్యం నెరవేరలేదు. రష్యా, చైనా దేశాలు వాళ్ల ఎకనామికల్ మోడల్‌ను విస్తృతంగా ప్రచారం చేసుకుంటాయి. కానీ వాళ్ల అసలు ఉద్దేశాలేంటన్నది తెలుసుకోలేక పోయాం. ముందే ఇది గ్రహించాల్సి ఉండాల్సింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది కూడా ఈ కారణంగానే. నియంతలా వ్యవహరించాలని చూసే దేశాలపై పోరాడాన్ని ఉద్ధృతం చేయాల్సిందే" 

 

- లిజ్ ట్రస్, యూకే మాజీ ప్రధాని