భారతీయ సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన ‘RRR‘ మూవీ, ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు 'క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్'లో రెండు కేటగిరీలకు నామినేషన్స్ దక్కించుకుంది. బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ (జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్) కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. ‘టాప్ గన్: మావెరిక్’, ‘బుల్లెట్ ట్రైన్’, ‘ది అన్‌బేరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్’,  ‘ది ఉమెన్ కింగ్‌’తో  పాటు బెస్ట్ యాక్షన్ మూవీ విభాగంలో ‘RRR‘ మూవీ నామినేట్ అయ్యింది. బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ క్యాటగిరిలో హాలీవుడ్ ప్రఖ్యాత నటులు టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటికి దిగారు. ఈ అవార్డుల ఫలితాలు మార్చి 16న విడుదల చేయనున్నారు. తాజా నామినేషన్స్ తో  ‘RRR‘  బృందం సంతోషంలో మునిగిపోయింది. తమ సినిమా ఈ అవార్డులను సైతం అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.     






‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మక సినీ అవార్డులు


ఇక ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఇప్పటికే ఈ పాటకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఆస్కార్ తర్వాత ఆస్కార్ స్థాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డు ‘నాటు నాటు’ పాటకు దక్కింది. క్రిటిక్ ఛాయిస్ అవార్డు అందుకుంది హాలీవుడ్ దర్శక దిగ్గజాలు సైతం జక్కన్న ప్రతిభను మెచ్చుకుంటున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో స్టీవెన్ స్పిల్‌ బర్గ్‌, క్రిటిక్ ఛాయిస్ అవార్డుల వేడుకలో  జేమ్స్ కామెరూన్‌ రాజమౌళితో మాట్లాడారు. ఆయన దర్శక నైపుణ్యాన్ని అభినందించారు.    


ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ‘RRR‘  


ఎన్టీఆర్,రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది.  డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ‘RRR‘ సినిమాను నిర్మించారు.  ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25, 2022న ఈ మూవీ  విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది.  తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు.  ఇందులో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌  పోరాట యోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో నటించారు. హాలీవుడ్ నటీ ఒలివియా మోరీస్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. శ్రియ, అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రల్లో నటించారు.






Read Also: అమెరికాలో మరోసారి ‘RRR‘ తుఫాన్, మార్చిలో 200 థియేటర్లలో రీరిలీజ్