సినిమా రివ్యూ: ది బ్యాట్‌మ్యాన్
రేటింగ్: 3.5/5
నటీనటులు: రాబర్ట్ ప్యాటిన్సన్, జో క్రేవిట్జ్, పాల్ డనో, ఆండ్రీ సెర్కిస్, జెఫ్రీ వెయిట్ తదితరులు
ఎడిటర్: విలియం హోయ్, టైలర్ నెల్సన్
సినిమాటోగ్రఫీ: గ్రెయిగ్ ఫ్రేజర్
సంగీతం: మైకేల్ గియాచియో
నిర్మాత: డీసీ, వార్నర్ బ్రదర్స్
దర్శకత్వం: మాట్ రీవ్స్
విడుదల తేదీ: మార్చి 4, 2022
The Batman Review in Telugu: సూపర్ హీరో పాత్రల్లో బ్యాట్‌మ్యాన్‌ది ప్రత్యేకమైన స్థానం. మార్వెల్‌తో పోలిస్తే... డీసీ ప్రయాణం మొదటి నుంచి పడుతూ, లేస్తూ సాగుతున్నా కనీసం పోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఉందంటే దానికి కారణం బ్యాట్‌మ్యాన్, సూపర్ మ్యాన్ వంటి సూపర్ హీరో క్యారెక్టర్లే. గత పదేళ్లలో బ్యాట్‌మ్యాన్ పాత్రలో కనిపించిన మూడో హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ (Robert Pattinson). రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా... యాక్షన్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన మాట్ రీవ్స్ దర్శకత్వంలో ‘ది బ్యాట్‌మ్యాన్’ సినిమా ప్రకటించగానే అంచనాలు ఎక్కువయ్యాయి. ఇక టీజర్, ట్రైలర్లలో వయొలెంట్ కంటెంట్ చూశాక ఆ అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా?
కథ: కోట్ల ఆస్తికి వారసుడు అయిన బ్రూస్ వెయిన్ (రాబర్ట్ పాటిన్సన్) కుటుంబ వ్యాపారాన్ని అస్సలు పట్టించుకోకుండా తన గోథమ్ సిటీలో నేరాలను అరికట్టడంపైనే దృష్టి పెడతాడు. దానికోసం బ్యాట్‌మ్యాన్ అవతారం ఎత్తుతాడు. అయితే గోథమ్ సిటీలో రిడ్లర్ (పాల్ డనో) అనే పేరుతో ఒక సీరియల్ కిల్లర్ వరుసగా హత్యలు చేస్తూ ఉంటాడు. హత్య జరిగిన ప్రతి ప్రదేశంలో తన తర్వాతి హత్య గురించి బ్యాట్‌మాన్‌కు (రాబర్ట్ పాటిన్సన్) రిడిల్స్ (పొడుపు కథలు) రూపంలో క్లూస్ ఇస్తాడు. అసలు రిడ్లర్ లక్ష్యం ఏంటి? ఈ కథతో కేట్ వుమన్‌కు (జో క్రేవిడ్జ్) సంబంధం ఏంటి? రిడ్లర్‌ను బ్యాట్‌మ్యాన్ ఆపగలిగాడా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: బ్యాట్‌మ్యాన్ అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) దర్శకత్వంలో వచ్చిన ‘ది డార్క్‌నైట్ ట్రయాలజీ’నే. క్రిస్టియన్ బేల్ నటించిన ఈ మూడు సినిమాలు విపరీతంగా సక్సెస్ అయి... బ్యాట్‌మ్యాన్ (Batman) ఇమేజ్‌ను కూడా పెంచాయి. తర్వాత బెన్ ఆఫ్లెక్ బ్యాట్‌మ్యాన్‌గా, జాక్ స్నైడర్ దర్శకత్వం వహించిన సినిమాలు ఫలితం విషయంలో బోల్తా కొట్టినా బెన్ ఆఫ్లెక్‌కు బ్యాట్‌మ్యాన్‌గా మంచి పేరొచ్చింది. బెన్ ఆఫ్లెక్ బ్యాట్‌మ్యాన్‌కు ‘బ్యాట్‌ఫ్లెక్’ అని ముద్దు పేరు కూడా పెట్టారు.
