వెబ్ సిరీస్ రివ్యూ: ది విలేజ్
రేటింగ్: 1.5/5
నటీనటులు: ఆర్య, దివ్యా పిళ్ళై, 'ఆడుకాలం' నరేన్, ముత్తుకుమార్, జార్జ్ మరియన్, జాన్ కొక్కెన్, పూజా రామచంద్రన్, జయప్రకాశ్, అర్జున్ చిదంబరం, తలైవాసల్ విజయ్ తదితరులు
రచన: దీప్తి గోవిందరాజన్, మిళింద్ రావు, ధీరజ్ వైద్య
ఛాయాగ్రహణం: శివకుమార్ విజయన్
సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్
నిర్మాత: బీఎస్ రాధాకృష్ణ
దర్శకత్వం: మిళింద్ రావు
విడుదల తేదీ: నవంబర్ 24, 2023
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్: 6
సిద్ధార్థ్ హీరోగా నటించిన 'గృహం' తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించింది. ఆ సినిమా దర్శకుడు మిళింద్ రావు తీసిన వెబ్ సిరీస్ 'ది విలేజ్'. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్య, దివ్యా పిళ్ళై, 'ఆడుకాలం' నరేన్, ముత్తు కుమార్, జాన్ కొక్కెన్ తదితరులు నటించారు. హారర్ థ్రిల్లర్ (horror thriller web series)గా రూపొందిన సిరీస్ ఇది!
కథ (The Village Web Series Story): గౌతమ్ (ఆర్య), నేహా (దివ్యా పిళ్ళై) జంట తమ కుమార్తె మాయ (బాబు అజియా)తో ఊరు ప్రయాణమవుతారు. రోడ్డులో యాక్సిడెంట్ కావడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ చూసి షార్ట్ కట్ రూటులోకి వెళతారు. కట్టియాల్ దగ్గరకు వెళ్ళినప్పుడు టైర్ పంక్చర్ అవుతుంది. సహాయం కోసం దగ్గరలోని ఊరికి వెళతాడు గౌతమ్!
కట్టియాల్ ఓల్డ్ ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్ళిన వ్యక్తులు తిరిగి రాలేదు. ఏమయ్యారో కూడా తెలియదు. అందుకని, రాత్రి వేళలో కాకుండా ఉదయం వెళదామని ఊరి ప్రజలు సలహా ఇస్తే కోపంగా వస్తాడు గౌతమ్! అప్పుడు శక్తివేల్ ('ఆడుకాలం' నరేన్), కరు (ముత్తు కుమార్), పీటర్ (జార్జ్ మరియన్) వస్తాడు. వచ్చేసరికి గౌతమ్ భార్య, అమ్మాయితో పాటు కారు కూడా కనిపించదు.
కట్టియాల్ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో శాంపిల్స్ తీసుకు రమ్మని ప్రకాష్ (అర్జున్ చిదంబరం) ల్యాబ్ టెక్నీషియన్లు, వాళ్ళకు రక్షణగా ఆయుధాలతో కూడిన ఫర్హాన్ (జాన్ కొక్కెన్), హ్యాపీ (పూజా రామచంద్రన్) బృందాన్ని పంపిస్తాడు. అసలు, కట్టియాల్ ప్రాంతంలో ఏం జరుగుతోంది? గౌతమ్ భార్య, అమ్మాయి కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు? వాళ్ళకు ప్రకాష్ పంపిన బృందానికి సంబంధం ఏమైనా ఉందా? కట్టియాల్ ప్రాంతంలో ప్రజలకు తెలియని రహస్యాలు ఏమిటి? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (The Village Web Series Review): మిళింద్ రావు తీసిన 'గృహం' చిత్రానికి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. పైగా, హారర్ థ్రిల్లర్ సిరీస్ కావడంతో ఓటీటీ వీక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే... అందుకు తగ్గట్టు సిరీస్ లేదు. తొలి రెండు మూడు ఎపిసోడ్స్‌లో ట్విస్ట్స్ ఏవీ రివీల్ చేయకుండా ఎంగేజ్ చేసి... టేకింగ్, స్క్రీన్ ప్లేతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మిళింద్ రావు, ఒక్కసారి కథలోకి వెళ్ళిన తర్వాత రొటీన్ రూటు తీసుకున్నారు.
'ది విలేజ్' వెబ్ సిరీస్ ప్రాబ్లమ్ ఏమిటంటే... కథలో కొత్తదనం లేదు. ఇంగ్లీష్, ఫారిన్ సినిమాల్లో మనం చూసిన కథ. కనీసం కథనంలో కొత్తదనం ఉందా? అంటే... అదీ లేదు. దర్శకుడు మిళింద్ రావు, రచయితలు ధీరజ్ అండ్ దీప్తి గోవిందరాజన్ 'ది విలేజ్' స్టార్టింగ్ నుంచి రెండు మూడు కథలను నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చెప్పే ప్రయత్నం చేశారు. అఫ్‌కోర్స్ చివరలో మూడు కథలను కలిపారు. సిరీస్ మొదలైన తర్వాత కథలోకి వెళ్ళలేదు. కానీ, ఏదో జరుగుతుందనే చిన్న ఆశ ఉంటుంది. ఒక్క కథలో కూడా కొత్తదనం లేకపోవడంతో చివరకు నిరాశ కలుగుతుంది.
