Rahul Vijay And Shivani Rajashekar's Vidya Vasula Aham Review Streaming On Aha: రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా 'తెల్లవారితే గురువారం' ఫేమ్ మణికాంత్ గెల్లి తెరకెక్కించిన సినిమా 'విద్య వాసుల అహం'. థియేటర్లలో విడుదల చేయాలని తీశారు. కానీ కుదరలేదు. రెండేళ్ల తర్వాత ఆహా ఓటీటీలో విడుదల చేశారు. భార్యాభర్తల మధ్య కలహాలు, ఇగోలు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.


కథ (Vidya Vasula Aham Story): విద్య (శివానీ రాజశేఖర్) టిపికల్ అమ్మాయి. పెళ్లి కొడుకును సెలెక్ట్ చేయడం కోసం ఓ ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమని అడుగుతుంది. ఓ విధంగా ఎగ్జామ్ అన్నమాట. అబ్బాయిలు రాసిన సమాధానాలను బట్టి మార్కులు వేసి ఒకరిని ఎంపిక చేస్తుంది. అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్న వాసు (రాహుల్ విజయ్) ఆ ఒక్కడు అన్నమాట.


పెళ్లి చూపుల్లో విద్య, వాసు ప్రేమలో పడతారు. ఏడడుగులు వేసిన తర్వాత వేరు కాపురం పెడతారు. పెళ్లైన కొత్తలో అంతా బావుంటుంది. జీవితం సంతోషంగా ముందుకు వెళుతుంది. మరి, కొత్త జంట మధ్య గొడవ ఎందుకు వచ్చింది? ఎవరి అహం (ఇగో) వల్ల ఎవరి మనసు నొచ్చుకుంది? మధ్యలో తల్లిదండ్రులు రాకతో ఏం జరిగింది? చివరకు ఇద్దరూ ఎలా ఒక్కటి అయ్యారు? అనేది సినిమా. 


విశ్లేషణ (Vidya Vasula Aham Review): వివాహ వ్యవస్థ, పెళ్లైన కొత్తల్లో ఆలు మగల నడుమ పంతాలు, పట్టింపులు, ఇగో నేపథ్యంలో తెలుగు తెరపై మంచి సినిమాలు వచ్చాయి. పెళ్లైన ప్రతి జంట మధ్య ఒకే విధమైన ప్రేమ లేదా గొడవలు ఉంటాయని చెప్పలేం. అందువల్ల, ప్రతి కథను ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యారు. మరి, ఈ కథలో కొత్తదనం ఏముంది? సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...


పెళ్లి నిశ్చయమైన తర్వాత అమ్మాయి, అబ్బాయి కలుస్తారు. మాటల మధ్యలో ఇగో ప్రస్తావన వస్తుంది. అప్పుడు 'నీకు ఇగో ఉందా?' అని అమ్మాయి ప్రశ్నిస్తుంది. 'అహా అసలు లేదు' అని అబ్బాయి సమాధానం ఇస్తాడు. 'మంచిది. ఎందుకంటే ఇద్దరికీ ఉంటే కష్టం' అంటుంది అమ్మాయి. టీజర్‌లోనూ ఉందీ సీన్! ఇగో లేదా అహం... ఈ పదాన్ని ఈజీగా వాడేశారు కానీ సినిమాలో, హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లలో అది అంతగా కనిపించలేదు.


పెళ్లి కొడుకును సెలెక్ట్ చేయడం కోసం అమ్మాయి టెస్ట్ పెట్టడం, ఆ ప్రశ్నలు ఇగో అనిపించొచ్చు. అదంతా కొందరికి ఫన్నీగా ఉంటుంది. కానీ, పెళ్లైన తర్వాత భార్య, భర్త మధ్య గొడవకు కారణం మాత్రం ఇగో కాదు. అందులో అమ్మాయి భవిష్యత్ ఆలోచనలు, జాగ్రత్త కనిపిస్తుంది. ఇక, అబ్బాయి విషయానికి వస్తే పంతానికి పోయి ఉద్యోగం మానేస్తాడు. కట్ చేస్తే భార్య దగ్గర ఏమాత్రం మొహమాటం లేకుండా డబ్బులు తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉంటాడు. అహం ఉన్నోడు అమ్మాయి డబ్బు తీసుకోవడం ఎందుకు? అనే సందేహం వస్తే... సినిమా ప్రేక్షకుడి అసలు కనెక్ట్ కాదు.


