ట్విట్టర్ కొత్త యజమాని ఎలన్ మస్క్ నిరంతరం ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ ఉద్యోగుల తొలగింపుపై ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. కంపెనీ రోజుకు 4 మిలియన్ డాలర్లు నష్టపోతున్నందున తనకు వేరే మార్గం లేదని చెప్పుకొచ్చారు. అందుకే ఉద్యోగాలను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులందరికీ మూడు నెలల శాలరీ ఇస్తున్నామన్నారు. ఇది చట్టబద్ధంగా 50 శాతం ఎక్కువ అని మస్క్ చెప్పారు.
51 ఏళ్ల మస్క్ అక్టోబర్ 27న ట్విటర్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నారు. నవంబర్ 4న కంపెనీ నుంచి 3,700 మందిని తొలగిస్తున్నట్టు తెలిపారు. తప్పించే క్రమంలో ఉద్యోగులకు రావాల్సిన డబ్బులను జనవరి, ఫిబ్రవరి నాటికి చట్టబద్దంగా చెల్లిస్తామని చెప్పారు.
మెయిల్‌పై తొలగింపు సమాచారం
గత వారం ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తోపాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ), మరికొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను మస్క్ తొలగించారు. కొత్త యాజమాన్యంలో ఇమడలేమనుకున్న వాళ్లు చాలా మంది తమకు తాముగా తప్పుకున్నారు. ఉద్యోగులను కూడా తొలగిస్తారని.... పేరు చెప్పడానికి ఇష్టపడని ట్విట్టర్ ఇండియా ఉద్యోగి ఒకరు చెప్పారు. తన సహచరులు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే మెయిల్స్ సమాచారం అందుకున్నారని వివరించారు. ఈ తొలగింపు భారత్ టీంపై ఎక్కువ ఎఫెక్ట్ పడిందని టాక్. అయితే దీనిపై ట్విట్టర్ ఇండియా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ట్విట్టర్‌లో కీలక మార్పులు
కొత్త యజమాని ఎలాన్ మస్క్ కంపెనీలో కీలక మార్పులు చేశారు. దీని కారణంగానే ట్విట్టర్‌లో ఉద్యోగాల తొలగింపు ప్రారంభమైంది. ఇప్పటికి 7,500 మంది ఉద్యోగుల్లో సగం మందిని తొలగించిందా కంపెనీ. మీడియా నివేదికల ప్రకారం, సుమారు 50 శాతం మంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు. అత్యవసర ప్రాతిపదికన కంపెనీ కంప్యూటర్లు, ఇమెయిల్స్ కు యాక్సెస్ కూడా తీసేసింది.