జయాపజయాలతో సంబంధం లేకుండా.. ప్రతి సినిమాలో విలక్షణతను చూపించే యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ముందుంటాడు. సినిమాలు విజయం సాధించకపోయినా కొత్త తరహా ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ఈ మధ్యకాలంలో సందీప్ కిషన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూ ఉండటంతో.. గల్లీ రౌడీతో కమర్షియల్ బాట పట్టాడు. సినిమా టీజర్, ట్రైలర్లలో యాక్షన్, కామెడీలపై దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ కమర్షియల్ రౌడీ సందీప్ కిషన్‌ను హిట్ బాట ఎక్కించాడా?


కథ: విశాఖ పట్నం నగరంలో ఒకప్పుడు సింహాచలం(నాగినీడు) పేరు మోసిన రౌడీగా ఉండేవాడు. అయితే తన శత్రువు బైరాగి నాయుడు(మైమ్ గోపి)పై పగ తీర్చుకోవడానికి తన మనవడు వాసు(సందీప్ కిషన్)ను రౌడీని చేయాలని చూస్తుంటాడు. అయితే వాసుకు మాత్రం గొడవలంటే అసలు ఇష్టం ఉండదు. కానీ తాను ప్రేమించిన అమ్మాయి సాహిత్య(నేహా శెట్టి)కి వచ్చిన సమస్యను తీర్చడానికి ప్రయత్నించడంలో తనపై రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఏం అయింది? తాత కోరికను నెరవేర్చాడా? ఈ కథలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవి(బాబీ సింహా) పాత్ర ఏంటి? అనేది అసలు కథ.


సాధారణంగా విభిన్న తరహా చిత్రాలు చేసే కథానాయకులు కమర్షియల్ చిత్రాలు చేస్తే ప్రేక్షకులను మెప్పించడం కాస్త కష్టమే. గతంలో నారా రోహిత్ వంటి హీరోల విషయంలో కూడా ఇది నిరూపితం అయింది. ఈ సినిమా కూడా సరిగ్గా ఆ మీటర్‌లోనే ఉంటుంది. కథ, కథనాల్లో భూతద్దం వేసి వెతికినా ఇసుమంత కొత్తదనం కూడా కనిపించదు. కేవలం కామెడీ కోసం.. లాజిక్ లేని సన్నివేశాలతో సినిమాని నింపేశారు. అయితే సందీప్ కిషన్ కామెడీ టైమింగ్‌కు రాజేంద్రప్రసాద్, వైవా హర్ష, వెన్నెల కిశోర్, షకలక శంకర్ వంటి నటులు తోడవ్వడంతో సినిమా అక్కడక్కడా నవ్విస్తుంది.


బాబీ సింహా పాత్రకు ఇచ్చిన బిల్డప్‌కు.. ఆ పాత్ర ప్రవర్తించే విధానానికి అస్సలు సంబంధం ఉండదు. కోన వెంకట్, జి.నాగేశ్వరరెడ్డి సీనియర్లు స్క్రీన్ ప్లే రాసినా... కథనంలో పట్టు కనిపించదు. దీనిపై మరింత దృష్టి పెట్టి ఉండాల్సింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రేక్షకుడు చాలా సులభంగా ఊహించగలడు. అది మరో మైనస్ పాయింట్. చౌరస్తా ఫేమ్ రామ్ మిరియాల, సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పుట్టెనే ప్రేమ పాటను చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ చోటా కె.ప్రసాద్ తన కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది.


ఇక నటీనటుల విషయానికి వస్తే.. సందీప్ కిషన్ వాసు పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు గత సినిమాల కంటే చాలా బాగా చేశాడు. ఇక నటకిరీటీ రాజేంద్రప్రసాద్ స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు. హీరోయిన్ నేహా శెట్టి సినిమాకు గ్లామర్ తీసుకువచ్చింది. వైవా హ‌ర్ష‌, వెన్నెల కిషోర్‌, ష‌క‌లక శంక‌ర్‌లు ప్రేక్షకులను నవ్వించడంలో సఫలం అయ్యారు. బాబీ సింహా పాత్రను పేలవంగా రాసినప్పటికీ తనకున్న స్క్రీన్ టైంలో బాగానే నటించారు.


ఫైనల్‌గా చెప్పాలంటే.. గల్లీ రౌడీ అక్కడక్కడా నవ్విస్తాడు. విరామ సన్నివేశాలు ఆసక్తిని రేపుతాయి. అయితే కథ, కథనంలో లోపాలు, ద్వితీయార్థం కాస్త సాగదీసినట్లు ఉండటం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.