Delhi Mayor Election:
ఢిల్లీ మేయర్ ఎన్నిక..
ఢిల్లీ మేయర్ పదవిపై కొన్ని నెలలుగా బీజేపీ, ఆప్ మధ్య యుద్ధం జరుగుతోంది. చివరకు ఈ యుద్ధానికి తెర పడింది. ఆప్‌నకు చెందిన షెల్లీ ఒబెరాయ్ (Shelly Oberoi) మేయర్‌గా విజయం సాధించారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఇన్నాళ్లు వాయిదా పడిన మేయర్ ఎన్నిక...ఇప్పుడు ముగిసింది. దాదాపు మూడు సార్లు ఈ ఎన్నిక నిర్వహించేందుకు ప్రయత్నించినా...ప్రతిసారీ ఈ రెండు పార్టీల మధ్య గొడవ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం 24 గంటల్లోగా మేయర్ ఎన్నికకు సంబంధించిన తేదీని ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. మేయర్, డిప్యుటీ మేయర్‌తో పాటు స్టాండింగ్ కమిటీలోని సభ్యుల ఎన్నిక కూడా పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు ఈ తీర్పునిచ్చింది. ప్రస్తుతం మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాకే...ఈ చిక్కుముడి వీడింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు మేయర్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (DMC)చట్టం 1957 ప్రకారం...తొలి సెషన్‌లోనే మేయర్, డిప్యుటీ మేయర్‌ను ఎన్నుకోవాలని ఉన్నట్టు గుర్తు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ చిక్కులన్నీ దాటుకుని వచ్చాక కానీ మేయర్ ఎన్నిక పూర్తి కాలేదు. దాదాపు పదేళ్ల తరవాత ఢిల్లీ మేయర్‌గా ఓ మహిళ ఎన్నికైంది మళ్లీ ఇప్పుడే. 150 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు షెల్లీ ఒబెరాయ్. ఈ విజయం తరవాత ఒబెరాయ్ స్పందించారు. సభ గౌరవాన్ని కాపాడతానని హామీ ఇచ్చారు. సభ సజావుగా సాగేలా సభ్యులందరూ సహకరించాలని కోరారు. కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పని చేస్తానని చెప్పారు. బీజేపీ తమను అణిచివేయాలని చూసినా ఎదుర్కొని విజయం సాధించామని ఆప్ నేతలు వెల్లడించారు.
"రాజ్యాంగబద్ధంగా ఈ సభ నడుపుతానని హామీ ఇస్తున్నాను. సభ్యులందరూ నాకు సహకరించి సభను గౌరవిస్తారని, సజావుగా నడిచేలా చూస్తారని ఆశిస్తున్నాను"
-షెల్లీ ఒబెరాయ్, ఢిల్లీ మేయర్