Chiranjeevi About Ram Charan And Pawan Kalyan Films: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. ఆయన తర్వాత ఆయన వారసులుగా మెగా ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలు అయ్యారు. అందులో చాలామంది టాలీవుడ్‌లో టాప్ స్టార్లుగా ఎదిగారు. ముఖ్యంగా ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉంటూ టాప్ స్టార్లుగా ఎదిగిన వారిలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యి సినిమాలు తగ్గించినా కూడా తన కెరీర్‌ను మర్చిపోలేని కొన్ని చిత్రాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నటించిన సినిమాల్లో తన ఫేవరెట్ మూవీస్ ఏంటని బయటపెట్టారు చిరంజీవి.


ఆ సినిమా చాలాసార్లు చూశాను..


తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అందులో తన రాజకీయ జీవితం గురించి కిషన్ రెడ్డి షేర్ చేసుకోగా.. తన సినిమా లైఫ్ గురించి చిరంజీవి మాట్లాడారు. ‘‘మెగా ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలుగా పరిచయమయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి’’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలిప్రేమ చాలా ఇష్టం. బద్రి, జల్సా ఇష్టం. అత్తారింటికి దారేది అయితే చాలాసార్లు చూశాను. తను చేసినవి కొన్ని సినిమాలే అయినా అన్నీ అద్భుతమైన సినిమాలే ఒకటి రెండు తప్పా’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు చిరంజీవి.


అదే నా ఫేవరెట్..


రామ్ చరణ్ సినిమాల్లో తనకు నచ్చిన సినిమా గురించి చెప్తూ.. ‘‘చరణ్ రెండో సినిమా మగధీర అయితే నా భూతో నా భవిష్యత్’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు మెగాస్టార్. ‘మగధీర’ సమయంలో చిరంజీవి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. అప్పటిరోజులను కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ‘‘మీరు మగధీర రిలీజ్ అయిన రోజు అసెంబ్లీలో ఉన్నారు. చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయి సినిమా అని నాతో షేర్ చేసుకున్నారు. ఆ సినిమా చాలా బాగా వచ్చిందని ఎంత సంతోషపడిపోయారో’’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేశారు కిషన్ రెడ్డి. చిరంజీవి కూడా ఆ విషయం తనకు గుర్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తన ఫేవరెట్ మూవీ మగధీర అని తెలిపారు.


అందరూ బిజీ..


ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల్లో స్టార్‌డమ్ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ప్రజాసేవ, రాజకీయాల్లో బిజీ అయిపోయారు. త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రచారాల్లో బిజీగా గడిపేస్తున్నారు. దీంతో తను సైన్ చేసిన సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉండగా.. వాటి షూటింగ్స్ అన్నీ అర్థాంతరంగా ఆగిపోయాయి. మరోవైపు రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’పై కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. కానీ చిరంజీవి మాత్రం ఎలాగైనా వచ్చే ఏడాది సంక్రాంతికి ‘విశ్వంభర’తో ఫ్యాన్స్‌ను అలరించాలని ఫిక్స్ అయ్యారు.



Also Read: నాకు, క్లిన్ కారాకు మధ్య కామన్‌గా ఉంది ఏంటి? చిరంజీవికి కోడలు ఉపాసన చిక్కు ప్రశ్న- మెగాస్టార్ జవాబు ఇదే