Snakebite Deaths in India: భారత్‌లో పాముకాటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విష సర్పాల కారణంగా దేశంలో ఏటా వేల సంఖ్యలో జనాలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు పాముకాటు మరణాలపై బీజేపీ ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ (Rajiv Pratap Rudy)  తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా 30 నుంచి 40 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారని బిహార్‌లోని సరన్ లోక్‌సభ బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు.


లోక్‌సభలో ముఖ్యమైన అంశాలపై చర్చ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ... ప్రతేడాది మన దేశంలో 30 నుంచి 40 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. ఇందులో 50 వేల మంది చనిపోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఎంతో ఆందోళన కలిగించే అంశం. ఇక బిహార్‌ పేదరికంతోపాటు.. ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది.  వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని వల్ల పాము కాటు సంఘటనలు కూడా పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.


ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన డింపుల్ యాదవ్  
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డింపుల్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా డింపుల్ యాదవ్ రైతులు, యువత సమస్యలపై గళం విప్పారు. దీంతో పాటు ప్రభుత్వం చేసిన వాగ్దానాలపైనా ప్రశ్నలు సంధించారు. ఆమె మాట్లాడుతూ.. 'మన దేశం వ్యవసాయాధారిత దేశమని, ఇలాంటి పరిస్థితుల్లో యువతకు, రైతులకు ఏమీ చేయలేక పోతున్నాం. అన్ని రకాల ఆదుకుంటామన్న మాట ఏమైంది. బడ్జెట్‌లో రైతుల కోసం ప్రభుత్వం ఏమి చేసింది? ఉత్తరప్రదేశ్‌కు ఏం వచ్చింది? గత 10 ఏళ్లలో ఒక్క మార్కెట్ అయినా సిద్ధమైందా? జీఎస్టీలో ఏమైనా ఉపశమనం కల్పించారా?  అంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. ఇక పశువుల సంఖ్య పెరిగిపోవడంతో పొలాలను కాపాడుకునేందుకు రాత్రంతా జాగారం చేయాల్సి వస్తోందని, విచ్చలవిడి పశువుల బెడదతో ప్రజలకు నిద్ర పట్టడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర బడ్జెట్‌లో ఏమైనా ఏర్పాట్లు చేశారా అని డింపుల్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 


రైతుల ఆత్మహత్యలపై ప్రశ్నలు  
దేశంలో రైతుల ఆత్మహత్యలపై డింపుల్ యాదవ్ మాట్లాడుతూ.. '2020, 2021 సంవత్సరాల్లో రైతుల ఉద్యమంలో 700 మంది రైతులు మరణించారు. ఇది కాకుండా 2014 నుంచి 2022 మధ్య లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కిసాన్ బీమా యోజన ద్వారా ఎంత మంది రైతులు లబ్ధి పొందారు?  అని డింపుల్ యాదవ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ నేడు యువత అసంతృప్తితో ఉన్నారని అన్నారు. అగ్నిపథ్ వంటి పథకాల వల్ల నిరుద్యోగం నిరంతరం పెరుగుతోందన్నారు. కుల గణన, మహిళలపై అఘాయిత్యాలపై ప్రభుత్వం కళ్లు మూసుకుంది. మహిళల భద్రతకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 


ఆరోగ్య భద్రత కోసం బడ్జెట్‌పై విమర్శలు
డింపుల్ యాదవ్  బడ్జెట్‌లో ఆరోగ్య భద్రతపై దృష్టి సారించలేదన్నారు. ఆరోగ్య భద్రతకు కేటాయిస్తున్న బడ్జెట్ దేశ జీడీపీలో 1.9 శాతమని, ఇది చాలా తక్కువగా ఉందన్నారు. ఈ విషయాలన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు.


బీడీ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్
బీడీ కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యను వేలూరు ఎంపీ ఎం.కతీర్ ఆనంద్ లేవనెత్తారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని తెలిపారు.  బీడీ కార్మికుల (beedi workers) దుస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీడీ కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికుల రోజువారీ వేతనాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కతీర్ ఆనంద్ అభ్యర్థించారు. కేంద్రం నిధులు సరిపోవడం లేదని, వారి వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్మికులు దుమ్ము, ఇతర వృత్తిపరమైన ప్రమాదాలకు గురికావడాన్ని గమనించి బడ్జెట్‌ కేటాయింపుల్లో  బీడీ కార్మికుల్లో 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్‌ అందించాలని కేంద్రాన్ని కతీర్ ఆనంద్ కోరారు
 
అన్ని ఖర్చులు భరించాలి  
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పునఃపరిశీలించాలని కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.  అన్ని వైద్య ఖర్చులు కవర్‌ చేసేలా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని తిరిగి సమీక్షించాలని ఆయన కోరారు. ఆరోగ్య సంరక్షణ కవరేజీని మెరుగుపరచడం గురించి కూడా ఆయన మాట్లాడారు.


అవినీతిని గుర్తించండి
మరోవైపు పంజాబ్‌లోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఐసీడీఎస్)లో అవినీతిపై భటిండా ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు సంస్థల ద్వారా నకిలీ లబ్ధిదారులకు సాయం అందజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.