పెళ్లి, భార్యాభర్తలు నేపథ్యం తెలుగు సినిమాకు కొత్త కాదు. 'అహం' కాన్సెప్ట్ ఒక్కటీ ఈ సినిమాకు కొత్త. ఇగో నేపథ్యంలో సన్నివేశాలను పేలవంగా రాశారు. కొత్త జంట మధ్య గొడవకు దారి తీసిన కారణం సిల్లీగా ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కటి కావడానికి చూపించిన కారణంలోనూ బలం లేదు. పునాది బలంగా ఉంటే తర్వాత వచ్చే సన్నివేశం లేదా భావోద్వేగం బావుంటుంది. పెళ్లి చూపుల్లో ప్రేమలో ఎందుకు పడ్డారు? అనేది సరిగా చూపించలేదు. పైపైన టచ్ చేసి వెళ్లారు. ఆ తర్వాత సన్నివేశాల్లోనూ అది కంటిన్యూ అయ్యింది. 'విద్య వాసుల అహం'కు రైటింగ్ చాలా వీక్. కొన్ని సన్నివేశాలు మెప్పిస్తాయంతే! మాటల్లో ప్రాస కోసం, పదాల కోసం రచయిత కష్టపడ్డారు. అది టూ మచ్ అనిపించింది. కల్యాణీ మాలిక్ మ్యూజిక్ బావుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి.


Also Readచిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?


రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ పెయిర్ బావుంది. కొత్త జంటగా చక్కగా సెట్ అయ్యారు. కామెడీలో రాహుల్ విజయ్ ఓకే. అయితే, ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. శివానీ రాజశేఖర్ నటనకు తోడు వాయిస్, మాడ్యులేషన్ విద్య పాత్రకు హెల్ప్ అయ్యాయి. మెజారిటీ సన్నివేశాల్లో వాళ్లిద్దరూ కనిపించారు. కాశీ విశ్వనాథ్, రవివర్మ అడ్డూరి తదితరులకు పెద్దగా ప్రాధాన్యం కనిపించలేదు. మహావిష్ణువు & లక్ష్మీదేవి పాత్రలో శ్రీనివాస్ అవసరాల, అభినయ... నారదుడిగా శ్రీనివాసరెడ్డి తమ పాత్రల పరిధి మేరకు చేశారు. వాళ్ల సన్నివేశాలతో కథకు వచ్చిన ప్రయోజనం లేదు. కామెడీ కుదరలేదు.


'విద్య వాసుల అహం'... రొమాంటిక్ ఎంటర్‌టైనర్! కథ, స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేదు. కొత్త జంట మధ్య గొడవ, కలయికలో బలం లేదు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ నటన, రొమాంటిక్ సన్నివేశాల్లో ఆ జంట కెమిస్ట్రీ, మధ్య మధ్యలో కొన్ని కామెడీ సన్నివేశాలు కొంత వరకు రిలీఫ్ ఇస్తాయి. వీకెండ్ టైంపాస్ చేయడానికి మరో ఆప్షన్ లేకపోతే ఈ సినిమా ట్రై చేయండి. లేదంటే లైట్‌! ఆ డ్రామా డిజప్పాయింట్‌ చేస్తుంది!


Also Readప్రతినిధి 2 రివ్యూ: నారా రోహిత్ పొలిటికల్ కాంట్రవర్సీనా? లేదంటే ఇది థ్రిల్లర్ సినిమానా?