Pa Ranjith Comments on Ayodhya: అయెధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుడు, సామాన్య ప్రజలు.. ఈ వేడుకకు హాజరయ్యాయి. రాముడిని చూసి పరవశించిపోయారు. కానీ ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో పలు విమర్శలు కూడా ఎదురయ్యాయి. కొందరు ప్రజలు.. అయోధ్య అనేది రాజకీయ అవసరాల కోసం, లాభాల కోసం ఉపయోగించుకుంటున్న అంశం అంటూ ఈ వేడుకను ఖండించారు కూడా. ముఖ్యంగా ఈ విమర్శలు ఎక్కువగా తమిళనాడు నుండే వచ్చాయి. తాజాగా ఒక దర్శకుడు కూడా అయోధ్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.


ఉగ్రవాదులు అని ముద్రవేస్తారు..


కమర్షియల్ సినిమాలతో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా రంజిత్. ఇక తమిళనాడు మొత్తం దాదాపుగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఖండిస్తుండగా.. రంజిత్ కూడా వారిలో ఒకడయ్యాడు. రంజిత్.. ప్రస్తుతం దర్శకత్వంలో బిజీగా ఉండగానే.. సొంతంగా ఒక ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాడు. అదే ‘బ్లూ స్టార్’. ఇక ఈ ప్రొడక్షన్‌కు సంబంధించిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో అయోధ్యపై కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేశాడు రంజిత్. ‘‘ఒకవేళ ఈరోజు మనం ఇంట్లో దీపాలు వెలిగించకపోతే మనం ఉగ్రవాదులం అనిపించే స్థాయికి వచ్చేశాం. ఇండియా భవిష్యత్తు చాలా డేంజర్‌లో ఉంది. వచ్చే 5, 10 ఏళ్లలో ఇండియా ఏమయిపోతుందో అని ఆందోళన చెందే స్థితికి వచ్చాం’’ అంటూ ఇండియా భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు రంజిత్.


ఇండియాను కాపాడాలి..


‘‘మన మనసులో, మెదడులో నాటుకుపోయిన కమ్యూనల్ భావాలను తొలగించడానికి ఆయన ఆర్ట్‌ను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తు నుండి ఇండియాను కాపాడడానికి మనమందరం కచ్చితంగా కృషిచేయాలి. దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా ఇదే చేస్తారని నమ్ముతున్నారు’’ అంటూ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు రంజిత్. అయోధ్య అనేది వెనుకబడిన రాజకీయ వ్యూహాల్లో ఒకటి అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక తమిళనాడులో చాలావరకు ప్రజలు అయోధ్యను ఖండిస్తున్నా.. కొందరు కోలీవుడ్ స్టార్లు మాత్రం ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అందులో రజినీకాంత్ కూడా ఒకరు. ఇక రజినీకాంత్ ఈ వేడుకకు హాజరవ్వడంపై కూడా రంజిత్ స్పందించాడు.


రాజకీయం ఏంటో ప్రశ్నించాలి..


‘‘రామ మందిరానికి వెళ్లాలి అనుకోవడం ఆయన ఛాయిస్. కానీ ఇది 500 ఏళ్ల సమస్యకు ముగింపు అని ఆయన అన్నారు. దాని వెనుక రాజకీయం ఏంటో మనం ప్రశ్నించాలి. ఆయన చెప్పింది కరెక్టా కాదా అనే దానిగురించి కాకుండా ఆ వ్యాఖ్యలను నేను విమర్శిస్తున్నాను’’ అంటూ రజినీకాంత్.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటూ దానికి తాను సమ్మతించనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు రంజిత్. ప్రస్తుతం రంజిత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో అయోధ్య చిచ్చు రగులుతున్న సమయంలో ఒక సెలబ్రిటీ అందరి ముందుకు వచ్చి మాట్లాడడం వల్ల ఆ సమస్య మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రారంభోత్సవానికి రజినీకాంత్‌తో పాటు చాలామంది సినీ సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది.


Also Read: హిందీ బాక్సాఫీస్‌పై ‘హనుమాన్’ దండయాత్ర - కానీ త్వరలోనే బ్రేకులు!