AIMIM MLA Akbaruddin Owaisi Comments against Hyderabad Police | హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషనులకు లంచాలు, మామూళ్లు వెళ్తున్నాయని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ విషయం చెప్పడానికి తాను ఎవరికీ భయపడనని, నిజాలు నిర్భయంగా మాట్లాడుతానంటూ అసెంబ్లీలో చర్చలో భాగంగా ఇలా వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీలో చర్చలో భాగంగా సోమవారం అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ‘ఏసీపీ ర్యాంక్ అధికారి నాకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కోసం డబ్బులు అడిగారు. పీఎస్ కోసం మమ్మల్ని డబ్బులు అడగటం ఏంటి. మీకు వచ్చే మామూళ్లు, లంచాలు ఏమయ్యాయి. ఆ డబ్బులు అయిపోయాయా? వాటితో మీరు పోలీస్ స్టేషన్ కట్టుకోలేరా? ఇదేంటో స్పీకర్ గారు మీరే చెప్పండి. ప్రభుత్వం ఇలాంటి పనులపై ఫోకస్ చేయాలి.
హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది. ఇదే విషయంపై అసెంబ్లీలో హరీష్ రావు, నేను మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బాగుంది అని మంత్రులు చెబుతున్నారు. మళ్లీ నిన్న నగరంలో 3 హత్యలు అయ్యాయి. ఇంటి ముందు నిల్చున్న వారిని కొట్టడం కాదు. నేరస్తులను, దొంగలపై ప్రతాపం చూపించండి. నేరస్థులను పట్టుకోవడం టాస్క్ ఫోర్స్ పోలీసుల పని కానీ, వాళ్లు రాత్రి పూట సామాన్యుల మీద, అది కూడా ఇంటి ముందు నిల్చున్న వారిపై లాఠీఛార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ, పగటి పూట పడుకుంటున్నారా. అందుకే నగరంలో పగటిపూట హత్యలు జరుగుతున్నాయని’ అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది. నగరంలో ఎటు చూసినా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. నగరంలో లా అండ్ ఆర్డర్ పై ఆరోపణలు చేయగా, అంతా ఓకే అని చెబుతున్నారు. మంత్రి అలాంటిదేమీ లేదని చెప్పిన మరుసటి రోజే నగరంలో మూడు హత్యలు జరిగాయంటే ఏమని అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం సమస్య వస్తే, బయటకు వస్తే పోలీసులు కొడుతున్నారు. కొట్టారని బయటకు రాకుండా ఇంట్లోనే కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగులు అయితే అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్తారు, వారిపై సైతం వివరాలు కనుక్కోకుండా లాఠీ ఛార్జ్ చేస్తున్నారని పోలీసులపై ఆరోపణలు చేశారు.