Vyooham Web Series Review in Telugu
సినిమా రివ్యూ: వ్యూహం (వెబ్ సిరీస్)
రేటింగ్: 2.5/5
నటీనటులు: సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్, శశాంక్, ప్రీతి అర్సానీ, శ్వేత వర్మ తదితరులు
ఛాయాగ్రహణం: కె.సిద్థార్థ్ రెడ్డి
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
నిర్మాతలు: సుప్రియ యార్లగడ్డ
దర్శకత్వం: శశికాంత్, శ్రీవైష్ణవ్ పసుపులేటి
విడుదల తేదీ: డిసెంబర్ 15, 2023


అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన వెబ్ సిరీస్ ‘వ్యూహం’. ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్‌గా అమెజాన్‌లో ఈ వెబ్ సిరీస్ శుక్రవారం విడుదల అయింది. ట్రైలర్‌ను చూస్తే మంచి క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపించిన ‘వ్యూహం’ ఎలా ఉంది? ఆడియన్స్ దగ్గర వర్కవుట్ అయిందా?


కథ (Vyooham Web Series Story): మైకేల్ (చైతన్య కృష్ణ) తన భార్య జెస్సికా (పావని గంగిరెడ్డి)తో కలిసి ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటాడు. ప్రెగ్నెంట్‌గా ఉన్న జెస్సికాను హాస్పిటల్‌కు తీసుకువెళ్లడానికి క్యాబ్ బుక్ చేస్తే అది క్యాన్సిల్ అవుతుంది. తన కారు సర్వీసులో ఉంటుంది. దీంతో తప్పక బైక్‌పై బయలుదేరతారు మైకేల్, జెస్సికా. దారిలో మూడు సార్లు వేర్వేరు బైక్‌లు అడ్డు రావడం కారణంగా త్రుటిలో ప్రమాదం తప్పుతుంది. అదే దారిలో నాలుగోసారి కారు గుద్దేయడంతో జెస్సికాకు మిస్ క్యారేజ్ అవ్వడంతో పాటు తను గతాన్ని కూడా మర్చిపోతుంది. దీంతో పోలీస్ కేస్ పెడతాడు మైకేల్. ఈ కేసు ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ రామచంద్ర (ఈ నగరానికి ఏమైంది ఫేమ్ సాయి సుశాంత్ రెడ్డి) చేతికి వెళ్తుంది. అసలు ఈ యాక్సిడెంట్ వెనక ఉన్న కారణాలేంటి? కథలేంటి? అర్జున్ రామచంద్ర తల్లి వాణి రామచంద్రకు ఈ కథకు ఏంటి సంబంధం? చివరికి ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ప్రైమ్‌లో సిరీస్ చూడాల్సిందే.


విశ్లేషణ (Vyooham Web Series Review): మనిషి చేసే ప్రతి పనికి తగిన ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందేనని కర్మ సిద్ధాంతం చెబుతుంది. స్థూలంగా దీని ఆధారంగానే ‘వ్యూహం’ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌లో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే... ఇంటిల్లిపాదీ కలిసి కూర్చుని ఈ సిరీస్‌ను ఏ భయం లేకుండా ప్రశాంతంగా స్ట్రీమ్ చేయవచ్చు. ఎక్కడా ఒక అభ్యంతరకర సన్నివేశం కానీ, బూతులు కానీ లేకుండా సిరీస్‌ను తెరకెక్కించారు.


‘వ్యూహం’లో కొన్ని ఎపిసోడ్లు బాగా వర్కవుట్ అయ్యాయి. నీహారిక పాత్ర పోషించిన ప్రీతి అర్సానీ మిస్సింగ్ ఎపిసోడ్ అంతా చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. హీరో ఎవరు? విలన్ ఎవరు? ఎవరు రైట్? ఎవరు రాంగ్?... ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండటం ఇంట్రస్ట్‌ను పుట్టిస్తుంది. ‘వ్యూహం’ కథనం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ప్రధాన కథతో సమాంతరంగా ఎన్నో ఉపకథలను నడిపిస్తూ చివరికి వాటిని ఒక చోటకు చేర్చాలన్న ఐడియా పూర్తిస్థాయిలో వర్కవుట్ కాలేదు. ఉపకథల అల్లిక మధ్యలో బాగా గజిబిజిగా మారిపోతుంది.  ఒకానొక దశలో ఏది ఫ్లాష్‌బ్యాక్? ఏది ప్రెజెంట్ స్టోరీ? స్క్రీన్ మీద ఎవరి కథ నడుస్తుంది? అనే కన్ఫ్యూజన్ కూడా ప్రేక్షకులకు వచ్చే అవకాశం ఉంది. సిరీస్ నిడివి కూడా చాలా ఎక్కువగా ఉంది. కథనం గ్రిప్పింగ్‌గా ఉంటే నిడివి సమస్య ఉండదు. కానీ అలా లేకపోవడం కారణంగా సాగదీత ఫీలింగ్ కలుగుతుంది. ఒకానొక దశలో అనవసరపు ఉపకథలు విసిగిస్తాయి కూడా.


కొన్ని ఉపకథలకు అయితే కంక్లూజన్ కూడా ఇవ్వకుండా వదిలేశారు. ఆనంద్ సామి పోషించిన రామ్‌జీ పాత్రను ముగించారు. కానీ అతని కథలో తలెత్తిన కీలకమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. అలాగే అర్జున్ రామచంద్ర కథలో కూడా ప్రధాన సూత్రధారి పేరు చెప్పారు తప్ప తనను ఎక్కడా చూపించలేదు కూడా. దీనికి సంబంధించిన క్లారిటీ రెండో సీజన్‌‌లో (ఒకవేళ తీస్తే) ఇస్తారేమో చూడాలి.


సిరీస్‌కు శ్రీరామ్ మద్దూరి ఇచ్చిన నేపథ్య సంగీతం సీన్లను బాగా ఎలివేట్ చేసింది. సిద్థార్థ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఒక మిడ్ రేంజ్ సినిమా స్థాయిలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. 


Also Read: హాయ్ నాన్న సినిమా రివ్యూ: నాని, మృణాల్ నటించిన రొమాంటిక్ & ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?


ఇక నటీనటుల విషయానికి వస్తే... సాయి సుశాంత్ పోషించిన అర్జున్ రామచంద్ర పాత్రలో వేరియేషన్స్ చూపించడానికి పెద్దగా స్కోప్ లేదు. పోలీసు పాత్రకు అవసరమైన సీరియస్‌నెస్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ తన పాత్రకు న్యాయం చేశారు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో పావని గంగిరెడ్డి, చైతన్య కృష్ణ చాలా బాగా నటించారు. శశాంక్, ప్రీతి అర్సానీ, శ్వేత వర్మ, రవీంద్ర విజయ్ సహా మిగతా పాత్రధారులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... ఉపకథల సంఖ్యను, నిడివిని కాస్త తగ్గించుకుని ఉంటే తెలుగులో వచ్చిన మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ల్లో ‘వ్యూహం’ కూడా చేరేది. వీకెండ్‌కు ఓటీటీల్లో ఒక క్లీన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే కాస్త ఓపికగా ‘వ్యూహం’ను చూసేయవచ్చు.


Also Read: వధువు రివ్యూ: అవికా గోర్‌ కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ? డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో కొత్త సిరీస్ ఎలా ఉందంటే?