ప్రముఖ స్మార్ట్ వాచ్ బ్రాండ్ నాయిస్ నుంచి కొత్త వాచ్ వచ్చేసింది. నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 3 అసిస్ట్ స్మార్ట్ వాచ్ భారతదేశంలో లాంచ్ అయింది. దీంతో పాటుగా నాయిస్ బడ్స్ వీఎస్ 103 ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) ఇయర్‌బడ్స్ కూడా ఇండియాలో విడుదల అయ్యాయి. కలర్‌ఫిట్ ప్రో 3 అసిస్ట్ స్మార్ట్ వాచ్ 5 కలర్ ఆఫ్షన్లలో లభిస్తుంది. దీని స్క్రీన్ దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉంటుంది. ఇందులో హ్యాండ్ వాష్ రిమైండర్, ఎస్‌పీఓ 2 మానిటరింగ్, 14 స్పోర్ట్స్ మోడ్‌లు, హార్ట్ రేట్ మానిటరింగ్, వాటర్ రెసిస్టెన్స్ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.
ఇక నాయిస్ బడ్స్ వీఎస్ 103 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ విషయానికి వస్తే.. ఇందులో స్టెమ్-స్టైల్ డిజైన్ ఉండనుంది. టచ్ ఫంక్షనాలిటీని కలిగి ఉంది. ఈ ఇయర్‌బడ్స్ రెండు కలర్లలో రానున్నాయి. దీని ప్లే టైమ్ 18 గంటల పాటు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఆఫర్ రేట్లు అదుర్స్..
నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3 స్మార్ట్ వాచ్ ధర రూ.5999గా ఉంది. అయితే ప్రస్తుతం ప్రారంభ ఆఫర్ కింద రూ.3999 ధరకే దీనిని అందిస్తున్నారు. ఇది జెట్ బ్లాక్, జెట్ బ్లూ, రోజ్ పింక్, స్మోక్ గ్రీన్, స్మోక్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక నాయిస్ బడ్స్ వీఎస్ 103 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర రూ.2999గా నిర్ణయించింది. వీటిని కూడా ప్రారంభ ఆఫర్ కింద రూ.1499కే అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి తెలుపు, నలుపు రంగుల్లో లభిస్తాయి. ఈ రెండు ఉత్పత్తులను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 3 స్పెసిఫికేషన్లు..
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 3 అసిస్ట్ 1.55-అంగుళాల టీఎఫ్‌టీ-ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రానుంది. 320x360 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంటుంది. వాచ్ కుడి వైపున ఒక బటన్ ఇచ్చారు. ఇది హార్ట్ రేట్ సెన్సార్, ఎస్‌పీఓ 2 మానిటరింగ్, యాక్సిలెరోమీటర్ ఫీచర్లతో వస్తుంది. దీనికి అలెక్సా సపోర్ట్ కూడా ఉంది. ఇందులో ఫైండ్ మై ఫోన్, హ్యాండ్ వాష్ రిమైండర్, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుంటే కదలాలి అని గుర్తు చేసే రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఒత్తిడిని మానిటర్ చేసే స్ట్రెస్ మానిటరింగ్ ఫీచర్.. సరిగా నిద్ర పోతున్నామా? లేదా? అని కూడా చెక్ చేసే స్లీప్ మానిటరింగ్ ఆప్షన్లు ఉంటాయి.
ఈ వాచ్‌ని పాలికార్బోనేట్‌తో తయారుచేశారు. 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. దీని బ్యాటరీ కెపాసిటీ 300 ఎంఏహెచ్‌గా ఉంది. చార్జింగ్ ఫుల్ అవడానికి రెండు గంటల సమయం తీసుకుంటుంది. ఒక్కసారి చార్జింగ్ ఫుల్ అయితే 10 రోజుల పాటు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
నాయిస్ బడ్స్ వీఎస్ 103 ఇయర్‌బడ్స్ 10 ఎంఎం డ్రైవర్లతో వస్తున్నాయి. ఇందులో టచ్ కంట్రోల్ సదుపాయం ఉంది. వీటి ద్వారా కాల్ కంట్రోల్, వాల్యూమ్ మార్చడం, వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడం వంటివి చేయవచ్చు. దీనిని ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే.. 18 గంటల పాటు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Also Read: Amazon Alexa on Covid Testing: హే అలెక్సా.. కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు ఎక్కడున్నాయి?