సినిమా రివ్యూ: విక్రమ్ హిట్ లిస్ట్
రేటింగ్: 2.5/5
నటీనటులు: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ తదితరులతో పాటు అతిథి పాత్రలో సూర్య
మాటలు (తెలుగులో) : హనుమాన్ చౌదరి
యాక్షన్: అన్భు - అరువు
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధర్
సంగీతం: అనిరుధ్ రవిచందర్ 
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్. మహేంద్ర
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్  
విడుదల తేదీ: జూన్ 3, 2022


కమల్ హాసన్ (Kamal Haasan), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil) ప్రధాన పాత్రల్లో... సూర్య అతిథి పాత్రలో నటించిన సినిమా 'విక్రమ్'. తెలుగులో 'విక్రమ్ హిట్ లిస్ట్' పేరుతో విడుదలైంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలుగులో విడుదల చేశారు. 'ఖైదీ', 'మాస్టర్' చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ దీనికి దర్శకుడు. ప్రచార చిత్రాలు పాటలు, సినిమాపై ఆసక్తి పెంచాయి. మరి, సినిమా ఎలా ఉంది (Vikram Telugu Review)?


కథ (Vikram Movie Story): ప్రభుత్వంతో సంబంధం లేకుండా సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంత డబ్బు అవసరం అవుతుందో? అంత విలువ చేసే డ్రగ్స్ ఉన్న కంటైనర్ మిస్ అవుతుంది. దాన్ని పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ప్రభంజన్, అతను దత్తత తీసుకున్న తండ్రి కర్ణన్ (కమల్ హాసన్), మరో అధికారిని ముసుగులు వేసుకున్న కొందరు చంపేస్తారు. వాళ్ళను పట్టుకోవడానికి బ్లాక్ స్వాడ్‌కి చెందిన అమర్ (ఫహాద్ ఫాజిల్)కు పోలీసులు అప్పగిస్తారు. అతడి దర్యాప్తులో కర్ణన్ చావలేదని, కర్ణన్ పేరుతో ఇన్నాళ్ళు అందరి ముందు తిరిగిన వ్యక్తి 1987 బ్లాక్ స్క్వాడ్‌కు చెందిన విక్రమ్ అని తెలుస్తుంది.


డ్రగ్ పెడ్లర్, కోట్లాది రూపాయలు విలువ చేసే డ్రగ్స్ కంటైనర్ కోసం ఎంత మందిని అయినా చంపడానికి వెనుకాడని సంతానం (విజయ్ సేతుపతి)కి విక్రమ్ గురించి తెలుస్తుంది. విక్రమ్ గురించి తెలుసుకునే క్రమంలో సంతానం ఇంటిని అమర్ ధ్వంసం చేస్తాడు. విక్రమ్, అమర్ గురించి తెలుసుకున్న సంతానం ఏం చేశాడు? సంతానాన్ని విక్రమ్ ఎలా అడ్డుకున్నాడు? ఈ కథకు, కార్తీ 'ఖైదీ'కి సంబంధం ఏమిటి? రోలెక్స్ (సూర్య) ఎవరు? అనేది మిగతా సినిమా.  


విశ్లేషణ: మీరు కార్తీ 'ఖైదీ' చూశారా? ఆ సినిమా గుర్తు ఉందా? అది ఎక్కడ అయితే ముగిసిందో... 'విక్రమ్' అక్కడ మొదలవుతుంది. 'ఖైదీ'కి సీక్వెల్ ఇది. అయితే, 'ఖైదీ'లో రెండు మూడు పాత్రలు మాత్రమే ఈ సినిమాలో కనిపిస్తాయి. అందులో మిస్ అయిన డ్రగ్స్ కంటైనర్ చుట్టూ 'విక్రమ్' కథ తిరుగుతుంది. ఆ కథకు, కమల్ హాసన్ 'విక్రమ్' (1986) కథకు లింక్ చేశారు.


