విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ రూపొందించిన సినిమా ఎనిమీ. ఈ సినిమా దీపావళి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్లను పూర్తిగా యాక్షన్‌తో నింపేయడంతో అటువంటి సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ ఎనిమీ ఆ అంచనాలను అందుకుందా?


కథ: సూర్య(విశాల్), రాజీవ్(ఆర్య) బాల్యంతో సినిమా ప్రారంభం అవుతుంది. రాజీవ్ తండ్రి పారి(ప్రకాష్ రాజ్) వీరిద్దరినీ చిన్నప్పటి నుంచే పోలీసులను చేయాలని ట్రైనింగ్ ఇస్తుంటాడు. సూర్య తండ్రి(తంబి రామయ్య)కి మాత్రం ఇది ఏమాత్రం ఇష్టం లేదు. రాజీవ్ తండ్రి చనిపోవడంతో వీరి దారులు వేరవుతాయి. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ వీరు కలవాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో వీరి జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయి? స్నేహితులుగా ఉన్న వీరు శత్రువులుగా ఎలా మారారు? వీరికి, అనీషా(మమతా మోహన్ దాస్)కి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఎనిమీని చూడాల్సిందే..


విశ్లేషణ: ఇంకొక్కడు సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొంది.. తర్వాత నోటాతో పరాజయం అందుకున్న ఆనంద్ శంకర్ మూడు సంవత్సరాల తర్వాత తీసిన సినిమా ఇది. విశాల్, ఆర్యలు ఇద్దరికీ తమిళంలో యాక్షన్ హీరోలుగా మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే కథను ఆనంద్ శంకర్ రాసుకున్నాడు. ఇందులో యాక్షన్‌తో, ఎమోషన్‌కు కూడా కలిపి దానికి చక్కని స్క్రీన్ ప్లేను రాసుకున్నాడు. ఫ్లాష్‌బ్యాక్‌ను మొదటే చూపించేసినా.. విశాల్, ఆర్యలకు ఎందుకు శత్రుత్వం ఏర్పడిందనే అంశంతో పాటు, అనీషా పాత్రకు సంబంధించిన డిటైల్స్ కూడా అందులోనే రివీల్ చేయడం కథ మీద ఆనంద్ ఎంత వర్క్ చేశాడో చెబుతుంది.


అయితే ప్రతి జోనర్‌కు ప్రైమరీ ఆడియన్స్ కొంతమంది ఉంటారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు చూసి మొదట ఈ సినిమాకు వెళ్లేది యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారే. స్క్రీన్‌ప్లే బాగా రేసీగా ఉండాలని వారు అనుకుంటారు. ఇందులో ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు వచ్చినప్పుడు కథనం కాస్త నెమ్మదిస్తుంది. దీంతోపాటు ఫస్టాఫ్‌లో కొన్ని అనవసరం లేని సన్నివేశాలు, పాటలు ఇబ్బంది పెడతాయి. విశాల్ పక్కన హీరోయిన్ పాత్ర ఇందులో కేవలం అలంకార ప్రాయం మాత్రమే. తను వచ్చినప్పుడల్లా కథనానికి బ్రేకులు పడుతూ ఉంటాయి. విశాల్, ఆర్యల మధ్య క్యాట్ అండ్ మౌస్ ఇంటెలిజెంట్ గేమ్‌కు ఆనంద్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో యాక్షన్ సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉండవు. ఉన్న కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను మాత్రం చాలా బాగా తీశారు. అలాగే చివర్లో కథను హడావుడిగా, అర్థాంతరంగా ముగించేసినట్లు అనిపిస్తుంది.


ఇక నటీనటుల విషయానికి వస్తే.. విశాల్‌కు, ఆర్యకు ఇలాంటి పాత్రలు కొత్తవి కావు. ఇద్దరూ బేసిక్‌గా యాక్షన్ హీరోలే కాబట్టి.. తమ పాత్రల్లో జీవించారు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రధానంగా ఆర్య నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్లలో మమతా మోహన్ దాస్ చాలా రోజుల తర్వాత స్క్రీన్‌పై కనిపించింది. కీలకమైన అనీషా పాత్రలో మంచి నటన కూడా కనపరిచింది. ఇక మృణాలిని సేన్‌ది అంత ముఖ్యమైన పాత్ర కాదు. మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక విభాగాలు చూస్తే.. థమన్ అందించిన పాటల్లో ఒకటి కూడా వినదగ్గదిగా లేదు. అయితే శామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. ఆర్‌డీ రాజశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ బాగా రిచ్‌గా అనిపించింది. ఎడిటింగ్ మరి కాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది.


ఓవరాల్‌గా చెప్పాలంటే.. యాక్షన్ ప్రియులను ఈ సినిమా అలరిస్తుంది. అయితే కథలో లాజిక్ లేని సన్నివేశాల విషయంలో కాస్త జాగ్రత్త వహించి.. కాస్త క్రిస్పీగా ఉండేలా చూసుకుంటే బాగుండేది. మరీ నిరాశపరిచే విధంగా అయితే ఈ సినిమా లేదు.


Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి