Pindam movie review in Telugu
సినిమా రివ్యూ: పిండం
రేటింగ్: 2.5/5
నటీనటులు: శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, అద్దూరి రవి వర్మ తదితరులు
కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ
ఛాయాగ్రహణం: సతీష్ మనోహర్!
సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
సమర్పణ: ఆరోహి దైదా నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి!
దర్శకత్వం: సాయికిరణ్ దైదా
విడుదల తేదీ: డిసెంబర్ 15, 2023  


Pindam movie 2023 review In Telugu: హారర్ / థ్రిల్లర్స్ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఈ మధ్య 'మసూద', 'విరూపాక్ష', 'మా ఊరి పొలిమేర' మంచి విజయాలు సాధించాయి. మరో హారర్ సినిమా 'పిండం' శుక్రవారం విడుదలైంది. గర్భవతులు ఈ సినిమా చూడవద్దని, థియేటర్లకు దూరంగా ఉండాలని చేసిన ప్రచారం కూడా సినిమాపై ప్రేక్షకుల చూపు పడేలా చేసింది. మరి, సినిమా ఎలా ఉంది? 


కథ (Pindam Movie Story): సోఫీ, తారా... ఆంటోనీ, మేరీ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. మూడో సంతానంగా మగపిల్లాడు అయితే బావుంటుందని, కోడలి కడుపున తన భర్త జన్మిస్తాడని ఆంటోనీ తల్లి కోరుకుంటుంది. సుక్లాపేట్ ఊరిలో పాత ఇంటిని కొనుగోలు చేసిన ఆ కుటుంబం, అక్కడికి షిఫ్ట్ అవుతుంది. అప్పటి నుంచి చిత్ర విచిత్రమైన ఘటనలు జరుగుతాయి. మాటలు రాని తారా ఏవేవో మాట్లాడుతుండటంతో సోఫీ షాక్ అవుతుంది. ఆంటోనీ తల్లి మరణిస్తుంది. నిండు గర్భిణి అయిన మేరీకి తప్ప మిగతా అందరికీ ఏదో ఒక ఆపద ఎదురవుతుంది. ఆ ఇంటికి వదిలి వెళ్ళాలని ఆంటోనీ ప్రయత్నించినా కుదరదు.


ఆంటోనీకి ఎదురైన ఆపద నుంచి అతడిని అన్నమ్మ (ఈశ్వరీ రావు) ఎలా కాపాడింది? ఆమె ఎటువంటి తాంత్రిక పూజలు నిర్వహించింది? ఆంటోనీ కొన్ని ఇంటిలో ఉన్న ఆత్మల కథ ఏమిటి? మేరీని తప్ప మిగతా వాళ్ళను ఎందుకు వేధించాయి? లోక్‌నాథ్ (అవసరాల శ్రీనివాస్) పాత్ర ఏమిటి? అనేది సినిమా. 


విశ్లేషణ (Pindam Movie Telugu Movie Review): హారర్ కథల్లో కొత్తదనం చాలా తక్కువ కనబడుతూ ఉంటుంది. ప్రతి సినిమాలో ఆత్మ కామన్. ఆ ఆత్మ ఎవరో ఒకరిని ఆవహించడం కూడా కామన్! అయితే... ఆత్మలకు తీరని కోరిక ఏమిటి? అవి ఆత్మలుగా ఎందుకు మారాయి? ఇప్పుడు ఏం కోరుకుంటున్నాయి? అనేది సినిమా రిజల్ట్ డిసైడ్ చేస్తుంది. కథనం ఎంత ఆసక్తికరంగా ఉంటే... ఇదీ రొటీనే అని ప్రేక్షకుల మనసులలోకి రానివ్వకుండా ముందుకు సాగితే... సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుంది. 


'పిండం' సినిమాకు వస్తే... రెగ్యులర్ & రొటీన్ ఫార్మటులో కథ, కథనం సాగాయి. ఆ అంశాల్లో ఏమాత్రం కొత్తదనం లేదు. సగటు హారర్ సినిమా సాగినట్టు సాగింది. పోనీ, దర్శకుడి టేకింగ్ & రైటింగ్ అయినా కొత్తగా ఉందా? అంటే అదీ లేదు. హారర్ సీన్స్ సైతం ఇంతకు ముందు చూసినట్టు ఉంటాయి.


నిర్మాణ విలువల్లో పరిమితులు అక్కడక్కడా కనిపించాయి. అన్నమ్మ అంబాసిడర్ కారు రంగులు మారుతూ ఉంటుంది. గ్రాఫిక్స్ మరింత క్వాలిటీగా ఉండాలి. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి పలు సన్నివేశాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ సీన్స్ తీయడంలో దర్శకుడు అంతగా సక్సెస్ కాలేదు.


'పిండం'లో ఫ్లాష్‌బ్యాక్, అందులో ఆడపిల్లలను వద్దనుకునే తండ్రి సీన్లు కథను ఆసక్తిగా మార్చాయి. సౌండ్ డిజైన్ & బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బావున్నాయి. మ్యూజిక్ వల్ల కొన్ని సన్నివేశాల్లో హారర్ ఎలివేట్ అయింది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సినిమా ప్రారంభమైన కాసేపటికి ఆ వాతావరణంలోకి ప్రేక్షకుడు వెళ్లేలా లైటింగ్ థీమ్, ఫ్రేమ్స్ ఉన్నాయి. 


నటీనటులు ఎలా చేశారంటే: సినిమాకు మెయిన్ అట్రాక్షన్ అంటే... ఈశ్వరీ రావు పాత్ర. అన్నమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. తాంత్రిక శక్తులు ఉన్న మహిళగా చక్కటి నటన కనబరిచారు. ఆమెను ఇంటర్వ్యూ చేసే పాత్రలో అవసరాల శ్రీనివాస్ కనిపించారు. నటుడిగా ఆయన ప్రతిభ చూపించే సన్నివేశాలు పెద్దగా లేవు. కానీ, సీక్వెల్ వస్తే... ఇప్పటి వరకు ఆయనను చూడనటువంటి పాత్రలో చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు కలుగుతుంది.


శ్రీరామ్, ఖుషీ రవి జంట మధ్య తరగతి భార్యాభర్తలుగా కనిపించారు. తమ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. హారర్ సన్నివేశాల్లో పెర్ఫార్మన్స్ కాస్త ఆకట్టుకుంటుంది. అద్దూరి రవి వర్మ డిఫరెంట్ రోల్ చేశారు. ఆయనకు మైలేజ్ ఇచ్చే క్యారెక్టర్ ఇది. మిగతా నటీనటులు పర్వాలేదు.


Also Read: హాయ్ నాన్న సినిమా రివ్యూ: నాని, మృణాల్ నటించిన రొమాంటిక్ & ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?


చివరగా చెప్పేది ఏంటంటే: 'పిండం' కథ, కథనాల్లో కొత్తదనం లేదు. కానీ, మధ్య మధ్యలో భయపెడుతుంది. అందుకు కారణం బ్యాగ్రౌండ్ మ్యూజిక్! ఆర్ఆర్ & కెమెరా వర్క్, కొన్ని థ్రిల్స్ కోసం అయితే ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి థియేటర్లకు వెళ్లే ప్రయత్నం చేయండి.  


Also Read: వధువు రివ్యూ: అవికా గోర్‌ కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ? డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో కొత్త సిరీస్ ఎలా ఉందంటే?