Nara Rohit's Prathinidhi 2 Movie Review: కొంత విరామం తర్వాత నారా రోహిత్ హీరోగా నటించిన సినిమా 'ప్రతినిధి 2'. కొన్నాళ్ల క్రితం వచ్చిన 'ప్రతినిధి'తో ఆయన విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు 'ప్రతినిధి 2' అనేసరికి ప్రేక్షకులతో పాటు రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తి ఏర్పడింది. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో పొలిటికల్ కాంట్రవర్సీ ఉందా? లేదంటే రాజకీయ నేపథ్యంలో థ్రిల్లర్ సినిమా తీశారా? అనేది రివ్యూలో చూడండి.


కథ (Prathinidhi 2 Story): చే... చేతన్ (నారా రోహిత్) నిజాయతీ గల జర్నలిస్ట్. తన ప్రాణం మీదకు వచ్చినా సరే భయపడకుండా ప్రజలకు నిజాలు చెప్పాలని ధృడ సంకల్పం ఉన్న వ్యక్తి. కొన్నాళ్ల క్రితం అమెరికా వెళ్లిపోయిన సీనియర్ జర్నలిస్ట్ (ఉదయభాను) ఇండియా తిరిగి వచ్చి ఛానల్ పెడుతుంది. ఏరి కోరి మరీ చే దగ్గరకు వెళ్లి అతడిని తన ఎన్ఎన్‌సి ఛానల్ సీఈవో చేస్తుంది. 


గజేంద్ర (అజయ్ ఘోష్)ను ఇంటర్వ్యూ చేసిన చే... అతని అక్రమాలు వెలుగులోకి తీసుకు రావడంతో మంత్రి పదవి పోతుంది. పార్టీ నుంచి సస్పెండ్ అవుతాడు. ఉప ఎన్నికల్లో గజేంద్రకు ప్రత్యర్థిగా నిలబడిన అధికార పార్టీ అభ్యర్థి నరసింహ (పృథ్వీ) అక్రమాలు సైతం వెలుగులోకి తెస్తాడు చే. అతడి మీద దాడులు జరిగిన అసలు భయపడడు. వరుసగా సంచలన కార్యక్రమాలు చేసిన 'చే' ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడేకర్) దృష్టిలో పడతాడు. అయితే... సీఎం క్యాంపు ఆఫీసులో జరిగిన బాంబు బ్లాస్ట్ కేసులో 'చే'ను పోలీసులు అరెస్ట్ చేస్తారు.


ముఖ్యమంత్రి హత్య వెనుక ఎవరు ఉన్నారు? ఆయన్ను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? బాంబు బ్లాస్ట్ కేసులో 'చే'ను ఎందుకు అరెస్ట్ చేశారు? సీఎం మరణం తర్వాత ఆయన కొడుకు విశ్వ (దినేష్ తేజ్) ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చివరి నిమిషంలో ఎందుకు ఆగింది? సీఎం బాంబు బ్లాస్ట్ కేసును విక్రమ్ సంతోష్ (జిష్షుసేన్ గుప్తా) ఎలా సాల్వ్ చేశారు? ప్రభాస్ మిశ్రా (అజయ్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Pratinidhi 2 Review): సినిమా ఎలా ఉందనేది చెప్పడానికి ముందు ఓ విషయంలో ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాలి. టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు హీరో నారా రోహిత్ స్వయానా సోదరుని కుమారుడు కావడం, జర్నలిస్ట్ మూర్తి టీడీపీ మద్దతుదారుడనే ప్రచారం ఉండటంతో... 'ప్రతినిధి 2' టీడీపీకి అనుకూలంగా, మరో పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనే మాటలు వినిపించాయి. ఇది ఏ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా తీసిన సినిమా కాదు. కానీ, సీఎంతో పాటు అతని కుమారుడి పాత్రలు చూస్తే ఏపీలో ముఖ్యమంత్రులుగా చేసిన తండ్రి కొడుకులు గుర్తుకు రావడం ఖాయం. అయితే, వాళ్లు అని ఘంటాపథంగా చెప్పలేం.


'ప్రతినిధి 2'లో వాస్తవ పరిస్థితుల స్ఫూర్తితో రూపొందించిన సన్నివేశాలు ఉన్నాయి. అందులో మరో మాటకు తావు లేదు. అవినీతి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల్ని ఎండగట్టే సన్నివేశాలు ఉన్నాయి. అందులో సందేహం అక్కర్లేదు. తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే సన్నివేశం ఉంది. రచయితగా, దర్శకుడిగా జర్నలిస్ట్ మూర్తి తొలి సినిమాలో మెరుపులు చూపించారు. అయితే, కథకుడిగా ప్రారంభం నుంచి ముగింపు వరకు టెంపో కంటిన్యూ చేయలేకపోయారు.


టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అజయ్ ఘోష్, నారా రోహిత్ సన్నివేశం 'ఒకే ఒక్కడు'లో అర్జున్ & రఘువరన్ ఇంటర్వ్యూను గుర్తు చేస్తుంది. ఇన్వెటిగేషన్ ప్రాసెస్ అంతా రామ్ చరణ్ 'ధృవ' తరహాలో ఉంటుంది. 'ప్రతినిధి 2' మీద గతంలో వచ్చిన సీన్స్, ఫిలిమ్స్ ప్రభావం ఉన్నా... కమర్షియల్ ప్యాకేజీలో సినిమాను మలిచారు మూర్తి. ఈ సినిమాలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మీద సెటైర్లు పడ్డాయి. ప్రభాత్ మిశ్రా పాత్రను ఆయన ఉద్దేశించి తీశారని ఈజీగా అర్థం అవుతుంది. పూర్తిగా ఓ పార్టీకి అనుకూలంగా, మరొక పార్టీకి వ్యతిరేకంగా సినిమా తీయలేదు. దాంతో మధ్యస్తంగా మిగిలింది.


Also Readచిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?



'ప్రతినిధి'లో సామాన్య ప్రజలు కనెక్ట్ అయ్యే, ఆలోచింప చేసే డైలాగులు ఉన్నాయి. 'ప్రతినిధి 2'లో ఆ తరహా సన్నివేశాలు, సంభాషణలు తక్కువ. రాజకీయ నాయకుల అవినీతి బయటపెట్టే ఫస్టాఫ్ ఎంగేజ్ చేస్తుంది. సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి పూర్తిగా హీరో రివేంజ్ డ్రామా అన్నట్టు మారుతుంది. దాంతో 'ప్రతినిధి' అర్థం, పరమార్థం మారిపోయాయి. సినిమాలో రెండు పాటలూ ఇరికించినట్టు ఉన్నాయి. నేపథ్య సంగీతంలో మహతి స్వరసాగర్ న్యాయం చేశారు. టెక్నికల్ టీమ్ నుంచి మూర్తి మంచి అవుట్ పుట్ తీసుకున్నారు. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా బావున్నాయి.


నారా రోహిత్ నటుడిగా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. సినిమాల్లో గ్యాప్ వచ్చింది కానీ ఆయన నటనలో మార్పు లేదు. నటనలో, డైలాగ్ డెలివరీలో మరోసారి పట్టు చూపించారు. వెయిట్ పరంగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నారా రోహిత్ తర్వాత జిష్షుసేన్ గుప్తాకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఆయన నటన ఓకే. సచిన్ ఖేడేకర్, అజయ్ ఘోష్, పృథ్వీ, అజయ్, 'ఈ రోజుల్లో' శ్రీ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


'ప్రతినిధి 2' ఎవరినీ టార్గెట్ చేసిన సినిమా కాదని చెప్పాలి. ఏ పార్టీకీ ఇది వ్యతిరేకం కాదు. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. రాజకీయ అవినీతిని బయటపెట్టే సన్నివేశాలతో ఫస్టాఫ్ పాస్ అయిపోతుంది. ఇన్వెస్టిగేషన్ గ్రిప్పింగ్‌గా సాగితే సెకండాఫ్ రిజల్ట్ మరోలా ఉండేది. సిన్సియర్ జర్నలిస్టుగా నారా రోహిత్ నటన, దర్శకుడిగా మూర్తి ప్రయత్నం అభినందనీయం. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, ఎవరికీ వ్యతిరేకం కాదన్న కోణంలో ప్రజెంట్ చేయడంతో విజయానికి ఓ మెట్టు దూరంలో సినిమా ఆగింది.


Also Read'బాక్' మూవీ రివ్యూ: ఆత్మగా మారిన తమన్నా - తమిళ హారర్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?