తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఎంతగా రాజకీయ ఉత్కంఠ రేపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తియుక్తులన్నింటినీ అక్కడ కేంద్రీకరిస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ టాస్క్ తీసుకుని ఉపఎన్నికల టీంను లీడ్ చేస్తున్నారు. దళిత బంధు లాంటి పథకాలను ప్రారంభిస్తున్నారు. మరో వైపు పార్టీ సీనియర్ నేతలందరికీ బాధ్యతలిచ్చారు. ప్రతి మండలాలు.. గ్రామాల వారీగా ఇంచార్జుల్ని నియమించారు. అందర్నీ సమన్వయం చేసుకుని పార్టీ వ్యవహారాలను చక్క బెట్టేలా బాధ్యతల్ని హరీష్ రావుకు అప్పగించారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. ఎక్కడా కేటీఆర్ పేరే వినిపించడం లేదు. ఈ ఎన్నికల విషయంలో దూరంగా ఉంటున్న టీఆర్ఎస్ కీలక నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే.


ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే మంత్రిగా కేటీఆర్ ప్రాతినిధ్యం..!


టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాత్రమే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్నందున హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై ఆయన బాధ్యత తీసుకోవాల్సి ఉంది. జిల్లా మంత్రిగా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ఉమ్మడి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉన్న మరో మినిస్టర్ గంగుల కమలాకర్‌కు కేసీఆర్ మొదటి నుంచి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఈటల రాజీనామా అనంతరం పార్టీ పరిస్థితుల్ని చక్కదిద్దేలా బాధ్యతలు ఎక్కువగా ఇచ్చారు. కేటీఆర్‌ను పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు. ఇప్పటి వరకూ హూజారాబాద్ ఉపఎన్నికల గురించి కేటీఆర్ బహిరంగంగా మాట్లాడింది కూడా తక్కువే. ఒకటి రెండు సార్లు ఈటల రాజేందర్ అంశంపై మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు కానీ బహిరంగంగా మాత్రం మాట్లాడలేదు.


మెదక్ జిల్లాను దాటి హరీష్‌కు ఎన్నికల బాధ్యతలు..! 


2014 తర్వాత కేటీఆర్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. ఉపఎన్నికలు.. గ్రేటర్ ఎన్నికలు ఇలా ఏవి వచ్చినా పార్టీ అధినేత కేసీఆర్ .. బాధ్యతల్ని కేటీఆర్‌కే అప్పగిస్తున్నారు. అప్పటి వరకూ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావును.. ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికలు జరిగితే కేటీఆర్ జోక్యం చేసుకునేవారు కాదు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉపఎన్నిక జరుగుతూంటే కేసీఆర్.. హరీష్ రావుకు బాధ్యత ఇచ్చారు. కేటీఆర్‌ను సైలెంట్ చేశారు. పార్టీ యంత్రాంగం అంతా హుజూరాబాద్ ఉపఎన్నికపై దృష్టి పెట్టి పని చేస్తూంటే.. కేటీఆర్ అధికార విధుల్లో బిజీగా ఉంటున్నారు. 


పక్కా లెక్కలతోనే కేటీఆర్‌ను కేసీఆర్ పక్కన పెట్టారా..? 


తెలంగాణ రాజకీయాల దిశ మార్చబోయే కీలక ఉపఎన్నికల్లో కేటీఆర్‌ను కేసీఆర్ ఎందుకు దూరంగా ఉంచుతున్నారనేది టీఆర్ఎస్ నేతలకే అంతుబట్టని అంశంగా మారింది. ఈటల రాజేందర్ ఉద్యమకారుని ముద్రతో ఎన్నికలకు వెళ్తున్నారని..అందుకే ఆయనకు సమఉజ్జిగా హరీష్‌రావును హుజూరాబాద్ ప్రజల ముందు ఉంచితే బ్యాలెన్స్ అవుతుందని కేసీఆర్ భావించినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో  ఈటల రాజేందర్ ఇటీవలి కాలంలో హరీష్ రావు పై సానుభూతి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనకు తనలాగే జరుగుతుందని జోస్యం చెబుతున్నారు. సందర్భం ఉన్నా లేకపోయినా హరీష్ రావు ప్రస్తావన తెస్తున్నారు. దీనికి చెక్ పెట్టాలన్నా కూడా  హరీష్ రావే హుజూరాబాద్ బాధ్యతలు చూసుకుంటే మంచిదన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారంటున్నారు. కారణం ఏదైనా కానీ..హుజూరాబాద్ ఎన్నికలు హరీష్ రావు నాయకత్వ సామర్థ్యానికి కీలక పరీక్షగా మారాయి. దుబ్బాక పరాభవానికి హరీష్ బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటారా..? లేక మరోసారి షాక్ తింటారా..? అన్నది వేచి చూడాలి.. !