ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీఓటర్ సర్వే చేసింది. తాజా ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఉత్తరాఖండ్‌, మణిపుర్‌లలో కాంగ్రెస్-భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొనగా గోవాలో మాత్రం కాషాయ పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకోనున్నట్లు తేలింది. మరి పూర్తి ఫలితాలు మీరే చూడండి.


ఉత్తరాఖండ్.. 


ఉత్తరాఖండ్‌లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి భాజపా, కాంగ్రెస్ మధ్య అధికారం దోబూచులాడుతోంది. మరి ఫిబ్రవరి 14న జరగనున్న తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించనుంది. ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు ఒక విడతలోనే జరగనున్నాయి.


యువ సీఎం పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో భాజపా బరిలో ఉంది. మరోవైపు కాంగ్రెస్.. తమ సీనియర్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌పైనే నమ్మకం పెట్టుకుంది. ఆమ్‌ఆద్మీ కూడా ఈసారి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. 




ఈసారి కాంగ్రెస్- భాజపా మధ్య పోటీ నువ్వా-నేనా అనేలా ఉండే అవకాశం ఉంది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారల భాజపా 31-37 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలో తేలింది. కాంగ్రెస్‌కు 31-36 స్థానాలు దక్కే అవకాశం ఉంది. స్పష్టమైన ఆధిక్యం ఎవరు సాధిస్తారనేది చెప్పడం కష్టంగా ఉంది. ఎందుకంటే మేజిక్ ఫిగర్ 35 కాగా ఆమ్‌ఆద్మీకి కూడా 2-4 స్థానాలు దక్కే అవకాశం లేకపోలేదు. దీంతో ఆప్ కింగ్ మేకర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


గోవాలో..


గోవా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒక్క విడతలోనే ఫిబ్రవరి 14న జరగనున్నాయి. 40 అసెంబ్లీ స్థానాలు కలిగిన గోవాలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలు, భాజపా 13 చోట్ల గెలుపొందాయి. ఇతరులు 10 చోట్ల గెలిచారు. కానీ ఇతరుల సాయంతో భాజపా అధికారం దక్కించుకుంది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలోకి చేరిపోగా ప్రస్తుతం భాజపాకు 27 మంది, కాంగ్రెస్‌కు నలుగురు శాసనసభ్యులు ఉన్నారు.


మళ్లీ భాజపా..




రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 19-23 స్థానాల్లో గెలుపొందనున్నట్లు సర్వేలో తేలింది. కాంగ్రెస్ 4-8 స్థానాలు, ఆమ్‌ఆద్మీ అనూహ్యంగా 5-9 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. స్థానిక పార్టీ ఎమ్‌జీపీకి 2-6 సీట్లు దక్కొచ్చు.


మణిపుర్‌లో నువ్వా-నేనా..


మణిపుర్‌లో కూడా కాషాయ పార్టీ కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. 60 స్థానాలున్న మణిపుర్‌ అసెంబ్లీలో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.




అయితే ఈ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది. ఏబీపీ-సీఓటర్ సర్వే ప్రకారం భాజపా 23-27 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా కాంగ్రెస్ 22-26 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. నాగా ఎథినిక్ పార్టీ ఎన్‌పీఎఫ్ 2-6 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది.


Also Read: ABP C-Voter Survey: పంజాబ్‌లో హంగ్ తప్పదా? మరి కింగ్ మేకర్ ఎవరు? తాజా ABP C-Voter సర్వే ఫలితాలివే


Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి