Neru Movie Review: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌-జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ 'నెరు'. వీరిద్దరిది హిట్‌ కాంబినేషన్‌ అనే విషయం తెలిసిందే. దృశ్యం సీక్వెల్స్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఒక్క మలయాళంలోనే కాదు ఇతర భాషల్లోనూ ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీంతో వీరిద్దరి కాంబోకి మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన 'నెరు'పై మొదటి నుంచే మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక మలయాళం థియేటర్లో రిలీజైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద హిట్‌ టాక్‌ తెచ్చుకుని రూ.100 కోట్ల వసూళ్లు చేసింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ వేదికగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ ఎమోషనల్ కోర్టు డ్రామా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ మెప్పిస్తుందా? ఇక్కడ చూద్దాం!


కథ ఏంటంటే.. కేరళలో సాగే కథ ఇది. మహ్మద్‌ (జగదీశ్‌) దంపతుల ఏకైక సంతానం సారా (అనస్వర రాజన్‌). మంచి ఉన్నతమైన కుటుంబం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న సారా తన 12వ ఏట అరుదైన వ్యాధితో బాధపడుతుంది. దానివల్ల చూపు కోల్పోయిన సారా తల్లిదండ్రులు కంటిరెప్పలా కాపాడుకుంటారు. అంధురాలైన సారా మనిషి స్పర్శ ద్వారా అతడి స్వభావం, క్యారెక్టర్‌, వ్యక్తిత్వం చెప్పేస్తుంది. అంతేకాదు తనలో ఒక ప్రత్యేకమైన నైపుణ్యం కూడా ఉంటుంది. ఆ నైపుణ్యమే సారాని వేధించిన వ్యక్తిని బయటపెడుతుంది. ఒక రోజు సారా తల్లిదండ్రులు బంధువుల ఫంక్షన్‌కు వెళతారు.


రాత్రి ఒంటరిగా ఉన్న సారాపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేస్తాడు. దీంతో అతడు ఎవరనే న్యాయపోరాటానికి దిగుతుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టలేక పోలీసుల సైతం విసిగిపోతారు. దీంతో సారా స్పర్శ ద్వారా ఆ వ్యక్తి రూపాన్ని తయారు చేస్తుంది. ఆ శిల్పం మైఖేల జోసెఫ్‌()కి దగ్గర పోలికలు ఉండటంతో పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్‌ చేస్తారు. అతడు ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు కావడంతో కేసు సంచలనంగా మారుతుంది. కేసు వాపసు తీసకోవాలని సారా కుటుంబానికి డబ్బు ఆశ చూపిస్తాడు. కానీ, సారా తనకు న్యాయం జరగపోయినా పర్వాలేదు.. తను పోరాటం చేస్తానని తేల్చిచెబుతుంది. ఇక కేసు గెలిచేందుకు పేరున్న లాయర్‌ రాజశేఖర్‌ (సిద్ధిఖ్‌) మైఖేల్‌ తండ్రి అడ్వకేట్‌గాన నియమించుకుంటాడు.


అతడు ఎంతటి క్లిష్టమైన కేసునైనా తన వాదనతో గెలిపించే టాలెంట్‌ ఆయనది. దీంతో కథ మరింత ఆసక్తిగా మారుతుంది. మరోవైపు సారా తండ్రి విజయ్‌ మోహన్‌  (మోహన్‌ లాల్‌) సంప్రదిస్తాడు. తమ కూతురిక తరపు వాదించమని కోరతాడు. మొదట కేసు ఒప్పుకొని విజయ్‌ మోహన్‌ సారా పట్టుదలతో చూసి వెనక్కి తగ్గుతాడు. కేసు వాదించేందు సిద్ధమవుతాడు. దీంతో అప్పుడే అసలు కథ మొదలవుతుంది. సారాను అత్యాచారం చేసింది ఎవరూ? విజయ్‌ మోహన్‌ కేసు టేకప్‌ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు.. అలాంటి పరిస్థితుల్లో విజయ్‌ మోహన్‌ సారాకు ఎలా న్యాయం చేశాడు.. ఇంతకి పూర్ణిమ రాజశేఖర్‌(ప్రియమణి) ఎవరూ? ఆమెకు విజయ్‌ మోహన్‌కు సంబంధం ఏంటీ? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.



విశ్లేషణ.. జీతూ జోసెఫ్‌ సినిమా అంటేనే అందులో ఎదోక యూనిక్‌ పాయింట్‌ ఉంటుంది. అలాగే నెరు కూడా సరికొత్త పాయింట్‌ తీసుకున్నాడు. అదే అందురాలిపై అత్యాచారం.. ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియకుండానే న్యాయపోరాటం చేయడం వంటి యునిక్‌ పాయింట్‌ను తీసుకున్నాడు. మూవీ తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యాడు. సారా ఇంట్లోనే అత్యాచార ఘటనతో కథ మొదలు పెట్టి.. ఆ తర్వాత ఆసక్తికర సంఘటనలు జోడిస్తూ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచాడు. జీతూ జోసెఫ్‌ టేకింగ్‌ శైలి కాస్తా డిఫరెంట్‌ అనే విషయం తెలిసిందే. సినిమా మొదలైన అరగంటకు కానీ ఏం అర్థం కాదు. అప్పుడే కీలక పాత్రలను కథలో తీసుకువస్తూ.. మధ్యలో ఆసక్తికర సన్నివేశాలను జోడిస్తూ సినిమాను నడిపిస్తాడు. నెరులోనూ అదే చేశాడు.


మూవీ ప్రారంభమైన చాలా సేపటి తర్వాత కీ రోల్స్‌ చూపిస్తూ.. క్రైం చేసిన వ్యక్తిని పట్టుకోవడం, కోర్టు ప్రోసీడింగ్‌లో కీలక పాత్ర తీసుకునే నిర్ణయాలను ఆసక్తికర ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన విధానం బాగా ఆకట్టుకుంటుంది. మోహన్‌ లాల్‌ వచ్చేవరకు స్టోరీ కథ నెమ్మదిగా సాగినా ఆ తర్వాత పెట్టిన ట్విస్ట్స్‌.. కోర్టులో సాగే వాదోపవాదాలు, చర్చలు, మధ్యలో ఎదురయ్యే ప్రతిబంధకాలను పరిష్కరిస్తూ ప్రతి ఎలిమెంట్‌ ఆసక్తిగా అనిపించింది. కోర్టులో సారాను మైఖేల్‌ తరపు న్యాయవాది తన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. నెరులో అక్కడక్కడా ద్రశ్యం, వకీల్‌ సాబ్‌ మూవీ టచ్‌ చేస్తాయి. కానీ మొత్తానికి సినిమా మాత్రం ఆడియన్స్‌ని మెప్పింస్తుందనే చెప్పాలి. 


ఎవరెలా చేశారంటే.. నెరులో ప్రతి పాత్ర బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. లాయర్‌ విజయ్‌ మోహన్‌గా మోహన్‌లాల్‌ పాత్రకు తగినట్టుగా ఒదిగిపోయారు. అంధురాలిగా అనస్వర రాజన్‌ యాక్టింగ్‌, ముఖంలో చూపించని హావభావాలు హైలెట్‌ అనాలి. ప్రియమణి, దినేష్‌ ప్రభాకర్‌, సిద్ధిఖ్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు. జీతూ జోసెఫ్‌ పనితనం మరోసారి అదుర్స్ అంటున్నారు. సినిమాలో క్రైం చేసింది ఎవరో ముందే తెలిసినా చివరకు ఉత్కంఠగా కథ చివరకు నడిపించిన విధానం, స్క్రిన్‌ప్లే బాగుంది. కోర్టు రూంకు అవసరమైన అన్ని ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కించడంలో జీతూ జోసెఫ్‌ సక్సెస్‌ అయ్యాడు.