132 Year Old Tunnel in Hospital:


జేజే ఆసుపత్రి ఆవరణలో..


ముంబయిలోని జేజే ప్రభుత్వ ఆసుపత్రి (JJ Hospital)ఆవరణలో 132 ఏళ్ల నాటికి ఓ సొరంగం బయట పడింది. బ్రిటీష్ కాలం నాటి ఈ సొరంగం 200 మీటర్ల పొడవు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మెడికల్ వార్డ్ బిల్డింగ్‌ కింద ఈ టన్నెల వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ఇది మహిళల, పిల్లల ఆసుపత్రి. దీని పేరు Sir Dinshaw Manockjee Petit Hospital. అయితే..తరవాత దీన్ని నర్సింగ్ కాలేజ్‌గా మార్చేశారు. "నర్సింగ్ కాలేజ్‌లో వాటర్ లీకేజ్ సమస్య ఉందని ఫిర్యాదు అందింది. ఇంజనీర్లను పిలిచి సమస్యేంటో చూడాలని చెప్పాం. ఆ సమయంలో సెక్యూరిటీ 
గార్డ్‌లు బిల్డింగ్‌ అంతా పరిశీలిస్తుండగా ఉన్నట్టుండి ఈ సొరంగం కనిపించింది. ఓ వైపు నుంచి ఇది మూసివేసి ఉంది" అని రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. 1890లో అప్పటి ముంబయి గవర్నర్ లార్డ్ రీ ఈ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసినట్టు తెలుస్తోంది. 1890 జనవరి 27న శంకుస్థాపన చేసినట్టు అంచనా వేస్తున్నారు. ఈ హాస్పిటల్ డీన్ డాక్టర్ పల్లవి సప్లే దీనిపై స్పందించారు. " ఈ సొరంగాన్ని గమనించిన వెంటనే ముంబయి కలెక్టర్‌తో పాటు మహారాష్ట్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు కూడా సమాచారం అందించాం" అని వెల్లడించారు. ఈ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన వైద్యులు ఈ సొరంగం ఎత్తు 4.5 మీటర్ల ఎత్తు ఉన్నట్టు తెలిపారు. ఇటుకలతో నిర్మించారని, దీని ఎంట్రెన్స్‌ క్లోజ్ చేసి ఉందని వివరించారు. ఈ సొరంగం ముందు భాగంలో ఇలా సీల్‌ చేసిన ఎంట్రెన్స్‌లు ఎన్నో ఉన్నాయని తెలిపారు. అయితే...ఈ ఆసుపత్రిలో గతంలో పని చేసిన సిబ్బంది కీలక వివరాలు వెల్లడించారు. ఈ హాస్పిటల్ వెనక కూడా ఇలాంటి సొరంగం ఒకటి బయట పడిందని, అది కూడా బ్రిటీష్ కాలం నాటి కట్టడంలానే ఉందని చెప్పారు. ఈ రెండు బిల్డింగ్‌లను సొరంగంతో అనుసంధానమై
ఉంటాయని అంచనా వేస్తున్నారు. 


ఇంకెన్నో నిర్మాణాలు..






1892 మార్చి 15వ తేదీన జాన్ యాడమ్స్ అనే ఓ ఆర్కిటెక్చరల్ ఎగ్జిక్యూటివ్ ఈ టన్నెల్‌ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. అప్పట్లోనే కోటి 19 లక్షల 351 రూపాయలు ఇందుకోసం ఖర్చు చేశారని ప్రాథమిక సమాచారం. ఇవే కాదు. ఈ  జేజే హాస్పిటల్ ఆవరణలో బ్రిటీష్ కాలం నాటి నిర్మాణాలెన్నో ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఈ ప్రాంగణాన్ని పరిశీలించి ఇలాంటి నిర్మాణాలు ఇంకేమైనా ఉన్నాయా అని వెలుగులోకి తీసుకొస్తామని వైద్యులు వెల్లడించారు. 


Also Read: రోజుకు 4 మిలియన్‌ డాలర్ల నష్టం-ట్విట్టర్‌లో ఉద్యోగాల తొలగింపుపై ఎలన్ మస్క్ వివరణ