ABP Cvoter conducted opinion polls in key states :  దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఒపీనియన్ పోల్స్ వెల్లడించే ట్రాక్ రికార్డు ఉన్న ఏబీపీ - సీ ఓటర్ మరోసారి ప్రజల అభిప్రాయాలను సేకరించి .. క్రోడీకరించి ఫలితాలను  వెల్లడించింది. కీలకమైన రాష్ట్రాల్లో ప్రజల నుంచి వివరాలు సేకరించి..  ఈ ఒపీనియన్ పోల్స్ ను సిద్ధం చేశారు. ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం. 


గుజరాత్ - బీజేపీ క్లీన్ స్వీప్ 


దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. అక్కడ ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే.. మూడో సారి ప్రధాని అవ్వాలనుకుంటున్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్. గత రెండు సార్లు ప్రజలు మోదీకి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. ఆ రాష్ట్రంలో ఉన్న 26కు 26 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులనే గెలిపిస్తున్నారు. మూడో సారి కూడా గుజరాత్ ప్రజలు సంపూర్ణంగా మోదీపై విశ్వాసం ఉంచుతున్నారని ఏబీపీ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. ఇరవై ఆరుకు ఇరవై ఆరు సీట్లు బీజేపీనే గెల్చుకుంటుందని తేలింది. గుజరాత్‌లో 63 శాతం ఓట్లు బీజేపీకి లభించనున్నాయి. 


 





 


ఉత్తరప్రదేశ్ - ఎన్డీఏదే హవా


ఇక దేశంలో అత్యంత ఎక్కువ నియోజకవర్గాలు ఉన్న యూపీలో ఎవరికి మెజార్టీ వస్తే వారే  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ రావడానికి కారణం యూపీలో క్లీన్ స్వీప్ చేయడమే. ఈ సారి కూడా ఎన్డీఏ కూటమికి మెరుగైన ఫలితాలు వస్తాయని ఏబీపీ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో తేలింది. యూపీలో మొత్తం 80 లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి 74 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఒక్క సీటు.. సమాజ్ వాదీపార్టీ  ఐదు సీట్లలో గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా  కాంగ్రెస్, సమాజ్ వాదీకి ఆరు పార్లమెంట్ సీట్లే వస్తాయి. మిగిలిన అన్నీ బీజేపీ ఖాతాలో పడనున్నాయి. యూపీ మొత్తం మీద 51 శాతం ఓట్లు బీజేపీ ఖాతాలో పడతాయి. 


హిమాచల్ ప్రదేశ్ -  బీజేపీదే ఆధిక్యం


హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం. అయితే నాలుగు పార్లమెంట్ సీట్లలోనూ బీజేపీ గెలవడం ఖాయమని ఏబీపీ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడటం.. దీనికి కారణంగా కనిపిస్తోంది. మోదీ పాలనపై అక్కడి ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. 65 శాతం మంది ప్రజలు మోదీ కోసం ఓటేయనున్నారు.  





 


జమ్మూకశ్మీర్ లో యూపీఏ - లద్దాఖ్‌లో ్బీజేపీ 


జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు అంటే ప్రపంచం అంతా అటు వైపు చూస్తుంది. ఈ సారి అక్కడ ఐదు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. కాంగ్రెస్ కూటమి మూడు స్థానాలు.. బీజేపీ కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో తేలింది. జమ్మూకశ్మీర్ కోసం.. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నా.. బీజేపీ క్లీన్ స్వీప్ చేయలేకపోతోంది. ఇక వేరే రాష్ట్రంగా రూపాంతరం చెందిన లద్దాఖ్‌లో ఒక్క సీటు ఉంటే.. అందులో బీజేపీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోందని పోల్‌లో వెల్లడయింది.  జమ్మూ కశ్మీర్ ప్రజలు 44 శాతం మంది కాంగ్రెస్ కు ఓటేయనున్నారు. బీజేపీ 41శాతం ఓట్లతో వెనుకబడింది. 


కేరళలో వామపక్షాలపై కాంగ్రెస్ కూటమిదే విజయం


దేశం మొత్తం వామపక్షాలు, కాంగ్రెస్ స్నేహంగా ఉంటాయి. కానీ కేరళలో మాత్రం బద్ద శత్రువులు. ఈ ప్రభావం లెఫ్ట్ పార్టీలపై గట్టిగా కనిపించబోతోంది. కేరళలో మొత్తం ఇరవై సీట్లు ఉంటే.. అందులో ఇరవై సీట్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గెల్చుకోనుందని ఏబీపీ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి  పోటీ చేయనున్నారు. ఆయన కూడా ఈ సారి మంచి మెజార్టీ గెలిచే చాన్స్ ఉంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 45 శాతం ఓట్లు లభిస్తున్నాయి. 


 





 


రాజస్థాన్ - బీజేపీ కంచుకోట


అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ జరిగినా...  పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి పూర్తి స్థాయిలో బీజేపీకి అండగా ఉంటే రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ఆ రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈ 25 స్థానాల్లోనూ బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని ఏబీపీ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. ఇక్కడ కాంగ్రెస్ నేతల్లో అనైక్యత కారణంగా  ఆ పార్టీ అవకాశాలు దారుణంగా  దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. రాజస్థాన్‌లో బీజేపీకి 59 శాతం ఓట్లు వస్తాయి. 


తమిళనాడలో డీఎంకే స్వీప్


ఇక దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తమిళనాడులో బీజేపీ కానీ.. అన్నాడీఎంకే కూటమి కానీ ఖాతా తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. డీఎంకే కూటమి తమిళనాడులో ఉన్న మొత్తం 39  స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని  ఏబీపీ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో స్పష్టమయింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో రపోటీ చేసిన అన్నాడీఎంకే ఈ సారి బీజేపీ లేకుండానే బరిలోకి దిగుతోంది. బీజేపీ ఒంటరిగా పోరాటం చేస్తోంది. తమిళనాడులో డీఎంకే కూటమికి 54 శాతానికిపైగా ఓటర్ల మద్దతు కనిపిస్తోంది. 


ఉత్తరాఖండ్‌లో స్వీప్


ఇక పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏబీపీ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఆ ఐదు స్థానాలనూ బీజేపీ గెల్చుకుంటుంది. 63 శాతం ఓటర్లు బీజేపీకి పట్టం కట్టనున్నారు. 


[Disclaimer: Current survey findings and projections are based on CVoter Opinion Poll Computer Assisted Telephone Interview (CATI) conducted among 41,762 adults, all confirmed voters. The surveys were conducted from February 1 to March 10, 2024. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. The final data has socio-economic profiles within +/- 1% of the demographic profile of the states. We believe this will give the closest possible trends. The sample spread is across all 543 electoral constituencies in the country. The margin of error is +/- 5% and the vote share projections have been done with 95% confidence interval.]