సినిమా రివ్యూ: టైగర్ 3
రేటింగ్: 2.5/5
నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ, రేవతి, సిమ్రాన్, అనీష్ కురువిల్లా, రద్ధీ డోంగ్రా, మాస్టర్ విశాల్ జేత్వా, కుముద్ మిశ్రా, రణ్వీర్ షోరే తదితరులతో పాటు అతిథి పాత్రల్లో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్
కథ: ఆదిత్యా చోప్రా 
ఛాయాగ్రహణం: అనయ్ గోస్వామి 
నేపథ్య సంగీతం: తనూజ్ టికు
స్వరాలు: ప్రీతమ్
నిర్మాత: ఆదిత్య చోప్రా 
దర్శకత్వం: మనీష్ శర్మ
విడుదల తేదీ: నవంబర్ 12, 2023  


Tiger 3 Movie Review starring Salman Khan Katrina Kaif: 'పఠాన్' విజయం, ఆ సినిమాలో అతిథిగా సల్మాన్ ఖాన్ చేసిన యాక్షన్ సీన్ తర్వాత 'టైగర్ 3' మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి. 'పఠాన్' కంటే ముందు యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ (YRF SPY Universe)లో భారతీయ గూఢచారిగా సల్మాన్ ఖాన్ నటించిన 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' విజయాలూ అంచనాలు పెరగడానికి కారణం. మరి, 'టైగర్ 3' ఎలా ఉంది? 


కథ (Tiger 3 Story): టైగర్ అలియాస్ అవినాష్ (సల్మాన్ ఖాన్) తన భార్య జోయా (కత్రినా కైఫ్), పిల్లాడితో కలిసి హ్యాపీగా జీవిస్తుంటాడు. తీవ్రవాదుల నుంచి కాపాడే క్రమంలో గోపి (రణ్వీర్ షోరే)ని కోల్పోతాడు. మరణించే ముందు జోయా డబుల్ ఏజెంట్ అని గోపి చెబుతాడు. కట్ చేస్తే... జోయా, టైగర్ కలిసి టర్కీలోని పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ సూట్ కేస్ దొంగిలిస్తారు. టైగర్ 'రా' ఏజెంట్, జోయా మాజీ ఐఎస్ఐ ఏజెంట్ కావడంతో... భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఇద్దరి కోసం వేట మొదలు పెడతాయి. అసలు... సూట్ కేస్ లో ఏముంది? ఎవరు ఏ దేశానికి ద్రోహం చేశారు? ఏ దేశాన్ని పెను ప్రమాదం నుంచి కాపాడారు? మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతిష్ రెహమాన్ (ఇమ్రాన్ హష్మీ) ఎవరు? అనేది వెండితెరపై చూడాలి. 


విశ్లేషణ (Tiger 3 Review): 'పఠాన్', 'వార్' కంటే ముందు యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ / ఫ్రాంచైజీలో 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' వచ్చాయి. యాక్షన్ అండ్ స్టైల్ విషయంలో ఆ రెండూ ఒక స్టాండర్డ్ సెట్ చేశాయి. షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ సినిమాల్లో కంటే సల్మాన్ ఖాన్ 'టైగర్' సినిమాల్లో బలమైన కథ, కథనాలు ఉన్నాయి. అందువల్ల, 'టైగర్ 3' మీద అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ, ఆ స్థాయిలో సినిమా లేదని చెప్పాలి. 


'టైగర్ 3'తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ వంద శాతం కృషి చేశారు. నటనలో, యాక్షన్ సీన్లలో వాళ్ళిద్దరి ఎఫర్ట్స్ కనిపించాయి. కానీ... బలహీనమైన కథ, కథనాలకు తోడు పేలవమైన దర్శకత్వం కారణంగా యాక్షన్ రైడ్ / డ్రామా ఎగ్జైట్ చేయలేదు. భారీ యాక్షన్ సన్నివేశాలు సైతం ఒకానొక సాగదీసినట్లు అనిపించాయి. దానికి తోడు యాక్షన్ సీన్లలో స్పీడ్ మిస్ కావడం, సన్నివేశాలు సాగదీసినట్లు ఉండటంతో విశ్రాంతి వరకు ఆసక్తి కలిగించదు. థ్రిల్ గానీ, ఎంగేజ్ చేసే సీన్లు గానీ లేవు.   


