వెబ్ సిరీస్ రివ్యూ : పులి మేక 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : లావణ్యా త్రిపాఠి, ఆది సాయి కుమార్, సుమన్, సిరి హనుమంతు,  గోపరాజు రమణ, రాజా చెంబోలు, ముక్కు అవినాష్, మయాంక్ తదితరులు
రచన : కోన వెంకట్, వెంకటేష్ కిలారు
ఛాయాగ్రహణం : రామ్ కె. మహేష్ 
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
దర్శకత్వం : చక్రవర్తి రెడ్డి .కె
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2023
ఓటీటీ వేదిక : జీ5
ఎపిసోడ్స్ : 8


కథానాయిక లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'పులి మేక' (Puli Meka Web Series). ఇందులో ఆమెకు జోడీగా ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) నటించారు. ఇది జీ5 ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ సిరీస్. దీనికి భారీ తారాగణం, సాంకేతిక వర్గం పని చేసింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ రచన, నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందింది. గోపీచంద్ 'పంతం' దర్శకుడు చక్రవర్తి తెరకెక్కించారు. ఈ సిరీస్ ఎలా ఉంది?


కథ (Puli Meka Web Series Story) : కిరణ్ ప్రభ (లావణ్యా త్రిపాఠి) ఐపీఎస్ ఆఫీసర్. క్రిమినల్ సైకాలజీలో మాస్టర్స్ చేసిన అమ్మాయి. ట్రైనీగా ఉన్నప్పుడు కరీంనగర్‌లో సీరియల్ కిల్లర్‌ను 48 గంటల్లో పట్టుకున్న ధీశాలి. వరంగల్‌లో పాఠశాలకు వెళ్లే అమ్మాయిల కిడ్నాప్, చైల్డ్ ట్రాఫికింగ్ కేసును సైతం కొన్ని గంటల్లో ఛేదిస్తుంది.  ఆమెపై కమిషనర్ అనురాగ్ నారాయణ్ (సుమన్)కు నమ్మకం ఎక్కువ. అందుకని, హైదరాబాద్ సిటీలో వరుసగా పోలీసులను టార్గెట్ చేస్తూ చంపేస్తున్న సీరియల్ కిల్లర్ కేసును కిరణ్ ప్రభకు అప్పగిస్తారు. తొలుత ముగ్గురు పోలీసులు, ఆ తర్వాత ఓ గవర్నమెంట్ డాక్టర్ హత్యకు గురి అవుతారు. ఈ కేసును కిరణ్ ప్రభ ఎలా సాల్వ్ చేశారు? ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర్ శర్మ (ఆది సాయి కుమార్)తో పరిచయం, ప్రేమ కహానీ ఏంటి? పల్లవి (సిరి హనుమంతు), కరుణాకర్ శర్మ (రాజా) పాత్రలు ఏమిటి? అసలు సీరియల్ కిల్లర్ ఎవరు? హత్యలు చేయడానికి గల కారణం ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ : వెండితెరపై చెప్పలేని కథలను, కొత్త అంశాలను చెప్పడానికి ఓటీటీ సరైన వేదిక అని దర్శక, రచయితలు చెబుతుంటారు. న్యూ ఏజ్ కథలతో వెబ్ సిరీస్, సినిమాలు తీస్తున్నారు. కోన వెంకట్ అండ్ కో 'పులి మేక'లో కొత్త కథను ఏమీ చెప్పలేదు. వెండితెరపై చెప్పగలిగే కథతో వెబ్ సిరీస్ తీశారు. ఫిమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కావడంతో సినిమా కంటే సిరీస్ చేయడంలో రిస్క్ తక్కువని భావించారేమో!?


