దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్ గురించి అందరికీ తెలిసిందే. ఈ రియల్ కపుల్స్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. వీరిద్దరు కలిసి నటించినా.. డ్యాన్స్ చేసినా.. చూడాలని ఆశపడతారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది.. షన్ను (షణ్ముఖ్), బనానా(దీప్తి) కలిసి పనిచేయాలని కోరుతుంటారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వినయ్ షణ్ముఖ్.. వారిద్దరి ‘మలుపు’ వీడియో సాంగ్‌ను రూపొందించాడు. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ పాటకు 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. షన్ను పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాటను విడుదల చేశారు. 


ఓ వైరస్ వల్ల హాస్పిటల్‌లో చేరిన కార్తిక్(షణ్ముఖ్).. మరో నాలుగు గంటల్లోనే చనిపోతాడని వైద్యులు చెప్పడం, ఇక అతడిని కలవడం సాధ్యం కాదని చెప్పడంతో అతడి ప్రియురాలు (దీప్తి).. కార్తిక్‌తో గడిపిన మధుర క్షణాలను తలచుకుంటుంది. హాస్పిటల్‌లోనే ఉండే.. అతడిని కలిసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, కార్తిక్‌ను ఉంచిన గది లాక్ చేసి ఉండటంతో ఆమె లోనికి వెళ్లలేదు. మరి, ఆమె కార్తిక్‌ను కలుస్తుందా? అతడిని కలిసేందుకు ఆమె ఏం చేస్తుందనేది ఈ సాంగ్‌లోనే చూడాలి. 


ఇక పాట విషయానికి వస్తే.. వినయ్ షణ్ముఖ్ చాలా చక్కగా ఈ వీడియో సాంగ్‌ను తెరకెక్కించాడు. మణికుమార్ ఈ పాటకు సంగీతాన్ని అందించడమే కాకుండా తానే స్వయంగా ఆలాపించాడు. అతడి గాత్రం చాలా అద్భుతంగా ఉంది. కిట్టు లిరిక్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా ఓ బుల్లి సినిమాను చూస్తున్న అనుభవం కలుగుతుంది. షణ్ముఖ్, దీప్తి సునయనాలు తమ పాత్రలో జీవించారనే చెప్పుకోవాలి. భావోద్వేగ సన్నీవేశాలతోపాటు కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. ఈ పాటను చూస్తే తప్పకుండా గుండె బరువెక్కుతుంది. వ్యూవర్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. 


‘మలుపు’ వీడియో సాంగ్:


షన్ను ప్రస్తుతం బిగ్‌ బాస్ సీజన్ 5 హౌస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పాట ద్వారా షన్నుకు మరింత మంది సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో షణ్ముఖ్ కూడా ఒకరు. బిగ్ బాస్‌లో చివరికి వరకు ఉండాలంటే.. తప్పకుండా ప్రేక్షకుల మద్దతు ఉండాలి. దీంతో బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా, ఆమె టీమ్.. ప్లాన్ ప్రకారం సరైన సమయంలో ఈ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారనిపిస్తోంది. 


దీప్తి, షన్నూ ఎప్పుడూ తాము ప్రేమికులమని చెప్పుకోలేదు. అలాగని ఆ వార్తను ఖండించలేదు కూడా. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటూ.. చక్కని జోడీ అనిపించుకుంటున్నారు. వీరిద్దరు విడిపోయారనే రూమర్లు కూడా ఒకప్పుడు చక్కర్లు కొట్టాయి. అయితే, బిగ్ బాస్ ద్వారా షన్ను.. వదంతులకు చెక్ చెప్పాడు. దీప్తి తన గర్ల్‌ఫ్రెండ్ అని చెప్పాడు. అలాగే.. షన్ను పుట్టిన రోజు సందర్భంగా దీప్తి వీడియో మెసేజ్ ద్వారా షన్నుకు ‘ఐ లవ్ యు’ చెప్పింది.