ప్రముఖ దర్శకనిర్మాత తొలిసారిగా వెబ్‌సీరిస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ‘నవరస’ వెబ్‌సీరిస్ ఈ రోజు (ఆగస్టు 6న) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, అరవింద్ స్వామి, ప్రకాశ్ రాజ్, రేవతి, గౌతమ్ మేనన్, అంజలి, ఐశ్వర్య రాజేశ్, యోగిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సీరిస్‌పై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. ‘నవరసలు’ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో తొమ్మిది ప్రత్యేక కథనాలను చూపిస్తున్నారు. కరుణ, ధైర్యం, శృంగారం, హస్యం, అద్భుతం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం.. ఇలా ఒక్కో అంశాన్ని ఒక్కో ఎపిసోడ్‌గా తెరకెక్కించారు. తొమ్మిది మంది ప్రముఖ డైరెక్టర్లు ఒక్కో ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు. ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నుంచి 40 నిమిషాలు ఉంది.
మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ సంయుక్తంగా ఈ వెబ్‌సీరిస్‌ను నిర్మించారు. ప్రియదర్శన్, వసంత్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, అరవింద్ స్వామి, బిజయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజ్, కార్తిక్ నారెన్, సర్జున్ కేఎం, రతీంద్ర ఆర్.ప్రసాద్ ఒక్కో ఎపిసోడ్‌ను తెరకెక్కించారు. ‘నవరస’ టైటిల్‌కు తగినట్లే ఇందులోని ప్రతి ఎపిసోడ్‌ను ఆధ్యాంతం ఆసక్తికరంగా రూపొందించారు. స్టార్ హీరోలు, ప్రముఖ తారాగణం ఈ వెబ్‌సీరీస్‌కు ప్లస్ పాయింట్.
లాభం కోసం.. మంచి కోసం: ప్రముఖ హీరోలంతా ఇలా వెబ్‌సీరిస్‌లో కనిపించడం వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ వల్ల ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారు. సినిమా రంగంలో చాలామంది కార్మికులు పని లభించక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అలాంటివారిని ఆదుకోవడం కోసం తమిళ సినీరంగం ముందుకొచ్చింది. ఈ వెబ్‌సీరిస్ ద్వారా వచ్చే ఆదాయంతో వారిని ఆదుకుంటామని నిర్మాతలు ప్రకటించారు. అందుకోసమైనా సరే మనం ఈ వెబ్‌సీరిస్ చూడాలి.
‘నవరస’ వెబ్‌సీరిస్ ట్రైలర్‌ను ఇక్కడ చూడండి:
అరవింద్ స్వామి దర్శకత్వం వహించిన ‘రౌద్రం’ ఎసిసోడ్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించడం విశేషం. విజయ్ సేతుపతి నటించిన ఎపిసోడ్‌కు గోవింద్ వసంత, యోగి బాబు నటించిన ఎపిసోడ్‌కు రాజేష్ మురుగేశన్, అరవిందస్వామి, ప్రసన్న పూర్ణ నటించిన ఎపిసోడ్‌కు రాన్ ఎథన్ యోహన్, ఢిల్లీ గణేష్ నటించిన ‘పాయాసం’ ఎపిసోడ్‌కు జస్టిన్ ప్రభాకరణ్, బాబీ సింహా నటించిన ‘పీస్’కు సంతోష్ నారాయణన్, సిద్ధార్థ్ నటించిన ఎపిసోడ్‌కు విశాల్ భరద్వాజ్, అతర్వా మురళీ నటించిన ఎపిసోడ్‌కు కేఎస్ సుందరమూర్తి, సూర్య నటించిన ఎపిసోడ్‌కు గాయకుడు కార్తీక్ సంగీత దర్శకత్వం వహించారు.