కోన వెంకట్ కమర్షియల్ సినిమా రచయిత! ఆయన ప్రయోగాలు చేసింది తక్కువ. 'పులి మేక' సిరీస్ విషయంలోనూ ఆయన కమర్షియల్ పంథాలో వెళ్ళారు. హీరోయిన్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ కమర్షియలే. ఆ క్రమంలో కమర్షియల్ సినిమాల్లో రచయితలు తీసుకునే లిబర్టీనీ తీసుకున్నారు. దర్శకుడు చక్రవర్తి కూడా సినిమా తీసినట్టు తీశారు. అందువల్ల, వెబ్ సిరీస్‌లలో కనిపించే సహజత్వం మిస్ అయ్యింది. సన్నివేశాలు రొటీన్ అనిపిస్తాయి. 


'పులి మేక' కథ కంటే కథను చెప్పిన తీరు బావుంది. వీక్షకులను ఆకట్టుకుంటుంది. రొటీన్ సీన్స్ తర్వాత వచ్చే ట్విస్టులు నెక్స్ట్ ఎపిసోడ్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. సాధారణంగా చివరి వరకు కిల్లర్ ఎవరనేది చెప్పకుండా సిరీస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటారు దర్శక, రచయితలు. కానీ, 'పులి మేక' టీమ్ అలా చేయలేదు. నాలుగో ఎపిసోడ్‌లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేశారు. తర్వాత కథా గమనం మారింది. ట్విస్టుల కోసం కొన్ని లాజిక్కులను కూడా పక్కన పెట్టేశారు. ఆ స్వేచ్ఛ బాగా తీసుకున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బావుంది.


నటీనటులు ఎలా చేశారంటే? : లావణ్యా త్రిపాఠికి 'పులి మేక'లో యాక్షన్ సీన్స్ చేసే ఛాన్స్ లభించింది. డిఫరెంట్ గెటప్స్ & వేరియేషన్స్ చూపించే ఛాన్స్ కూడా! స్టార్టింగ్ ఎపిసోడులో బోనాల జాతర సన్నివేశంలో మహంకాళిలా వేసే గెటప్ హైలైట్. ఐపీఎస్ అధికారి పాత్రలో చక్కగా నటించారు. ఖాకీ డ్రస్ వేసుకోకపోయినా సరే లావణ్యా త్రిపాఠిని చూడగానే పోలీస్ అనుకునేలా, ఎట్ ద సేమ్ టైమ్ చిన్న గ్లామర్ టచ్ ఇస్తూ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన నీరజ కోనను అప్రిషియేట్ చేయాలి. ప్రభాకర్ శర్మగా ఆది సాయి కుమార్ అవలీలగా నటించారు. ఆయనకు ఈ తరహా పాత్రల్లో నటించడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే, లావణ్య & ఆది మధ్య కెమిస్ట్రీ మిస్ అయ్యింది. అందువల్ల, ఆ ట్రాక్ ఆకట్టుకోలేదు. సుమన్, గోపరాజు రమణ, ముక్కు అవినాష్, మయాంక్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. 'సిరివెన్నెల' కుమారుడు రాజా క్యారెక్టర్ సర్‌ప్రైజ్ చేస్తుంది. సిరి హనుమంతుకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లభించింది.


Also Read : 'శ్రీదేవి శోభన్ బాబు' రివ్యూ : చిరంజీవి కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : ట్విస్టులతో కూడిన కమర్షియల్ సినిమా లాంటి వెబ్ సిరీస్ 'పులి మేక'. కథలో కొత్తదనం ఆశించవద్దు. జస్ట్, స్క్రీన్ మీద మేజిక్ ఎంజాయ్ చేయాలంతే! 'పులి మేక'లో ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్, సస్పెన్స్ ఉన్నాయి. అయితే, అన్నీ రొటీన్‌గా ఉంటాయి. కమర్షియల్ థ్రిల్లర్ జానర్ & లావణ్యా త్రిపాఠి ఫ్యాన్స్ కోసమే!


Also Read : 'వినరో భాగ్యము విష్ణు కథ' రివ్యూ : కిరణ్ అబ్బవరానికి హిట్ వచ్చిందా? లేదా?