వందేళ్ల తర్వాత తొలిసారి సమగ్ర సర్వేతో భూ వివాదాలకు చెక్ పడనుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 70 కార్స్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమగ్ర సర్వేకోసం 13,371 మంది పంచాయితీ కార్యదర్శులు, 10,935 మంది డిజిటల్ అసిస్టెంట్లు, 10,185 మంది గ్రామ సర్వేయర్లకు బాధ్యతలు అప్పగించినట్టు వివరించారు. సర్వేలో భాగంగా ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని మొత్తం ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఎంత సమయం పడుతుందో అధ్యయనం చేయాలని మంత్రి వర్గం ఉపసంఘం సూచించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సర్వే రాళ్లకు సంబంధించి గుంతలు తవ్వడం తదితర పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించింది.




గ్రామకంఠం సమస్యపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉందని తెలిపింది. ఎక్కడా పొరపాట్లు లేకుండా యాజమాన్య హక్కు సర్టిఫికెట్లను అందించే ప్రక్రియను చేపట్టాలని సూచించింది. భూరికార్డులను ఆధునికీకరించే ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కోరింది. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. కాగా, ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కు కార్డులను జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 2 నాటికి వెయ్యి గ్రామాల్లో పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు.


గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో తాడేపల్లిగూడెంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. 762 గ్రామాలకు విలేజ్‌ మ్యాప్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. సకాలంలో సర్వేను పూర్తి చేయాలంటే కనీసం 51 డ్రోన్‌లు అవసరమవుతాయన్నారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డ్రోన్‌ కార్పొరేషన్‌ ద్వారా డ్రోన్‌లను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కృష్ణదాస్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 




రీ సర్వేలో ఏం చేస్తారు?


డ్రోన్‌ల ద్వారా భూముల హైడెఫినిషన్‌ ఫొటోలను తీస్తారు. వాటిని అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ప్రాసెస్ చేసి ఫొటోలను ప్రింట్ చేస్తారు. వాటి ఆధారంగా భూమిపై సర్వేనెంబర్‌, సబ్‌ డివిజన్‌ల వారీగా రైతుల సమక్షంలో కొలుస్తారు. అత్యాధునిక రోవర్స్‌ ఆధారంగా భూమిపై కంట్రోల్‌ పాయింట్స్‌ను ఎంపిక చేస్తారు. తర్వాత ఆ భూమికి సంబంధించిన స్కెచ్‌ తయారు చేస్తారు. అనంతరం భూమికి అక్షాంశ, రేఖాంశాలను నిర్దేశిస్తారు. 11 అంకెల విశిష్ట సంఖ్యను జారీ చేస్తారు. సర్వేసందర్భంగా తలెత్తే వివాదాలను అప్పీల్స్‌ విభాగాల పరిశీలనకు పంపిస్తారు. అప్పీల్స్‌ కూడా గ్రామస్థాయిలోనే పరిష్కరించేలా రాష్ట్ర సర్వే, సరిహద్దు చట్టం-1923 రూల్స్‌లో మార్పులు ప్రతిపాదించారు. అనంతరం గ్రామ సచివాలయంలో ఆ రికార్డులను ప్రదర్శిస్తారు. కొలతలు, భూమి విస్తీర్ణం, సర్వేపై వివాదాలు ఉంటే అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.