దేశం కోసం ప్రాణత్యాగానికి, తమ వాళ్ళ ప్రాణాలు తీయడానికైనా సరే సిద్ధపడిన వాళ్ళను స్పై ఏజెంట్స్ / గూఢచారులుగా చూస్తూ వచ్చాం. అటువంటి ఇద్దరు టాప్ స్పై / గూఢచారులు కన్నబిడ్డపై మమకారంతో టెర్రరిస్ట్ చెప్పినట్లు చేయడం 'టైగర్ 3' ప్రారంభంలో ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడ కాస్త డిస్‌కనెక్ట్ మొదలు అవుతుంది. పాకిస్తాన్ ప్రధాని ఆఫీసులో సెక్యూరిటీ పరమ వీక్ అన్నట్లు చూపించడం కామెడీ. ట్విస్ట్ రివీల్ చేయకూడదు గానీ... ఓ సన్నివేశంలో సల్మాన్ ఖాన్‌ను కత్రినా కైఫ్ గుర్తు పట్టదు. అది 80ల కాలం నాటి సినిమాను తలపించింది. ఇంటర్వెల్ తర్వాత షారుఖ్, సల్మాన్ ఫైట్... కొన్ని సీన్లు బావున్నాయి.   


ప్రీతమ్ అందించిన పాటలు బావున్నాయి. కానీ, తనూజ్ టికు నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు అవసరమైన పంచ్ ఇవ్వలేదు. గూస్ బంప్స్ రాలేదు. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' చిత్రాలకు జూలియస్ పేకియమ్ ఎక్స్ట్రాడినరీ నేపథ్య సంగీతం అందించారు. ఆయన ఆర్ఆర్ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. బాగా ఖర్చు చేశారని స్క్రీన్ మీద విజువల్స్ చూస్తుంటే తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ కావచ్చు, టాకీ పార్ట్ కావచ్చు... నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుస్తుంది. ఆ విషయంలో దర్శక నిర్మాతలు, ఎడిటర్ జాగ్రత్తలు తీసుకోవాల్సింది.   


నటీనటులు ఎలా చేశారంటే: టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్ (Salman Khan)ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఆ స్థాయిలో 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' చిత్రాల్లో ఆయన నటించారు. యాక్షన్ సీన్లలోనూ స్వాగ్ చూపించారు. టైగర్ పాత్రకు ప్రాణం పోయడం ఆయనకు కొత్త కాదు. సల్మాన్ హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లు, గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ 'టైగర్ 3'లో తక్కువ అయ్యాయి. 


సల్మాన్ ఖాన్ కంటే కత్రినా కైఫ్ పోషించిన జోయా పాత్రకు 'టైగర్ 3'లో ఇంపార్టెన్స్ లభించింది. యాక్షన్ సీన్లలోనూ కత్రినా బాగా చేశారు. ఆమెకు కంపోజ్ చేసిన ఫైట్స్ బావున్నాయి. సల్మాన్, కత్రినాతో పోలిస్తే ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ స్పేస్ తక్కువ. కానీ, ఉన్నంతలో ఆయన స్టైలిష్ విలనిజం చూపించారు. అతిథిగా వచ్చిన షారుఖ్ ఖాన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ బావుంది. హృతిక్ రోషన్ పతాక సన్నివేశాల తర్వాత అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. 


'టైగర్ 3'లో దక్షిణాది తారలు కూడా ఉన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కీలక పాత్రలో సిమ్రాన్ కనిపించారు. నటిగానూ మెప్పించారు. ఆమెకు మంచి స్క్రీన్ స్పేస్ లభించింది. 'రా' చీఫ్ మీనన్ పాత్రలో రేవతి నటించారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తిగా అనీష్ కురువిల్లా తళుక్కున మెరిశారు.


Also Read : మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?


చివరగా చెప్పేది ఏంటంటే... : సినిమా ప్రారంభంలో సల్మాన్ ఖాన్ ఓ మిషన్ మీద వెళతారు. అది 'టైమ్ పాస్' మిషన్ అని ఇండియా రా చీఫ్ పెడతారు. బహుశా... ఈ సినిమానూ టైమ్ పాస్ కోసం చేసినట్లు ఉన్నారు. రొటీన్ అండ్ బేసిక్ స్పై ఫిలిమ్స్ ఫార్మాట్ తప్ప... '.టైగర్ 3'లో కొత్తదనం లేదు. జస్ట్ యాక్షన్ అండ్ యాక్షన్! టైమ్ పాస్ ఫిల్మ్ అంతే... అదీ సల్మాన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసమే! సినిమా ప్రారంభంలో ఇండియా ఐఎస్ఐ కంటే ప్రమాదకరమైన కొత్త శత్రువును ఎదుర్కొంటుందని చెప్పారు. ఆ శత్రువు ఎవరో తెలియాలంటే 'వార్ 2' కోసం ఎదురు చూడాలి.


Also Read శ్రీదేవి టు జయసుధ - స్టార్ హీరోయిన్లకు ఫస్ట్ హీరో చంద్ర మోహనే... ఆయన పక్కన నటిస్తే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌ గ్యారంటీ