Ambajipeta Marriage Band Trailer : ‘కలర్ ఫొటో' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాడు. నాచురల్ స్టార్ నాని తర్వాత మళ్లీ ఆ స్థాయిలో తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. దీనికంటే ముందు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన సుహాస్ కలర్ ఫోటోతో హీరోగా ఓ మెట్టు పైకి ఎక్కేసాడు. సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కలర్ ఫోటో తర్వాత హీరోగా నటిస్తూనే మరోవైపు కమెడియన్ నవ్వులు పూయించాడు. అలాగే నెగిటివ్ రోల్ లోను అదరగొట్టాడు. అడవి శేష్ నటించిన 'హిట్ 2' లో సుహాస్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.


ఇక రీసెంట్ గా 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో త్వరలోనే 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' అనే సినిమాతో రాబోతున్నాడు. దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుహాస్ సరసన శివాని నాగారం హీరోయిన్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా బుధవారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకోవడంతోపాటు ఎమోషనల్ గాను కనెక్ట్ అయ్యేలా ఉంది. సుహాస్ మరోసారి ఈ సినిమాతో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించడం గ్యారెంటీగా కనిపిస్తోంది.


ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఊరిలో బ్యాండ్ కొట్టే అబ్బాయి ప్రేమలో పడ్డాక అతని జీవితం మారింది? అతని అక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అక్క కోసం హీరో చేశాడు? చివరికి తన ప్రేమను గెలిపించుకున్నాడా? అనేది ఈ సినిమా కథ. విలేజ్ నేటివిటీలో ప్రేమ, అవమానాలు, పగ, ప్రతీకారాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో పంపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ స్టార్టింగ్ లో హీరో, హీరోయిన్ల మధ్య సాగే సరదా సన్నివేశాలను చూపించారు. "మావోడు బ్యాండ్ ఇక్కడ కొడితే అంబాజీపేట సెంటర్ వరకు వినబడుద్ది" అని హీరో ఫ్రెండ్ హీరోయిన్ తో చెప్పగానే.. " అలాగైతే అక్కడ పెళ్లికి ఇక్కడి నుంచి కొడతావా" అంటూ హీరోయిన్ కౌంటర్ వేసే డైలాగ్ ఆకట్టుకుంది.


ఆ తర్వాత హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, రొమాన్స్ లాంటి సీన్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. మరోవైపు హీరోయిన్ అక్క స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ పలు అవమానాలు ఎదుర్కొంటుంది. ఆ అవమానాలకు దీటుగా హీరో ఎలా పోరాడాడు అనే సన్నివేశాలతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. అంతేకాదు ట్రైలర్ లో సుహాస్ గుండు గీయించుకునే షాట్ హైలెట్ గా నిలిచింది. ఇక ట్రైలర్ చివరలో చితి ముందు హీరో కూర్చుని ఏడుస్తున్న సమయంలో "మన ప్రేమ నీ ప్రాణం మీదికి తేకూడదు మల్లి" అంటూ బ్యాగ్రౌండ్ లో డైలాగ్ వస్తుంది.


దీన్ని బట్టి సినిమాలో హీరోయిన్ చనిపోతుందా? హీరో చితి ముందు కూర్చుని ఏడ్చేది హీరోయిన్ కోసమేనా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అదే నిజమైతే కలర్ ఫోటో మూవీ తరహాలో ఈ సినిమాకి కూడా సాడ్ ఎండింగ్ ఉంటుందేమో చూడాలి. GA2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ సమేతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



Also Read : ఈ ఏడాది సమ్మర్‌లో పెద్ద సినిమాల సందడి లేనట్టేనా? ఆ సినిమాలకు లైన్ క్లియర్