సినిమా రివ్యూ: కన్మణి రాంబో కతీజా
రేటింగ్: 2.5/5
నటీనటులు: విజయ్ సేతుపతి, నయనతార, సమంత తదితరులు
ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.ఖదీర్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: లలిత్ కుమార్
దర్శకత్వం: విఘ్నేష్ శివన్
విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2022


విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటించిన 'కన్మణి రాంబో కతీజా' సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార, సమంతలకు తోడుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న విజయ్ సేతుపతి హీరోగా నటించటం, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన పాటలు సూపర్ హిట్ అవ్వటం, ట్రైలర్ కామిక్ గా కట్ చేయటంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. మరి సినిమా ఆ స్థాయిలో ఉందా? విఘ్నేష్ శివన్ వరుసగా మూడో హిట్ కొట్టాడా?


కథ: రేఖపల్లి ఆనందరాజు మదనగోపాల భోగేశ్వరుడు (విజయ్ సేతుపతి) అలియాస్ రాంబోకు తను దురదృష్టవంతుడిని అని నమ్మకం. తను పుట్టినరోజే తండ్రి చనిపోవడం, తల్లి మంచానికే పరిమితం కావటంతో రాంబో ఊరికి దూరంగా ఉంటాడు. కన్మణి(నయనతార), కతీజా(సమంత) రాకతో తన జీవితంలో సంతోషం కనిపిస్తుంది. తనకు తెలియకుండానే ఇద్దరిని ప్రేమిస్తాడు రాంబో. అయితే తను చేస్తోంది తప్పు అనే అపరాధభావన కలుగుతుంది. అప్పుడు రాంబో ఏం చేశాడు? ఇద్దరిలో ఎవరిని ఎంచుకున్నాడు? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...


విశ్లేషణ: మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే అందరినీ ఒకేలా ఇష్టపడతాం. ఇద్దరు పిల్లలుంటే తల్లిదండ్రులు సమానంగానే ప్రేమిస్తారు. ఇద్దరు అమ్మాయిలను సమానంగా, ఎటువంటి దురుద్దేశం లేకుండా స్వచ్ఛంగా ప్రేమించడం సాధ్యమేనా? అనే పాయింట్ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందించాడు. తను గతంలో రూపొందించిన సినిమాలు నానుమ్ రౌడీ దాన్ (తెలుగులో నేనూ రౌడీనే), తానా సేంద కూట్టం (తెలుగులో గ్యాంగ్) తెలుగులో కూడా విజయం సాధించాయి. ఈ సినిమాలో కామెడీ పరంగా పాస్ అయిపోయిన దర్శకుడు, ఎమోషన్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు.


కథలో హీరోను ఇద్దరికీ సమానంగా పంచిన విఘ్నేష్ శివన్... కామెడీ పార్ట్‌ను పూర్తిగా కతీజా ఎపిసోడ్‌లో, ఎమోషన్ పార్ట్‌ను పూర్తిగా నయనతార ఎపిసోడ్‌లో చూపించాడు. రాంబో-కన్మణి ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్‌గానూ, రాంబో-కతీజా ఎపిసోడ్ ఫన్నీగానూ సాగుతుంది. ముఖ్యంగా టీ-కాఫీ, బాదం-పిస్తా ఎపిసోడ్లు బాగా నవ్విస్తాయి. హీరో ఇద్దరినీ ప్రేమించానని చెప్పే సన్నివేశాలు, దాంతో కనెక్ట్ అయిన టీవీ షో ఎపిసోడ్ సరదాగా సాగుతుంది. అయితే సెకండాఫ్‌లో రాంబో గురించి కన్మణి, కతీజాలకు నిజం తెలిశాక కథ పూర్తిగా గాడి తప్పింది. సినిమా ప్రారంభంలో హీరో ఎమోషన్‌తో వచ్చే కనెక్షన్, సెకండాఫ్‌లో పూర్తిగా డిటాచ్ అయిపోతుంది. అసలు కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో దర్శకుడు కూడా గందరగోళానికి లోనయ్యాడేమో అనిపిస్తుంది. కానీ క్లైమ్యాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్స్ మనసును హత్తుకుంటాయి. అంతలోనే మరో సరదా సన్నివేశంతో సినిమాను ముగించడంతో ముఖంపై చిరునవ్వుతోనే థియేటర్లలో నుంచి బయటకు వస్తాం. కానీ ఎమోషన్‌కు సంబంధించిన లోటు మాత్రం అలాగే ఉండిపోతుంది.


సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ అనిరుధ్ సంగీతం. ఈ సినిమాకు తను అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కొంచెం షార్ప్‌గా ఉండాల్సింది. అనవసర సన్నివేశాలకు కత్తెర వేస్తే నిడివి 2 గంటల 15 నిమిషాలకు వచ్చేసేది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.


Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?


ఇక నటీనటుల విషయానికి వస్తే... విజయ్ సేతుపతికి ఇటువంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. రాంబోగా తన నటన చాలా సహజంగా ఉంటుంది. ఇద్దరినీ ఒకేలా ప్రేమిస్తున్న సమయంలో తను చేస్తున్నది కరెక్టా, తప్పా అనే సందిగ్ధంలో ఉండే సన్నివేశాల్లో తన నటన ఆకట్టుకుంటుంది. ఇద్దరికీ ఒకేసారి ప్రపోజ్ చేసే సమయంలో బాగా నవ్విస్తాడు. ఇద్దరు హీరోయిన్లు కూడా తమ పాత్రల్లో ఇమిడిపోయారు. నయనతార, సమంత ఆ క్యారెక్టర్లకు పర్‌ఫెక్ట్ ఫిట్. ఇక మిగతా నటీనటులందరూ తమ పరిధిలో ఆకట్టుకుంటారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... మంచి కామెడీ సినిమా చూసి కాసేపు నవ్వుకోవాలంటే ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీని ఒక్కసారి చూడవచ్చు. అయితే రేపు (శుక్రవారం) ఆచార్య విడుదల అవుతుంది కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమాను ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి!


Also Read: 'గాలివాన' రివ్యూ: సాయి కుమార్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?