Diwali News: దీపావళి సందడి నాలుగు రోజులు ముందుగానే దేశవ్యాప్తంగా మొదలైపోయింది. కొత్త వస్తువులు కొంటున్న వాళ్లు కొందరైతే... బంగారం కొనుగోలు చేస్తున్న వారు మరికొందరు. దేశవ్యాప్తంగా బాణసంచా దుకాణాలు భారీగా వెలిశాయి. అక్రమంగా నిల్వచేసిన బాణసంచా ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బాణసంచా పేలుళ్లు కంగారు పుట్టిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే రెండు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి. కేరళలో జరిగిన దుర్ఘటనలో 150 మందికిపైగా గాయపడ్డారు.
కేరళలో బాణసంచా పేలి 150 మందికి గాయాలు
కేరళలో భారీ ప్రమాదం జరిగింది. ఓ దేవాలయ వద్ద బాణసంచా పేలి 150మంది వరకు గాయపడ్డారు. వీరిలో పది మందికిపైగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాసర్‌గోడ్‌లో ఉన్న ఆలయ సమీపంలో ప్రమాదం జరిగింది. రాత్రి వేళలో బాణసంచా నిల్వ ఉంచిన గోదాంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 150 మందికిపైగా వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కాసర్‌గోడ్, కన్నూర్, మంగళూరులోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీరర్కావు దేవాలయం సమీపంలోని బాణసంచా నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగినట్టు పోలీసులు చెబబుతున్నారు. అర్థరాత్రి సమయంలో ప్రమాదం జరిగడం వల్ల ఎక్కువ మంది గాయపడ్డారని అంటున్నారు. గాయపడిన వారిలో పదిమందిపైగా వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఘటనా స్థలం నుంచి నమూనాలు సేకరించారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. బాణసంచా నిల్వ కేంద్రానికి సమీపంలోనే క్రాకర్స్ పేల్చడంతో ప్రమాదం జరిగిందని అంటున్నారు. భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టం చేశారు. రెండింటి మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండాలనే రూల్ అతిక్రమించినట్టు వివరించారు. అందులోనూ అక్కడ బాణసంచా నిల్వ చేసుకోవడానికి ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదని చెబుతున్నారు.
యాకుత్‌పురాలో ప్రమాదం ఇద్దరు మృతి
యాకుత్‌పురాలోని ఓ ఇంట్లో బాణసంచా పేలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. అర్థరాత్రి వేళ భారీగా ఎగసిన మంటలతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలడంతో ఉషారాణి, మోహన్‌లాల్ మృతి చెందారు. వాళ్ల కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీళ్లు బాణసంచా దుకాణం పెట్టారు. సాయంత్రం షాపు కట్టేసిన తర్వాత అందులో ఉన్న సరకును ఇంట్లో ఉంచారు. అయితే దీపావళి పిండి వంటలు చేస్తున్న వేళ ప్రమాదం జరిగింది.
కోఠీలో బాణసంచా పేలి ఇద్దరికి గాయాలు
రెండు రోజు క్రితం బొగ్గులకుంటలోని పరస్ ఫైర్‌వర్క్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా అమ్ముతున్న దుకాణంలో మంటలు చెలరేగడంతో జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. బాణసంచా పేలడంతో అగ్ని కీలల వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. అక్కడ పార్క్ చేసి ఉంచిన వాహనాలు దగ్దమయ్యాయి.
Also Read: బాణాసంచా పర్యావరణానికి నిజంగానే హానికరమా!