Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా అక్కడికి చేరుకున్నారు. చాలామంది సినీ సెలబ్రిటీలకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రమ్మని ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. అందుకే వారంతా అక్కడికి చేరుకొని రాముడిని నేరుగా దర్శించుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మెగా హీరోలతో ధనుష్ దిగిన సెల్ఫీ కూడా అదే విధంగా వైరల్ అవుతోంది.
అయోధ్య ప్రారంభోత్సవంలో సందడి..
జనవరి 22న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. శ్రీ బలరాముడికి ప్రాణ ప్రతిష్టను నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రజినీకాంత్, ధనుష్, కంగనా రనౌత్, రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్.. ఇంకా మరెందరో సినీ సెలబ్రిటీలు ఈ వేడుకను నేరుగా చూడడానికి అయోధ్యకు చేరుకున్నారు. ఇప్పటికే అయోధ్య నుండి మెగా ఫ్యామిలీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై వారి స్పందన కూడా వైరల్ అయ్యింది. కానీ తాజాగా ఒక కొత్త ఫోటో బయటికొచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్..
మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్‌తో కలిసి ధనుష్ సెల్ఫీ తీసుకున్నాడు. ఈ సెల్ఫీని ముగ్గురు హీరోల్లో ఎవరూ పోస్ట్ చేయకపోయినా.. ఏదో ఒక విధంగా బయటికొచ్చింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యింది. ముగ్గురు ట్రెడీషినల్ దుస్తులు ధరించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ఈ అన్‌సీన్ ఫోటోకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ తమిళంలో విడుదలయ్యి మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా పరవాలేదనిపిస్తోంది. ఇక ఇప్పుడు ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగులో విడుదల అవ్వడానికి సర్వం సిద్ధమయ్యింది. జనవరి 26న ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపై హైప్ క్రియేట్ చేయడం కోసం జనవరి 25న పెయిడ్ ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేసింది టీమ్.
మెగా హీరోలు బిజీ..
మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కూడా తమ తమ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా ‘విశ్వంభర’ అనే సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రారంభించగా.. రామ్ చరణ్ మాత్రం ఇంకా ‘గేమ్ ఛేంజర్’తోనే కుస్తీలు పడుతున్నాడు. తమిళ దర్శకుడు శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ అనే భారీ బడ్జెట్ పొలిటికల్ డ్రామాను ప్రారంభించాడు రామ్ చరణ్. కానీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఏదో ఒకటి అడ్డంకి వస్తూనే ఉంది. ఈ సినిమా నుండి మొదటి పాట విడుదల అవుతుందని అప్డేట్ ఇచ్చి చాలాకాలం అయినా కూడా ఇంకా పాట, గ్లింప్స్ లాంటివి ఏమీ విడుదల కాకపోవడంతో ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.
Also Read: రామ్ చరణ్ బర్త్ డేకి ముందు - నయా మేకోవర్‌తో సెట్స్ మీదకు!