Raviteja Eagle Movie: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా ‘టైగర్ నాగేశ్వర్ రావు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల అయ్యింది. ఈ సినిమాతోనే రవితేజ హిందీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయింది. తొలి షో నుంచే ప్రేక్షకులలో నెగెటివ్ టాక్ మొదలయ్యింది. దీంతో సుమారు పాటు అరగంట నిడివి తగ్గించారు మేకర్స్. అయినా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కాలేదు. సౌత్ తో పాటు నార్త్ లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. యావరేజ్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జనవరి 13న ‘ఈగల్’ విడుదల
‘టైగర్ నాగేశ్వర్ రావు’తో పెద్ద డిజాస్టర్ అందుకున్న రవితేజ ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో కలిసి ‘ఈగల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో కావ్య థాపర్ కనిపించబోతోంది. ఇప్పటికే షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతోంది.
హిందీలో ‘సహదేవ్’గా విడుదల అవుతున్న ‘ఈగల్’
తాజాగా ‘ఈగల్’ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ పేరు మార్చుతున్నట్లు ప్రకటించారు. అయితే, కేవలం హిందీలోనే ఈ మార్పు ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీలో ‘సహదేవ్’ పేరుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, హిందీ వెర్షన్ టీజర్ ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, హిందీలో ఈ సినిమా పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? అనే విషయం పైన మేకర్స్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నిజానికి రవితేజ నటించిన అన్ని సినిమాలు హిందీలో డబ్ అవుతుంటాయి. యూట్యూబ్ లో అందుబాటులో ఉంటాయి. ఆయన సినిమాలు హిందీ వెర్షన్ లో మంచి వ్యూస్ కూడా దక్కించుకుంటాయి. నార్త్ లోనూ ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అయితే, ‘ఈగల్’ అనే పేరు కాకుండా ‘సహదేవ్’ అనే పేరు నార్త్ కు సూటయ్యేలా ఉందనే భావనతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది .
ఇక ఈ సినిమాలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. డవ్‌జాండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమాతో రవితేజ మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.
Read Also: హ్యాపీ బర్త్ డే అడివి శేష్ - ‘సినిమా’ అతడి గుండె చప్పుడు, అమెరికా వదిలేసి అందరివాడయ్యాడు!