సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్, సపోర్ట్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారిని చాలా కొద్దిమందినే చూస్తుంటాం. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. కేవలం తన టాలెంట్ ను మాత్రమే నమ్ముకొని చిత్రసీమలో అడుగుపెట్టిన నాని.. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ, తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకొని మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. చూడగానే పక్కింటి కుర్రాడిలా, మన ఇంట్లో మనిషిగా అనిపించే నాని పుట్టిన రోజు నేడు (ఫిబ్రవరి 24). ఈ సందర్భంగా సినిమాల్లోకి రాకముందు నాని ఏం చేశారు? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? వంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం!


నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. 1984 ఫిబ్రవరి 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని చల్లపల్లి అనే గ్రామంలో ఘంటా రాంబాబు, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే తన కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడటంతో చదువు మొత్తం అక్కడే సాగింది. సెయింట్ ఆల్ఫోన్సా స్కూల్ లో పదో తరగతి చదివిన నాని.. ఎస్ఆర్ నగర్ లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియేట్ పూర్తి చేశారు. వెస్లీ కాలేజ్ లో డిగ్రీ చదివారు. 


నానికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే మహా ఇష్టం. చదువుకునే రోజుల్లోనే అతని మనసు సినిమాల వైపు పరుగులు తీసింది. అయితే సినిమాల్లోకి వెళ్లాలంటే బ్యాగ్రౌండ్ ఉండాలని, అందం ఉండాలని, డ్యాన్సులు, గుర్రపు స్వారీ ఇలాంటివి వచ్చి ఉండాలని అనుకునేవాడట. అవేవీ తనకి లేకపోవడంతో డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడట. మణిరత్నం మూవీస్ ని విపరీతంగా ఇష్టపడే నాని.. ఎప్పటికైనా ఆయనలా సినిమాలకు దర్శకత్వం వహించాలని కలలు కనేవాడు. ఈ క్రమంలో ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి మొదటగా దర్శకుడు బాపు దగ్గర క్లాప్ అసిస్టెంట్ గా చేరాడు. ఆ తర్వాత రాఘవేంద్ర రావు, శ్రీను వైట్ల, సురేష్ కృష్ణ వంటి డైరెక్టర్స్ దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేశారు నాని.


నాని కొన్నాళ్లు రేడియో జాకీగా కూడా పని చేశారు. అదే సమయంలో దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కంట్లో పడ్డారు. తాను రాసుకున్న కథకు ఈ కుర్రాడైతే బాగా సెట్ అవుతాడని భావించి, నానిని హీరోగా తీసుకున్నారు. అలా నాని 2008లో 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీ హిట్ అవ్వడంతో, వరుస అవకాశాలు నాని తలుపు తట్టాయి. రైడ్, స్నేహితుడా, అలా మొదలైంది, భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్ వంటి సినిమాలు జనాలను ఆకట్టుకున్నాయి. ఇక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన 'ఈగ' మూవీ నానికి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతూ 'నిర్మాతల హీరో', 'మినిమమ్ గ్యారంటీ హీరో' అనిపించుకున్నారు. 


2012లో అంజనా అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు నాని. వీరికి అర్జున్ (జున్ను) అనే బాబు కూడా ఉన్నాడు. హీరోగా రాణిస్తున్న సమయంలోనే నాని నిర్మాతగానూ మారారు. వాల్ పోస్టర్ బ్యానర్ ద్వారా న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. 'అ!' 'హిట్' 'హిట్ 2' సినిమాలను నిర్మించి విజయాలు అందుకున్నాడు. అలానే 'మీట్ క్యూట్' అనే వెబ్ సిరీస్ ని నిర్మించి, తన సోదరి దీప్తి ఘంటాను డైరెక్టర్ గా లాంచ్ చేశారు. 


అందరిలానే నానీకి హిట్స్ ఉన్నాయి.. ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్ మ్యాన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి సినిమాలు మంచి విజయాలను అందించాయి. అయితే MCA తర్వాత తన రేంజ్ కు తగ్గ సక్సెస్ అందుకోలేపోతున్నారు. గతేడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న 'అంటే.. సుందరానికి' సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాని 'దసరా' చిత్రంతో వస్తున్నారు. దీని కోసం ఎన్నడూ లేని విధంగా ఊర మాస్ అవతార్ లోకి మారిపోయారు. 


'దసరా' నేచురల్ స్టార్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తెరకెక్కిన సినిమా. అంతేకాదు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవాలని, భవిష్యత్తులో కూడా మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ.. 'ABP దేశం' నానికి బర్త్ డే విషెస్ అందజేస్తోంది.


Read Also: ఆ సినిమా ఓ అద్భుతం, 90 సెకన్ల టీజర్‌తో అంచనా వేసేస్తారా? - ‘ఆదిపురుష్’ ఎడిటర్ ఆశిష్