ఈ సినిమా కథ ఇప్పటివరకు వచ్చిన బ్యాట్‌మ్యాన్ సినిమాల కథలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ‘ది బ్యాట్‌మ్యాన్’ను ఒక సూపర్ హీరో సినిమా అనడం కంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ అనడం కరెక్ట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సూపర్ హీరో సినిమాలు అన్నిట్లో ప్రత్యేక శక్తులున్న ప్రతినాయకులు, లేదా వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్స్‌ను విలన్స్‌గా చూపించడం ఆనవాయితీ అయిపోయింది. కానీ బ్యాట్‌మ్యాన్‌లో మాత్రం ఒక సామాన్యమైన విలన్‌తోనే బ్యాట్‌మ్యాన్, గోథమ్ సిటీ పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. ప్రేక్షకులకు కూడా చూడటానికి ఇది కొంచెం కొత్తగా ఉంటుంది.
ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మరో అంశం డార్క్ టోన్. సాధారణంగా బ్యాట్‌మ్యాన్ సినిమాల్లో కథలు రాత్రి పూట జరుగుతూ ఉంటాయి. కేవలం ‘డార్క్ నైట్ రైజెస్’లో మాత్రమే కథ పగలు పూట జరుగుతుంది. ఈ సినిమాలో కూడా కథ పూర్తిగా రాత్రి సమయంలోనే జరుగుతుంది. డార్క్ థీమ్‌లో యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఒక్కోసారి రాత్రి పూట యాక్షన్ సన్నివేశాలు తీసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే స్క్రీన్ మీద ఏం జరుగుతుందో కూడా ప్రేక్షకుడికి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో వచ్చిన కొన్ని సూపర్ హీరో సినిమాల్లో ఈ సమస్య కనిపించింది కూడా. ఈ సినిమాలో మాత్రం కథ, యాక్షన్ సన్నివేశాలు అన్నీ రాత్రిపూటనే జరుగుతున్నా ఎటువంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. పగటిపూట జరిగిన సన్నివేశాలు కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు డల్ లైట్‌తోనే తీయడం చూడవచ్చు. కాబట్టి ఈ సినిమాను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలంటే మంచి సౌండ్ సిస్టం, స్క్రీన్ ఉన్న థియేటర్‌లో ఈ సినిమా చూస్తే పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయవచ్చు. ఇక సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అతిపెద్ద ప్లస్ పాయింట్. సినిమా థీమ్‌కు తగ్గట్లు మైకేల్ గియాచియో అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
గతంలో వచ్చిన బ్యాట్‌మ్యాన్ సినిమాలకు, దీనికి మరో తేడా బ్యాక్‌గ్రౌండ్. క్రిస్టోఫర్ నోలన్ మూడు బ్యాట్‌మ్యాన్ సినిమాలు తీసినా... బ్రూస్ వెయిన్ ఫ్యామిలీ సీక్రెట్స్‌ను టచ్ చేయలేదు. కానీ మాట్ రీవ్స్ మాత్రం బ్రూస్ వెయిన్ ఫ్యామిలీ సీక్రెట్లు కూడా రివీల్ చేసి బ్యాట్‌మ్యాన్ కథతో ఎమోషనల్ కనెక్ట్ అయ్యే విధంగా కథను రాసుకోవడం కొంచెం కొత్తగా ఉంటుంది. ఇది బ్రహ్మాండంగా వర్కవుట్ కూడా అయింది.
ఇక సినిమాకు ఉన్న ఏకైక మైనస్ పాయింట్ దాని రన్‌టైం. ఈ సినిమా నిడివి ఏకంగా మూడు గంటల వరకు ఉంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా తర్వాత ఈ మధ్య కాలంలో ఇంత రన్‌టైం ఉన్న సూపర్ హీరో మూవీ ఇదే. సినిమా మొత్తం గ్రిప్పింగ్‌గానే ఉన్నప్పటికీ... అక్కడక్కడా కొన్ని డ్రామా సన్నివేశాలు అనవసరంగా పెట్టినట్లు అనిపిస్తుంది. ఇంతకుముందు బ్యాట్‌మ్యాన్ సినిమాలు ఫాలో అయిన వారు ఆ సీన్లను ఎంజాయ్ చేసినా... మొదటిసారి బ్యాట్‌మ్యాన్ చూసేవారికి ఆ రిఫరెన్సులు కొంచెం బోరింగ్‌గా అనిపించే అవకాశం ఉంది.
