Rahul Gandhi on Kids:


ఇటాలియన్ డెయిలీ ఇంటర్వ్యూ..


రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరు అనగానే...అందరికీ రాహుల్ గాంధీ గుర్తొస్తారు. ప్రస్తుతం ఆయన వయసు 52 ఏళ్లు. అయినా బ్రహ్మచారిగానే ఉన్నారు. చాలా సందర్భాల్లో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినా ప్రతిసారీ ఏదో ఫన్నీగా జవాబు ఇచ్చి తప్పించుకుంటారు రాహుల్. అయితే..."ఎలాంటి అమ్మాయి కావాలి" అని ఎవరో ప్రశ్నించగా  రాహుల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తన తల్లి సోనియా గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీలోని క్వాలిటీస్‌ ఉన్న అమ్మాయి తన లైఫ్‌ పార్ట్‌నర్‌గా ఉంటే బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు మరోసారి తన మనసులోని మాట బయట పెట్టారు రాహుల్ గాంధీ. తనకు పిల్లలంటే ఇష్టం అంటూ ఇటాలియన్ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కావాలనే ఆలోచన తనకూ వచ్చిందని అన్నారు. ఇప్పటికీ సింగిల్‌గా ఎందుకున్నారని అడగ్గా..."ఏమో నాకే తెలియదు" అని బదులిచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో భారత్ జోడో యాత్ర గురించీ మాట్లాడారు. 


"భారత్ జోడో యాత్ర నాకో తపస్సు లాంటిది. దేశ పౌరుల పరిస్థితులెలా ఉన్నాయో తెలుసుకునే అవకాశం కలిగింది. హిందూ ముస్లింల మధ్య విభేదాలున్న మాట వాస్తవమే. అయితే..దేశంలోని పేదరికం, ద్రవ్యోల్బణం లాంటి అసలైన సమస్యల్ని దారి మళ్లించేందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఫాసిజం పాలన నడుస్తోంది. స్వతంత్ర సంస్థలన్నీ బీజేపీ, ఎన్‌డీఏ చెప్పినట్టుగా నడుచుకుంటున్నాయి. బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు తప్పకుండా ఒక్కటి కావాల్సిందే" 


- రాహుల్ గాంధీ 


ప్రతిపక్షాలు ఒక్కటై సరైన రూట్‌మ్యాప్‌ వేసుకుంటే కచ్చితంగా బీజేపీని ఓడించొచ్చని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి రాజీవ్ గాంధీ గురించి కూడా ప్రస్తావించారు రాహుల్. "నాన్న ఎవరికీ భయపడలేదు. తన సేఫ్‌టీ గురించి కూడా ఎప్పుడూ ఆలోచించలేదు" అని అన్నారు. అంతకు ముందు ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్. ఇందిరా గాంధీతో తనకున్న బంధాన్నీ గుర్తు చేసుకున్నారు. "ఆమె నాకు రెండో అమ్మ లాంటిది" అని అన్నారు. "ఇందిరా గాంధీలోని లక్షణాలున్న అమ్మాయిలను మీరు ఇష్టపడతారా?" అని ప్రశ్నించగా...ఆసక్తికర సమాధానం చెప్పారు. "ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మా అమ్మ, నాయనమ్మ క్వాలిటీస్‌ కలగలిపి ఉన్న అమ్మాయైతే చాలా మంచిది. అలాంటి అమ్మాయే కావాలి" అని బదులిచ్చారు. 


బలమైన ప్రత్యర్థిని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  పిలుపునిచ్చారు.  2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రత్యామ్నాయం చూపితే 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించగలమని రాహుల్ గాంధీ నమ్మకం వ్యక్తం చేశారు. బీజేపీతో విడివిడిగా కాకుండా నేరుగా తలపడితే మనం విజయం  సాధించగలమని రాహుల్ గాంధీ విపక్షాలకు సూచించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీని తామే ఎదుర్కోగలమని ఎవరికి వారు పోటీ పడుతున్నారు. కానీ రాహుల్ గాందీ మాత్రం కలిసి పోటీ చేద్దామని పిలుపునిచ్చారు. మరి విపక్షాలు స్పందిస్తాయో లేదో వేచి చూడాల్సి ఉంది.        


Also Read: Snooping Case: మనీశ్ సిసోడియాకు మరో షాక్ ఇచ్చిన CBI,గూఢచర్యం చేశారంటూ కేసు నమోదు