Satyadev and Dolly Dhananjay's Zebra Review In Telugu: ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా తెలుగు చిత్రసీమలోకి వచ్చి నటుడిగా నిరూపించుకోవడంతో పాటు హీరోగా ఎదిగిన వ్యక్తి సత్యదేవ్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'జీబ్రా'. 'పుష్ప'లో జాలిరెడ్డి క్యారెక్టర్ చేసిన కన్నడ స్టార్ డాలీ ధనుంజయ మరో హీరో. బ్యాంకు మోసాల నేపథ్యంలో దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది? 'లక్కీ భాస్కర్' రేంజులో హిట్ అవుతుందా? అనేది చూద్దాం. 


కథ (Zebra Movie Story): సూర్య (సత్యదేవ్) ఓ బ్యాంకులో ఉద్యోగి. ప్రేయసి స్వాతి (ప్రియా భవానీ శంకర్)కు ఓ సమస్య వస్తే తన తెలివితేటలు ఉపయోగించి బ్యాంకు మోసానికి పాల్పడి పరిష్కరిస్తాడు. నాలుగు లక్షల కోసం సూర్య ఫ్రాడ్ చేస్తే... ఐదు కోట్ల రూపాయల స్కాంలో ఇరుక్కుంటాడు. 


ఒక వైపు బ్యాంకులో సత్య మీద ఎంక్వయిరీ మొదలు అవుతుంది. ఒక్క ఫోన్ కాల్ చేసి ఎంత పెద్ద పని అయినా చేయించగల సమర్థుడు, రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన ఆది (డాలీ ధనుంజయ) నుంచి ఐదు కోట్ల కోసం బెదిరింపులు వస్తాయి. ఆ ఐదు కోట్లు ఎవరివి? దాన్నుంచి బయట పడటం కోసం పని చేసే బ్యాంకులో డబ్బు కొట్టేయాలని వేసిన ప్లాన్ ఏమైంది? ఈ ప్లానులో బడ్డీ (సత్య) ఏం చేశాడు? బాబా (సత్యరాజ్) పాత్ర ఏమిటి? ఆ స్కాం నుంచి సూర్య ఎలా బయట పడ్డాడు? అనేది 'జీబ్రా' సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Zebra Movie Review Telugu): ఇటీవల ఆన్‌లైన్ మోసాల గురించి ఎక్కువ వింటున్నాం. ఉన్నట్టుండి తమ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయని కొంత మంది చెప్పడం వినే ఉంటారు. ఆ మోసాల వెనుక ఏం జరుగుతుంది? బ్యాంకులో పనులు ఎలా చేస్తారు? అనే అంశాల నేపథ్యంలో తీసిన సినిమా 'జీబ్రా'.


బ్యాంకు మోసాలు, షేర్ మార్కెట్, వైట్ కాలర్ క్రిమినల్స్ అంటే లేటెస్ట్ 'లక్కీ భాస్కర్', 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ గుర్తుకు వస్తాయి. దాంతో 'జీబ్రా' మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అయితే... ఆ నేపథ్యం కంటే నటీనటులు సినిమాకు బలంగా నిలిచారు. ఓ బ్యాంకు ఉద్యోగి, మరో క్రిమినల్ కలిస్తే జీబ్రా అన్నట్టు ఈశ్వర్ కార్తీక్ టైటిల్ పెట్టారు. అయితే... సినిమా మొదలైన తర్వాత పులి జింక మధ్య వేటలా ఆట మొదలైనట్టు ఉంటుంది. కానీ, చివరకు పులి జింక కలిసి ఆడటం ఆసక్తిగా ఉంటుంది. 'జీబ్రా'కు ఫస్టాఫ్ ప్లస్ అయితే... సెకండాఫ్ స్టార్టింగ్ కొంత నిదానంగా సాగడం మైనస్. దీనికి తోడు కాస్త వివరంగా చెప్పాల్సిన బ్యాంకింగ్ మోసాలను పైపైన చెబుతూ వెళ్లారు. క్లుప్తంగా చెప్పాల్సిన సన్నివేశాలు కొన్నిటిని సాగదీశారు.


దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ రాసుకున్న కథలో విషయం ఉంది. ముఖ్యంగా కొన్ని సీన్స్ కంపోజ్ చేసిన విధానం బావుంది. సత్యదేవ్ (Satyadev Zebra Review)ను అండర్ డాగ్ అన్నట్టు చూపించారు. ఆయన నుంచి బెస్ట్ పెర్ఫార్మన్స్ రాబట్టారు. డాలీ ధనుంజయను చూపించిన సన్నివేశాలు క్రేజీగా ఉన్నాయి. డాన్ టైపు పాత్రలో హీరోయిజం చూపించిన తీరు బావుంది. ధనుంజయ స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సన్నివేశం హై ఇస్తుంది. అయితే... తన డైలాగ్ డెలివరీ, నటనతో ఆ టెంపో హోల్డ్ చేస్తూ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్లిన ఘనత మాత్రం సత్యదేవ్‌దే.


కథ, క్యారెక్టర్, సీన్ ఏదైనా సరే... తన టైమింగ్‌తో నవ్విస్తున్న నటుడు సత్య. బడ్డీగా ఈ సినిమాలోనూ కొన్ని పంచ్ డైలాగ్స్, వన్ లైనర్లతో నవ్వించారు. సత్యరాజ్ కూడా భలే చేశారు. ప్రియా భవానీ శంకర్ పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్ చేశారు. జెన్నిఫర్ యాక్టింగ్ ఓకే. కానీ, డబ్బింగ్ కామన్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కష్టం. సునీల్ గెటప్ నుంచి క్యారెక్టరైజేషన్ వరకు డిఫరెంట్‌గా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తారు.


Also Read'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?


పాటల కంటే నేపథ్య సంగీతంలో రవి బస్రూర్ మేజిక్ ఎక్కువ వినిపించింది. పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఆర్ఆర్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. అయితే... ఎడిటింగ్ పరంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తుందీ సినిమా. సత్యదేవ్, ధనుంజయ కథలతో పాటు మిగతా కథలనూ ప్యారలల్‌గా చూపించినా... కథను కన్‌ఫ్యూజన్ లేకుండా దర్శకుడు చెప్పడంలో ఎడిటింగ్ హెల్ప్ అయ్యింది. నిర్మాణ విలువలు బావున్నాయి.


బ్యాంకు ఫ్రాడ్స్ వంటి సినిమాల్లో లాజిక్స్ చాలా ఇంపార్టెంట్. అయితే... వాటిని మర్చిపోయి స్క్రీన్ మీద మేజిక్ ఎంజాయ్ చేసేలా తీసిన సినిమా 'జీబ్రా'. కాన్సెప్ట్ బావుంది. డిటైలింగ్ తక్కువ అయినా సరే... సత్యదేవ్, డాలీ ధనుంజయ తమ నటనతో మెస్మరైజ్ చేశారు. నెక్స్ట్ ఏంటి? అనే థ్రిల్ ఇస్తూ మధ్య మధ్యలో నవ్వించిన, ఎంగేజ్ చేసిన సినిమా 'జీబ్రా'. వీకెండ్ హ్యాపీగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.


Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?