నటీనటుల విషయానికి వస్తే... మొదటగా రాబర్ట్ ప్యాటిన్సన్ గురించి చెప్పుకోవాలి. క్రిస్టియన్ బేల్, బెన్ ఆఫ్లెక్‌లు బ్యాట్‌మ్యాన్ హీరోల రూపానికి తగ్గట్లు వారిని వారు మార్చుకున్నారు. కండలు తిరిగిన భారీ శరీరంతో స్క్రీన్‌పై నిండుగా కనిపిస్తారు. కానీ రాబర్ట్ ప్యాటిన్సన్ అలా కాదు. కేవలం బ్యాట్ సూట్ వేసుకున్నప్పుడు మాత్రమే రాబర్ట్ ప్యాటిన్సన్ సూపర్ హీరోలా కనిపిస్తాడు. మిగిలిన సమయాల్లో మామూలు యువకుడిలా బక్క పలుచని శరీరంతో కనిపిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ముందు చేసిన ఇద్దరు హీరోలు బ్యాట్‌మ్యాన్ క్యారెక్టర్‌కు తగ్గట్లు తమ శరీరాలను మార్చుకుంటే... రాబర్ట్ ప్యాటిన్సన్‌కు మాత్రం తన శరీరానికి తగ్గట్లు బ్యాట్‌మ్యాన్ క్యారెక్టరైజేషన్ మారిపోయింది. మొదటి ఇద్దరికీ ఏమాత్రం తీసిపోని విధంగా రాబర్ట్ ప్యాటిన్సన్ నటన ఉంటుంది. పెర్పార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు... రెండిట్లోనూ రాబర్ట్ ప్యాటిన్సన్ కూడా బ్యాట్‌మ్యాన్‌గా 100 మార్కులు కొట్టేశాడు.
మొదటి ఇద్దరు నటుల కంటే రాబర్ట్ ప్యాటిన్సన్‌కు పెర్ఫార్మెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న కథ దొరికింది. తన ఫ్యామిలీ గురించి తనకే తెలియని రహస్యాలు రివీల్ అవుతున్న సమయంలో ఆల్ఫ్రెడ్ దగ్గర రాబర్ట్ ప్యాటిన్సన్ బాధపడే సన్నివేశం స్క్రీన్ మీద ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే ఇది బ్యాట్‌మ్యాన్ పాత్రకు కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో బ్యాట్‌మ్యాన్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది.
బ్యాట్‌మ్యాన్ తర్వాత కథలో కేట్ ఉమన్‌గా నటించిన జో క్రేవిట్జ్, రిడ్లర్ పాత్రలో నటించిన పాల్ డనోలు బాగా నటించారు. వీరిద్దరి పాత్రలు కూడా కథకు చాలా కీలకం. ఇద్దరికీ ఎమోషనల్ సన్నివేశాల్లో నటించే అవకాశం దొరికింది. ఇక మిగతా పాత్రల్లో నటించిన వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... మరో సక్సెస్‌ఫుల్ బ్యాట్‌మ్యాన్ సిరీస్‌కు ఇది ప్రారంభం. గతంలో బ్యాట్‌మ్యాన్ సినిమాలు చూసినవారు ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఇక మొదటిసారి బ్యాట్‌మ్యాన్ సినిమాను చూస్తున్నవారికి ముందు బ్యాట్‌మ్యాన్ సినిమాలు చూడాలనే ఆసక్తిని కూడా ఈ బ్యాట్‌మ్యాన్ కలిగిస్తాడు.
Also Read: 'సెబాస్టియన్ పీసీ 524' రివ్యూ: సెబా కామెడీ బావుంది కానీ