సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. ఏ హీరో కెరీర్ అయినా దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. హిట్లు ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకున్నవారే, ఫ్లాప్స్ పలకరించినప్పుడు పట్టించుకోవడం మానేస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ సక్సెస్ కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు.. క్రేజ్ ను కాపాడుకోడానికి, మార్కెట్ ని నిలబెట్టుకోడానికి కష్టపడుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హిట్టు కోసం పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తున్న హీరోలు చాలా మందే ఉన్నారు.


రౌడి బాయ్‌కు కావాలో హిట్


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2018లో 'టాక్సీవాలా' సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న VD.. ఆ తర్వాత మరో హిట్టు రుచి చూడలేకపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'డియర్ కామ్రేడ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచగా, 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని 'లైగర్' సినిమాతో వచ్చిన యువ హీరో.. ఈసారి పాన్ ఇండియా మార్కెట్ లో బొక్కబోర్లా పడ్డాడు. ఇది విజయ్ కెరీర్ లోనే కాదు.. టాలీవుడ్ లోనే అతి పెద్ద పరాజయాలలో ఒకటిగా నిలిచింది. అయినా సరే ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సత్తా చాటడానికి ప్లాన్స్ వేసుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి'.. గౌతమ్ తిన్ననూరితో కలిసి ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు విజయ్.


సక్సెస్ కోసం సంతోష్ శోభన్


2015లో 'తను నేను' అనే చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సంతోష్ శోభన్.. గత ఏడేళ్లుగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. 'ఏక్ మినీ కథ' వంటి ఓటీటీ చిత్రంతో పర్వాలేదనిపించినా, వెంటనే 'మంచి రోజులొచ్చాయి' 'లైక్ షేర్ & సబ్ స్క్రయిబ్' లాంటి వరుస ప్లాప్స్ పడ్డాయి. అలానే ఈ ఏడాది ప్రారంభంలో 'కళ్యాణం కమనీయం' మూవీ నిరాశ పరచగా, ఇటీవల వచ్చిన 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా కూడా పరాజయం పాలైంది. సంతోష్ ప్రస్తుతం 'ప్రేమ్ కుమార్' చిత్రంతో పాటుగా నందినీ రెడ్డి దర్శకత్వంలో 'అన్నీ మంచి శకునములే' అనే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు.


సందీప్ కిషన్‌ దారెటు?


పుష్కరకాలం క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యంగ్ హీరో సందీప్ కిషన్ మంచి హిట్టు కొట్టి దశాబ్దం అయింది. 'తెనాలి రామకృష్ణ' 'ఏ1 ఎక్స్ ప్రెస్' 'గల్లీ రౌడీ' వంటి చిత్రాలు సందీప్ కు ఆశించిన విజయాలు అందించలేకపోయాయి. రెండేళ్ల గ్యాప్ తీసుకొని చేసిన పాన్ ఇండియా మూవీ 'మైఖేల్' కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. దీంతో ఇప్పుడు సందీప్ కు అర్జెంట్ గా ఓ హిట్ అవసరముంది. ఈ నేపథ్యంలో వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే 'కెప్టెన్ మిల్లర్' వంటి తమిళ్ మూవీలో భాగం అవుతున్నాడు.


ఆదికి హిట్టు లేదు, అవకాశాలు ఫుల్


హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో ఆది సాయి కుమార్. గతేడాది 'అతిధి దేవోభవ' 'తీస్ మార్ ఖాన్' 'క్రేజీ ఫెల్లో' 'బ్లాక్' 'టాప్ గేర్' వంటి ఐదు సినిమాల్లో నటించిన ఆది.. వచ్చే నెలలో 'సీఎస్ఐ సనాతన్' చిత్రంతో పలకరించనున్నారు. 'జంగిల్' 'కిరాతక' 'అమరన్ ఇన్ ది సిటీ' వంటి మరో మూడు ప్రాజెక్ట్స్ యువ హీరో చేతిలో ఉన్నాయి. ఇక 'Rx100' తర్వాత కార్తికేయకు హీరోగా సరైన సక్సెస్ అందలేదు. పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. 'చావు కబురు చల్లగా' 'రాజా విక్రమార్క' సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇప్పుడు 'బెదురులంక 2012' సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.


కిరణ్ అబ్బవరంకు కాస్త ఊరట


ఇక 'SR కల్యాణ మండపం' సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం.. 'సమ్మతమే' 'సెబాస్టియన్' 'నేను మీకు కావాల్సినవాడిని' వంటి హ్యాట్రిక్ ప్లాప్స్ చవిచూశాడు. ఇటీవల వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోలో హిట్టు కొట్టి చాలా కాలమే అయింది. మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో అనేకమంది యువ హీరోలు ఇప్పుడు హిట్టు కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. మరి వీరిలో ఎవరెవరు సక్సెస్ అవుతారో చూడాలి.


Read Alos: హాలీవుడ్ టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్న చెర్రీ, తారక్ - ఆ అవార్డుల్లో 2 కేటగిరీల్లో నామినేషన్స్