షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. తాజాగా ఈ హీరో నటించిన 'SR కళ్యాణమండపం' సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాను విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ : 

ధర్మ (సాయికుమార్) కడప జిల్లాకు చెందిన వ్యక్తి. తండ్రి వారసత్వంగా వచ్చిన SR కళ్యాణమండపాన్ని నిర్వహించడంలో విఫలమై మద్యానికి బానిసవుతాడు. అతడి కొడుకే కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం). సిటీలో ఇంజనీరింగ్ చదువుకునే కళ్యాణ్ అదే గ్రామానికి చెందిన పాపారావు (శ్రీకాంత్ అయ్యంగార్)గారి కూతురు సింధు (ప్రియాంక జవాల్కర్)తో ప్రేమలో పడతాడు. ఓ పక్క లవ్ ట్రాక్ నడుస్తుంటే.. మరోపక్క ధర్మ తన తాగుడు అలవాటుతో  ఉన్న కళ్యాణమండపాన్ని కూడా తాకట్టు పెట్టే పనిలో పడతాడు. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్.. పెళ్లి మండపం బాధ్యతలను తన భుజాలపై వేసుకుంటాడు. అసలు 'SR కళ్యాణమండపం' బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?  ఈ వ్యాపారంలో కళ్యాణ్ సక్సెస్ అయ్యాడా..? తను ప్రేమించిన సింధుని కళ్యాణ్ దక్కించుకోగలిగాడా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

 

విశ్లేషణ : 

నిజానికి కథ పరంగా చూసుకుంటే ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. ఇలాంటి కథలతో ఇప్పటికే టాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలొచ్చాయి. కానీ దర్శకుడు తన స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కొన్ని ఎమోషనల్ సీన్స్ తెరపై బాగా పండాయి. సినిమాలో డైలాగ్స్ మొత్తం రాయలసీమ యాసతో ఉండడం కొత్త ఫ్లేవర్ ను తీసుకొచ్చింది. హీరో కిరణ్ అబ్బవరం రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో తన డైలాగ్స్ అన్నీ కూడా చాలా ఈజ్ తో చెప్పేశారు. గతంలో పెళ్లిళ్లు ఎలా జరిగేవి..? ఇప్పుడు ఎలా జరుగుతున్నాయనే విషయాలను హీరో చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 

 

ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎమోషన్స్, లవ్ ట్రాక్, కామెడీతో నడిపించేశారు. ఇక సెకండ్ హాఫ్ లో చెప్పడానికి కథేమీ లేక ఇబ్బంది పడ్డారు దర్శకుడు. పైగా కొన్ని సన్నివేశాలను సాగదీసి చూపించడంతో ప్రేక్షకులకు విసుగొస్తుంది. కాన్సెప్ట్ ప్రకారం 'SR కళ్యాణమండపం' అనేది ఒక ప్రధాన పాత్ర. కానీ సినిమాలో బోర్డుని చూపించడం తప్ప.. ఆ మండపాన్ని ఒక పాత్రగా మలచలేకపోయారు. అప్పటివరకు చూపించిన లవ్ ట్రాక్ ను సైడ్ చేసేసి ఫాదర్ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొస్తారు. ఈ ఎపిసోడ్ లో కిరణ్, సాయి కుమార్ ల పెర్ఫార్మన్స్ కు మంచి స్కోప్ దొరికింది. తండ్రి గురించి హీరో చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.

 

అయితే అక్కర్లేని హీరోయిజం కాస్త ఎక్కువే పెట్టేశారనిపిస్తుంది. కిరణ్ హీరోగా ఒక్క సినిమానే చేశారు. అది కూడా సింపుల్ లవ్ స్టోరీ.. రెండో సినిమాకి మాత్రం కమర్షియల్ హీరో టైపులో ఫైట్స్ అవీ చేస్తుంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా అనిపిస్తుంది. కానీ ఎమోషనల్ సీన్స్ లో కిరణ్ బాగా నటించాడు. హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ తన పాత్రకు న్యాయం చేసింది. కొన్ని చోట్ల కాస్త బొద్దుగా కనిపించింది. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఉన్నవాళ్లంతా కూడా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నటుడు సాయి కుమార్ తాగుబోతుగా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా భార్యతో గొడవ పడే సన్నివేశాలు చాలా సహజంగా అనిపిస్తాయి. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పటిలానే చక్కటి నటన కనబరిచారు. 

 

టెక్నికల్ గా చూసుకుంటే ఈ సినిమా చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం మెయిన్ హైలైట్ గా నిలిచింది. పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రెండు పాటల్లో సాహిత్యం అలరిస్తుంది. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. డైరెక్టర్ స్వయంగా ఎడిటింగ్ పనులు చూసుకోవడంతో చాలా సన్నివేశాలకు కత్తెర వేయకుండా అలానే ఉంచేశారు. దాని వలన సినిమా నిడివి పెరిగిపోయింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగానే ఉన్నాయి.