కరోనా సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ చేసుకునే పర్మిషన్లు ఇచ్చినా.. ఏపీలో మాత్రం థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోవడం లేదు. తెలంగాణలో మాత్రం చిన్న సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో 'తిమ్మరుసు', 'ఇష్క్' లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో 'తిమ్మరుసు' సినిమాకి మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. 


దీంతో చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి భయపడుతున్నారు. పేరున్న హీరోల సినిమాలు కూడా ఓటీటీలకు ఇచ్చేయాలని చూస్తున్నారు. నాని నటించిన 'టక్ జగదీష్', నితిన్ నటించిన 'మ్యాస్ట్రో', వెంకటేష్ 'దృశ్యం 2' సినిమాలు థియేటర్లలో విడుదల కావడం లేదు. ఈ మూడు సినిమాలు ఓటీటీ కంపెనీలకు అమ్ముడైపోయాయి. 'మ్యాస్ట్రో' త్వరలోనే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. 'దృశ్యం 2' సినిమా హక్కులను కూడా హాట్ స్టార్ సంస్థే చేజిక్కించుకుంది. 



ఇక 'టక్ జగదీష్' సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సినిమా హక్కుల కోసం అమెజాన్ మొత్తంగా రూ.37 కోట్లు చెల్లించిందని సమాచారం. ఇవి కాకుండా నాన్ థియేట్రికల్ హక్కులు కలుపుకొని మొత్తంగా సినిమా బిజినెస్ రూ.51 కోట్ల వరకు జరగనుంది. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇదే బాటలో గోపీచంద్ నటించిన 'సీటీమార్', శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ', శర్వానంద్ 'మహాసముద్రం' సినిమాలు కూడా ఓటీటీ కంపెనీలతో చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. 



తమ సినిమాలను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లోనే రిలీజ్ చేస్తామని చెప్పిన టాప్ హీరోలు సైతం సైలెంట్ గా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మేస్తున్నారు. అందుకే చిన్న, మిడ్ రేంజ్ సినిమాలన్నీ కూడా ఓటీటీ బాట పట్టేలా ఉన్నాయి. దానికి కారణంగా ప్రస్తుతం థియేటర్ల వ్యాపారం అనుకూలంగా లేకపోవడమే. ఆంధ్రప్రదేశ్ లో యాభై శాతం ఆక్యుపెన్సీ, తక్కువ టికెట్ రేట్లు అనేది సమస్యగా మారింది. తెలంగాణలో హైదరాబాద్ లో మినహా మిగతా చోట్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చెనందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. 


కరోనా కేసు మళ్లీ పెరుగుతుండడమే ముఖ్య కారణం. అందుకే డైరెక్ట్ గా ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. పైగా ఓటీటీ సంస్థలు సినిమాలను మంచి రేటుకే కొంటున్నారు. దీంతో నిర్మాతలకు భారీ లాభాలు రాకపోయినా.. మంచి లాభాలే వస్తున్నాయి.