Summer Telugu Movies: ప్రతి సమ్మర్ లోనూ పెద్ద హీరోల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతాయి. గత కొంత కాలంగా సమ్మర్ కానుకగా విడుదలైన బోలెడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఈ సీజన్‌లో సినిమాలకు మంచి లాంగ్ రన్ ఉంటుంది. అందుకే చాలా మంది పెద్ద స్టార్స్ సమ్మర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తారు. అయితే, ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పెద్ద స్టార్ల సినిమాలు లేకుండా సమ్మర్ సీజన్ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 


సమ్మర్ బరి నుంచి తప్పుకుంటున్న పెద్ద సినిమాలు


ఈ ఏడాది టాలీవుడ్ లో పలు సినిమాల మీద భారీగా హైప్ ఏర్పడింది. వాటిలో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, అల్లు అర్జున్ ‘పుష్ప-2’, ప్రభాస్ ‘కల్కి 2898 AD’ చిత్రాలు ఉన్నాయి. ‘గేమ్ ఛేంజర్’, ‘పుష్ప-2’ సినిమాలో సమ్మర్ బరిలో ఉండవని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే, తాజాగా ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు కూడా రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.


‘దేవర’, ‘కల్కి’ సినిమాలు వాయిదా?


వాస్తవానికి ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘దేవర’ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల అవుతుందని అందరూ భావిచారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. ఆయన పార్ట్ షూటింగ్ పెండింగ్ లోనే ఉంది. అటు ఈ సినిమాకు పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించేందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చందర్ చాలా టైమ్ తీసుకుంటున్నారట. ఇప్పటి వరకు ఫస్ట్ సాంగ్ ట్యూన్ కూడా ఫైనల్ చేయనట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లోనే జరిగే అవకాశం ఉంది. మొత్తంగా పలు కారణాలతో ఈ సినిమా సమ్మర్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 AD’ మే 9న విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన CG పనులు వేగంగా పూర్తయితే.. అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఈ సమ్మర్‌లో తెలుగు ప్రేక్షకులకు సందడే.


‘టైర్-2’ సినిమాలు సత్తా చాటేనా?


అటు బాలయ్య, బాబీ కాంబోలో వస్తున్న సినిమా మాత్రం వేసవికి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తియితేనే ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్’, ‘టిల్లు స్క్వేర్’ లాంటి టైర్ 2 సినిమాలతో ‘ఇండియన్ 2’ లాంటి  డబ్బింగ్ సినిమాలు సమ్మర్ లో సత్తా చాటే అవకాశం ఉంది.


Read Also: ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌కు లైన్ క్లియర్ - ఆ ఎక్స్‌ట్రా సీన్స్‌తో పాటు స్ట్రీమింగ్‌కు సిద్ధం