సీబీఎస్ఈ 10, 12 తరగతుల్లో మార్కుల మెరుగుదల కోసం నిర్వహించే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ 30న ప్రకటిస్తామని చెప్పింది. ఇక ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్‌ఈ) బోర్డు సైతం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడించింది. ఆగస్టు 16వ తేదీ నుంచి ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను ప్రారంభిస్తామని.. ఫలితాలను సెప్టెంబర్ 20న విడుదల చేస్తామని తెలిపింది.
ఈ మేరకు సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు సుప్రీంకోర్టుకు షెడ్యూళ్ల వివరాలను సమర్పించాయి. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ సంజీవ్ ఖాన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ షెడ్యూళ్లకు ఆమోదం తెలిపింది.
ఆగస్టు 10 నుంచి రిజిస్ట్రేషన్లు..
సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల రిజిస్ట్రేషన్ల కోసం ఉద్దేశించిన పోర్టల్ ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని బోర్డు తెలిపింది. దీనికి సంబంధించి త్వరలోనే సర్క్యులర్ జారీ చేస్తామని తెలిపింది. ఇక ఐసీఎస్ఈ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే (ఆగస్టు 4న) ప్రారంభం కాగా.. ఎగ్జామ్ షెడ్యూల్ ఆగస్టు 6న (నేడు) విడుదల అయ్యే అవకాశం ఉంది.
మార్కుల కోత వల్ల నష్టపోయాం..
సీబీఎస్ఈ బోర్డు మార్కుల కేటాయింపునకు ఏర్పాటుచేసిన రిజల్ట్ కమిటీ.. విద్యార్థులకు సమాచారం ఇవ్వకుండానే మార్కులకు కోత విధించిందని.. దీని వల్ల పలువురు విద్యార్థులు నష్టపోయారని పిటిషినర్లు కోర్టుకు తెలిపారు. దీనిపై సీబీఎస్ఈ తరఫు న్యాయవాది స్పందించారు. విద్యార్థుల ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు, గత మూడు సంవత్సరాలలో సాధించిన అత్యధిక మార్కుల సగటు ఆధారంగా కమిటీ మార్కులను కేటాయించిందని కోర్టుకు నివేదించారు. ఇదే విషయానికి సంబంధించి స్కూళ్లకు సూచనలను సైతం అందించిందని చెప్పారు.
స్పందించిన ధర్మాసనం.. మార్కుల కేటాయింపు విషయంలో సంబంధిత సమాచారాన్ని విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత పాఠశాలలపై ఉందని అభిప్రాయపడింది.
ఫీజు ఇవ్వాల్సిందే..
కోవిడ్ కారణంగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి సేకరించిన పరీక్ష ఫీజులను తిరిగి చెల్లించాలని.. ఉత్తర్ ప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. స్పందించిన బోర్డు.. పరీక్షల ఫీజును తిరిగి చెల్లించబోమని స్పష్టం చేసింది. తమది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని.. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం పొందలేదని పేర్కొంది.
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అనే విషయం చివరి నిమిషంలో ఖరారైందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అప్పటికే పరీక్షల నిర్వహణ కోసం బోర్డు ముందస్తు ఏర్పాట్లు చేసిందని పేర్కొంది. అందువల్ల పిటిషనర్లు లేవనెత్తిన ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోవడం సరైనది కాదని, ఈ వాదనలను తిరస్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
Also Read: AGRICET 2021: వ్యవసాయ వర్సిటీల్లో ప్రవేశాలు.. అగ్రిసెట్ నోటిఫికేషన్ విడుదల..