తెలంగాణ ప్రభుత్వం దళితుల ప్రగతి ఎంతో చేస్తుంటే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకుగానూ దళిత బంధు లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. 


జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు దళిత బంధును అమలు చేశారని, బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు మాత్రం అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ ఎంపీ బండి సంజయ్‌ సైతం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తున్న దళిత బంధుపై రాజకీయాలు చేస్తున్నారని.. ఆయనకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి దళిత కుటుంబానికి రూ.40 లక్షల చొప్పున సాయం ఇప్పించాలంటూ కొప్పుల ఈశ్వర్‌ సవాల్‌ విసిరారు. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతుంటే బీజేపీ నేతలు అడ్డుపడటం సరికాదని హితవు పలికారు. 


Also Read: Dalitha Bandhu: వాసాలమర్రిలో దళిత బంధు అమలు.. రూ.7.6 కోట్లు విడుదల, ఉత్తర్వులు జారీ


ఒక్కో దళిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందాలని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి రూ.10 లక్షలను వారికి అందించి దళితుల ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రం ప్రభుత్వంతో చర్చించి, మిగతా రూ.40 లక్షల సాయాన్ని మీరు ఇప్పించగలరా అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా దళితుల కోసం మీ ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయా అని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ బాటలో నడుస్తూ సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.


ఆగస్టు 4న సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో పర్యటించిన సందర్భంగా.. ఆ గ్రామంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు రూ.10 లక్షల నగదు మరుసటి రోజే విడుదల చేస్తామని ప్రకటించారు.ఇచ్చిన ఆ మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీన దళిత బంధు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి జిల్లా వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు రూ.7.6 కోట్లు విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. దళిత బంధు నిధులను మంజూరు చేయడంతో వాసాలమర్రిలోని దళిత కుటుంబాలు గురువారం సీఎం కేసీఆర్ ఫొటోకి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలో దశలవారీగా దళిత బందు పథకం అమలు చేయనున్నామని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు.


Also Read: Dalitha Bandhu: తెలంగాణలో ‘దళిత బంధు’ పేరుకు అడ్డంకి.. ఎస్సీ కమిషన్ అభ్యంతరం.. నోటీసులు