Nara Lokesh America Tour: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ మంత్రి నారా లోకేష్‌ మైక్రోసాఫ్‌ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న పరిస్థితులు వివరించారు. ఐటీ, స్కిల్‌డెవలప్‌మెంట్‌పై చర్చించారు. డిజిటల్ గవర్నెన్స్‌కు ఐటీ సపోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఏపీ రాజధాని అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా మార్చే ప్రయత్నాల్లో ఉన్నామని దీనికి కూడా సహకారం అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. ‍ఒక్కసారి ఏపీ సందర్శించి పరిస్థితులు చూడాలని సత్యనాదెళ్లను ఆహ్వానించారు. 





ఆదివారం సాయంత్రం ఆస్టిన్‌లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని లోకేష్‌ సంద‌ర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు, అనుకూల‌త‌ల‌ను టెస్లా సిఎఫ్ఓ వైభవ్ తనేజాకు వివ‌రించారు. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. తమ లక్ష్య సాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు  వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుంద‌ని వారికి తెలియజేశారు. 














అనంతరం డాల‌స్‌లో పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌తో కూడా లోకేష్ సమావేశమయ్యారు. రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, డాటా సెంటర్, ఎనర్జీ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ చేస్తున్న పెరోట్ గ్రూప్ 27,000 ఎకరాల మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీ అలయన్స్ టెక్సాస్‌ను అభివృద్ధి చేసి గుర్తింపు పొందారు. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతంలో అనువైన వాతావరణం నెలకొని ఉంద‌ని, ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాల‌ని కోరారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లు, పెద్ద పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించాల‌ని విజ్ఞప్తి చేశారు. 






 


అంతకు ముందు రోజు శాన్‌ఫ్రాన్సిస్కోలో డ్రాప్ బాక్స్‌కో ఫౌండర్ సుజయ్ జస్వా నివాసంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు నారా లోకేష్. అమరావతి రాజధాని పరిసరాల్లో ప్రభుత్వరంగంలో 3బిలియన్ డాలర్లు, ప్రైవేటు రంగంలో 4.5బిలియన్ డాలర్లతో వివిధ నిర్మాణాలు, అభివృద్ధి పనులు ప్రారంభంకానున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ, మూలపేట ప్రాంతాల్లో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పోర్టులు అందుబాటులోకి రాబోతున్నాయని వివరించారు. ఏడాదిన్నరలో పూర్తికానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా పెద్దఎత్తున ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోంటాయని వారికి సమాచారం ఇచ్చారు. అమరావతిలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎఐ సంస్థలకు అవరమైన మ్యాన్ పవర్ అందుబాటులో ఉంటుందన్నారు. అన్నివిధాలా అనుకూల వాతావరణం కలిగిన ఎపిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.