సినిమా ఎలా ఉంది?: 'విక్రమ్'లో హీరో ఎవరు? ఫస్టాఫ్ చూసేటప్పుడు సేమ్ డౌట్ వస్తుంది. ఎందుకంటే... కమల్ కంటే ఎక్కువ ఫహాద్ ఫాజిల్ కనిపిస్తారు. సినిమా ప్రారంభం బావుంది. పాత్రలను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత చూసిన సన్నివేశాలను మళ్ళీ చూసినట్టు... ఒకే విషయాన్నీ మళ్ళీ మళ్ళీ చెబుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ ర‌న్‌టైమ్‌. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్... పవర్ హౌస్ లాంటి యాక్టర్లు ఉండటంతో వాళ్ళ పాత్రలను ఎలివేట్ చేయడానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇంటర్వెల్‌కు ముందు కథ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. 


ఇంటర్వెల్ తర్వాత కమల్ హాసన్ కుటుంబ నేపథ్యం వివరించిన తర్వాత రొటీన్, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాగా మారింది. కమల్ చేత తనది రివేంజ్  కాదని చెప్పించినా... రివేంజ్ డ్రామాగా అనిపిస్తుంది.


టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సులు టాప్ క్లాస్. క్లైమాక్స్‌లో యాక్షన్, సినిమాటోగ్రఫీ మధ్య సింక్ బావుంది. వీటన్నిటి కంటే నెక్స్ట్ లెవల్... అనిరుధ్ రవిచందర్ సంగీతం. ప్రతి సన్నివేశంలో నేపథ్య సంగీతం కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బెస్ట్ ఇచ్చినా... బెస్ట్ అవుట్‌పుట్‌ ఇవ్వడంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఫెయిల్ అయ్యాడు. ర‌న్‌టైమ్‌ తగ్గించి కథనంలో వేగం పెంచితే బావుండేది ఏమో! స్టార్స్ పెర్ఫార్మన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసిన ఆయన... కథనం, మిగతా అంశాలపై పెట్టలేదు.


నటీనటులు ఎలా చేశారు?: వయసు పెరుగుతున్న కొద్దీ కమల్ హాసన్ నటనలో పదును పెరుగుతుంది. 'విక్రమ్'గా వయసుకు తగ్గ పాత్ర పోషించారు. ఫైట్స్‌లో ఆయన యాక్షన్, యాక్టింగ్ రెండూ బావున్నాయి. డ్రగ్ పెడ్లర్‌గా, డ్రగ్స్ తీసుకునే వ్యక్తిగా విజయ్ సేతుపతి నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్‌ సూపర్. విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్ సీన్‌ను కూడా మర్చిపోలేం. ఫహాద్ ఫాజిల్ నటన సహజంగా ఉంది. పతాక సన్నివేశంలో  మాత్రమే సూర్య కనిపించినా... ఆయన ఆహార్యం, నటన స‌ర్‌ప్రైజ్‌ చేస్తాయి.


Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
 
ఫైనల్ పంచ్: క్లైమాక్స్... క్లైమాక్స్... సినిమాలో ప్రేక్షకులు అందర్నీ ఆకట్టుకునేది క్లైమాక్స్ ఒక్కటే. దాని అర్థం ముగింపు బావుందని కాదు. నెక్స్ట్ సినిమాపై ఆసక్తి పెంచినందుకు! సూర్య ఎంట్రీ, కమల్ మళ్ళీ అండర్ కవర్‌లోకి వెళ్ళడం... వీళ్ళు ఇద్దరి మధ్య పోరాటం ఎలా ఉంటుంది? అనేది ఆసక్తి కలిగిస్తుంది. 'ఖైదీ'లో కార్తీ పాత్ర గురించి ప్రస్తావించారు. ఈ దారులన్నీ ఎలా కలుస్తాయనేది చూడాలి. అయితే, 'విక్రమ్' మాత్రం ఏవరేజ్ సినిమాగా మిగులుతుంది. మూడు గంటల నిడివి మేజర్ మైనస్. కమల్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య వంటి భారీ తారాగణం... వాళ్ళ నటన సినిమాను నిలబెట్టాయి. వాళ్ళు లేరంటే... సినిమాను భరించడం కష్టం అయ్యేది. స్టార్ కాస్ట్, క్లైమాక్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు.


Also Read: '9 అవర్స్' రివ్యూ: వెబ్ సిరీస్ చూశాక ఆ ఒక్క ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది