Satyadev's Krishnamma movie review in Telugu: సత్యదేవ్ నటనకు అభిమానులు ఉన్నారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగిన స్టార్లలో ఆయనొకరు. తొలుత చిన్న చిన్న వేషాలు వేసి... కథానాయకుడి స్థాయికి వచ్చారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'కృష్ణమ్మ'. అగ్ర దర్శకులలో ఒకరైన కొరటాల శివ సమర్పణలో తెరకెక్కిన సినిమా కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. 


కథ (Krishnamma Movie Story): భద్ర (సత్యదేవ్), శివ (కృష్ణ తేజ రెడ్డి), కోటి (మీసాల లక్ష్మణ్)... ముగ్గురూ అనాథలు. బెజవాడలోని వించిపేట కుర్రాళ్లు. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. భద్ర, కోటి గంజాయి స్మగ్లింగ్ వంటి పనులు చేస్తుంటే... శివ చిన్న ప్రింటింగ్ ప్రెస్ రన్ చేస్తూ, ఇద్దరు మిత్రుల్ని స్మగ్లింగ్ మానేయమని చెబుతూ ఉంటాడు. ఇదీ వాళ్ల నేపథ్యం!


అనాథలైన భద్ర, శివ, కోటి తమకూ ఓ కుటుంబం ఉండాలని ఆశ పడతారు. మీనా (అతిరా రాజ్)తో శివ ప్రేమలో పడతాడు. భద్రకు ఆమె రాఖీ కట్టడంతో సొంత చెల్లెలు కింద చూస్తాడు. ఆమె పరిచయం తర్వాత గంజాయి స్మగ్లింగ్ మానేసి ఆటో నడపడం మొదలు పెడతాడు. మీనా తల్లి ఆపరేషన్‌కు రెండు లక్షలు అవసరం పడతాయి. చివరిసారిగా భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేసి వచ్చిన డబ్బుతో ఆపరేషన్ చేయించాలని డిసైడ్ అవుతారు. అయితే, పోలీసులకు దొరుకుతారు. వాళ్ల మీద గంజాయి కేసు కాకుండా రేప్ అండ్ మర్డర్ కేసు నమోదు అవుతుంది. 


హత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు? ఆమెపై దారుణానికి పాల్పడింది ఎవరు? అసలు కేసు ఏమిటో తెలియకుండా తామే చేశామని శివ, భద్ర, కోటి ఎందుకు అంగీకరించారు? తెలిశాక ఏం చేశారు? ఈ ముగ్గురూ పోలీసుల కస్టడీలో ఉంటే మీనా ఏమైంది? చివరకు ఏమని తేలింది? అనేది సినిమా.


విశ్లేషణ (Krishnamma Review): రౌడీయిజం పుట్టింది బెజవాడలో వంటి డైలాగులు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. విజయవాడ నేపథ్యంలో యాక్షన్ బేస్డ్ సినిమాలు వచ్చాయి. మరి, ఆయా సినిమాలకు... 'కృష్ణమ్మ'కు తేడా ఏమిటి? ఇందులో కొత్తగా ఏముంది? అనేది చూస్తే?


కథగా చూస్తే 'కృష్ణమ్మ'లో చూపించిన ఓ ఎమోషన్ కొత్తది ఏమీ కాదు. కానీ, సత్యదేవ్ పెర్ఫార్మన్స్ వల్ల కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. ముగ్గురు అనాథలు కలిసి పెరగడం, అందులో ఒకరు ప్రేమలో పడటం వంటి సీన్లు ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూసినవే. అందువల్ల ఇంటర్వెల్ వచ్చే వరకు 'కృష్ణమ్మ' సాదాసీదాగా ఉంటుంది. హీరోతో పాటు అతడి స్నేహితుల్ని అరెస్ట్ చేశాక, వాళ్ల మీద పెట్టినది రేప్ అండ్ మర్డర్ కేసు అనేది రివీల్ అయ్యాక ఒక్కసారిగా సినిమా టోన్ మారింది. ముఖ్యంగా సత్యదేవ్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ కారణంగా సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సుల్లో ఎమోషన్ వర్కవుట్ అయ్యింది. సినిమాను రెండు పార్టులుగా కంపేర్ చేస్తే... ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బెటర్.


దర్శకుడు వీవీ గోపాలకృష్ణ కథ, కథనాల్లో కొత్తదనం లేదు. కానీ, దర్శకత్వంలో రా అండ్ రస్టిక్ ఫీల్ తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. సత్యదేవ్ లుక్ నుంచి బాడీ లాంగ్వేజ్ డిజైన్ చేసిన తీరు బావుంది. కాలభైరవ సంగీతంలో సిద్ శ్రీరామ్ పాడిన పాట బావుంది. నేపథ్య సంగీతం ఓకే. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. ఇంటర్వెల్ వరకు కామెడీతో పాటు లవ్ ట్రాక్ ఆసక్తికరంగా డిజైన్ చేసి ఉంటే బావుండేది. పతాక సన్నివేశాలను హడావిడిగా ముగించారు. హత్యలు అన్నీ చకచకా చూపించారు. ఆ హత్యలను స్క్రీన్ ప్లేకి వాడుకుంటే బావుండేది.


సత్యదేవ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యారెక్టర్లలో 'కృష్ణమ్మ'లో భద్ర కూడా ఒకటిగా నిలుస్తుంది. కళ్ళల్లో ఇంటెన్స్ చూపించారు. నడిరోడ్డు మీద స్నేహితుడి మరణం తర్వాత ఎక్స్‌ప్రెషన్ ఆయనలో నటుడిని మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేస్తుంది. పతాక సన్నివేశాల్లో నటన కూడా బావుంది. హీరో అంటే సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ ఉండాలని కోరుకోకుండా పాత్రకు అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా నటించిన సత్యదేవ్ ను మెచ్చుకోవాలి. కోటి, శివ పాత్రల్లో మీసాల లక్ష్మణ్, కృష్ణతేజా రెడ్డి నటన ఓకే.


Also Read: చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?



'కృష్ణమ్మ'తో వెండితెరకు పరిచయమైన అతిరా రాజ్ తొలి సినిమాలో చక్కటి నటన కనబరిచారు. ఆమె నటన సహజంగా ఉంది. హీరోకి జోడీగా, అతనితో ప్రేమలో పడే అమ్మాయిగా అర్చనా అయ్యర్ క్యారెక్టర్ నిడివి తక్కువే. ఉన్నంతలో బాగా చేశారు. రఘు కుంచె పాత్ర నిడివి తక్కువ. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు చేశారు.


'కృష్ణమ్మ' చూస్తున్నప్పుడు, సినిమాలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఇబ్రహీం పట్నంలోని కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఓ హత్యాచార ఘటన (ఆయేషా మీరా) గుర్తుకు వస్తుంది. ఆ కథ స్ఫూర్తితో రా అండ్ రస్టిక్ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామా తీశారు. సత్యదేవ్ నటన బావుంటుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేయలేదు కానీ సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. క్లైమాక్స్ ఓ శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తుంది. తమిళ సినిమాల తరహాలో తీసిన 'రా' అండ్ రస్టిక్ డ్రామా 'కృష్ణమ్మ'. రెగ్యులర్ కమర్షియల్ జానర్ సినిమాల మధ్య డిఫరెంట్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు బెటర్ ఆప్షన్. హీరో సత్యదేవ్ కోసం వెళ్లవచ్చు!


Also Read'బాక్' మూవీ రివ్యూ: ఆత్మగా మారిన తమన్నా - తమిళ హారర్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?