భూస్వాములు, కార్మికుల మధ్య పూర్వంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవి? అనేది 'ఆడుకాలం' నరేన్, ముత్తు కుమార్ కథ ప్రారంభంలో చూపించారు. కార్మికులపై చిన్న చూపు... వంశం, గొప్పదనం అంటూ కాలం చెల్లిన డైలాగులతో రొటీన్ సీన్స్ చూపించారు. ఆర్య, దివ్యా పిళ్ళై మధ్య ఫ్యామిలీ బాండింగ్ ముందు ఎస్టాబ్లిష్ చేయలేదు. దాంతో ఆయన చేసే ఫైట్‌లో ఎమోషన్ మిస్ అయ్యింది. ఇక... అర్జున్ చిదంబరం కథలో కాన్సెప్ట్ బావుంది కానీ రొటీన్ కథల మధ్య అది వెలవెలబోయింది.
మిళింద్ రావు తీసుకున్న ఐడియా బావుంది. కానీ, దానిని ఆసక్తిగా చెప్పడంలో 100 పర్సెంట్ సక్సెస్ కాలేదు. కనీసం పాస్ మార్కులు కూడా పడలేదు. కెమెరా వర్క్ బావుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవలసింది. షో రన్నర్, దర్శకుడిగా మిళింద్ రావు జనాలను డిజప్పాయింట్ చేశారు. 'ది విలేజ్' సిరీస్ స్టార్ట్ అయిన ముందు ఆ సెటప్, విజువల్స్ విపరీతమైన క్యూరియాసిటీ కలిగిస్తాయి. ఆ స్థాయిలో థ్రిల్స్ మాత్రం లేవు. డైలాగులు అసలు బాలేదు. సైన్స్ ఫిక్షన్, మూడ నమ్మకాలు, ప్రేమ అంశాలను సరిగ్గా చెప్పలేదు.
నటీనటులు ఎలా చేశారంటే: గౌతమ్ పాత్రకు ఆర్య 100 పర్సెంట్ ఇచ్చారు. కానీ, వీక్ రైటింగ్ కారణంగా యాక్టింగ్ ఎలివేట్ కాలేదు. ఆయన హీరో అని నమ్మడానికి చాలా టైమ్ పడుతుంది. ఆయన కంటే అర్జున్ చిదంబరం, 'ఆడుకాలం' నరేన్, ముత్తు కుమార్ తదితరులకు ఎక్కువ సీన్లు ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టర్లకు ఉన్న ఎమోషన్స్ ముందు ఆర్య క్యారెక్టర్ ఎమోషన్స్ చిన్నబోయాయి.
Also Read: కోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా?
దివ్యా పిళ్ళై పాత్ర ఐదారు సన్నివేశాలకు పరిమితమైంది. నరేన్, జయప్రకాశ్, జార్జ్, ముత్తు కుమార్, జాన్, పూజా రామచంద్రన్ తదితరులకు ఇటువంటి క్యారెక్టర్లు చేయడం కొత్త కాదు. ఉన్నంతలో అర్జున్ చిదంబరం సెటిల్డ్ అండ్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ చేశారు.
Also Read: ఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
చివరగా చెప్పేది ఏంటంటే: 'ది విలేజ్' గురించి చెప్పాలంటే... ఇదొక ముగ్గురు తండ్రుల కథ. కుమార్తె, భార్యను కాపాడుకోవాలని ప్రయత్నించే తండ్రి ఒకరు... కాళ్ళు పడిపోయి కుర్చీకి పరిమితమైన కొడుకును నడిపించాలని ప్రయోగాలు చేసే తండ్రి మరొకరు... తనను ఎదిరించి ఎర్రకండువా కప్పుకున్న కొడుకు మీద పగ తీర్చుకోవాలనే తండ్రి మరొకరు! ముగ్గురు దారులు ఎలా కలిశాయి? ఎవరి వల్ల ఎవరికి నష్టం కలిగింది? ఎవరికి లాభం చేకూరింది? అనేది సిరీస్! 'మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన' అన్నట్లు కథలు, కథల్లో ఎమోషన్స్ ఎక్కువ కావడంతో ఏ కథకూ న్యాయం జరగలేదు. డిజప్పాయింట్ చేసింది. ఈ సిరీస్ భయపెడుతుంది. సిరీస్ మూమెంట్స్ వల్ల కాదు... ఆ కథ ముందుకు వెళ్లిన తీరు మరింత భయపెడుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply