సినిమా రివ్యూ : ఘోస్ట్!
రేటింగ్ : 2.25/5
నటీనటులు : శివ రాజ్ కుమార్, జయరామ్, అనుపమ్ ఖేర్, అర్చనా జాయిస్, ప్రశాంత్ నారాయణన్, సత్యప్రకాష్, అభిజీత్ తదితరులు
ఛాయాగ్రహణం : మహేంద్ర సింహా
సంగీతం : అర్జున్ జన్యా 
నిర్మాతలు : సందేశ్ నాగరాజ్! 
కథ, దర్శకత్వం : ఎంజి శ్రీనివాస్!
విడుదల తేదీ: నవంబర్ 4, 2023  


Shiva Rajkumar Ghost Movie Review In Telugu : కన్నడ కథానాయకుడు శివ రాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి', రజనీకాంత్ 'జైలర్' సినిమాల్లో అతిథి పాత్రలు చేశారు. రామ్ గోపాల్ వర్మ 'కిల్లింగ్ వీరప్పన్'లో హీరోగా నటించారు. విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 19న కన్నడలో విడుదలైన ఆయన 'ఘోస్ట్' సినిమా తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి?
 
కథ (Ghost Movie Story) : మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్) 10 ఏళ్ల పోరాటం తర్వాత జైళ్ల ప్రయివేటీకరణ బిల్లుకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుంది. భూమి పూజ చేయడానికి వెళ్లిన వామన్ అండ్ కో పెద్ద షాక్ తగులుతుంది. వాళ్ళను కిడ్నాప్ చేయడంతో పాటు జైలులో ఓ టవర్ అంతా తమ ఆధీనంలోకి తీసుకుంటుంది ఒక గ్యాంగ్. ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్ (జయరామ్)ని రంగంలోకి తీసుకొస్తుంది. జైలులో ఉండి ఈ ప్లాన్ అమలు చేస్తున్నది బిగ్ డాడీ (శివ రాజ్ కుమార్) అని చరణ్ రాజ్ తెలుసుకుంటాడు. అసలు, ఆ బిగ్ డాడీ ఎవరు? వామన్ శ్రీనివాస్ జైలుకు వెళ్ళినప్పుడు టార్గెట్ చేయడం వెనుక కారణం ఏమిటి? ఆ జైలులో వెయ్యి కేజీల బంగారం కథ ఏమిటి? జైలు నుంచి బిగ్ డాడీ ఎలా తప్పించుకున్నాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Ghost Movie Review) : తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ అని తేడాలు లేవు. ఈ మధ్య ప్రతి ఇండస్ట్రీలో గ్యాంగ్ స్టర్ డ్రామాలు ఎక్కువ అయ్యాయి. హీరోని లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లో చూపించడం కామన్ అవుతోంది. శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar)ను సైతం ఆ విధంగా చూపించడం కోసం తీసిన సినిమా 'ఘోస్ట్'.


సాధారణంగా తీవ్రవాదులు జైలులో ఉన్న తమ వాళ్ళను విడిపించుకోవడం కోసం సామాన్యులను కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి తమ డిమాండ్లు వినిపిస్తారు. 'ఘోస్ట్'లో కొత్త పాయింట్ ఏమిటంటే.. జైలుకు వెళ్లి అక్కడ ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న మాజీ సీబీఐ అధికారిని ఒకరు కిడ్నాప్ చేస్తే... అక్కడి నుంచి తప్పించుకోవడం సులభమా? కదా? అనేది క్లుప్తంగా కథ. ఇదీ విజయ్ 'బీస్ట్' తరహా చిత్రమే. క్లైమాక్స్ రవితేజ 'కిక్'ను గుర్తు చేస్తుంది.   
  
ఏకంగా స్టేట్ సీఎం కొడుకుని ఆయన ముందు షూట్ చేయగల దమ్మున్న గ్యాంగ్ స్టర్ పాత్రలో హీరో శివన్నను చూపించడం వల్ల కథకు కావాల్సినంత హీరోయిజం దొరికింది. కథగా చూస్తే కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ 'ఘోస్ట్'లో ఉన్నాయి. అయితే... కథనం, దర్శకత్వంలో ప్రేక్షకులలో క్యూరియాసిటీ కలిగించే విధంగా లేవు.


'ఘోస్ట్'లో స్క్రీన్ ప్లే సినిమాకు బిగ్గెస్ట్ మైనస్. ఫస్టాఫ్ కంగాళీగా, గజిబిజిగా తీశారు. కేవలం హీరోయిజం అన్నట్లు మాత్రమే కాకుండా... ఫాదర్ & డాటర్ సెంటిమెంట్ సీన్లు యాడ్ చేశారు. అవి కథకు అడ్డు తగిలాయి. ప్రేక్షకుల దృష్టి పక్కకు వెళ్లేలా చేశాయి. సెంటిమెంట్ సీన్లలో పాత్రల మధ్య బలమైన సంఘర్షణ లేదు. న్యూస్ యాంకర్ తండ్రి జైలులో ఎందుకు ఉంటారో? ఆయన కుమార్తెను మోటివేట్ చేయడం ఏమిటో అర్థం కాదు. ఓ ఖైదీ మరణం, తమ్ముడి ఆత్మహత్య వంటి సన్నివేశాల్లో ఎమోషన్ లేదు. ఆ సీన్లు బలవంతంగా ఇరికించినట్లు ఉంటాయి. న్యూస్ ఛానల్స్ లైవ్ కవరేజ్ సీన్లు రొటీన్. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ అసలు బాలేదు. హీరో సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మిగతా ఆర్టిస్టులకు ప్రొఫెషనల్స్ చేత డబ్బింగ్ చెప్పించి ఉంటే బావుండేది. 


దర్శకుడు శ్రీని ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ బావుంది. కానీ, తెరకెక్కించిన తీరులో ఆయన తడబాటుకు గురి అయ్యారు. యాక్షన్ సీన్లను, ఇంటర్వెల్ తర్వాత కథను బాగా డిజైన్ చేసిన ఆయన... కమర్షియల్ ప్యాకేజీలో ప్రేక్షకులకు రేసీ సినిమాను ఇవ్వడంలో వెనకడుగు వేశారు. సెంటిమెంట్ సీన్లు కథలో వేగాన్ని తగ్గించాయి. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కాస్త... రెగ్యులర్ మెలో డ్రామా మూవీగా మారింది. సీక్వెల్ కోసం అన్నట్లు అసలు కథలో కీలకమైన అంశాలకు ముగింపు ఇవ్వలేదు. 


నిదానంగా సాగుతున్న సినిమాకు సంగీత దర్శకుడు అర్జున్ జన్యా విపరీతమైన హై తీసుకొచ్చారు. శివ రాజ్ కుమార్ హీరోయిజం ఎలివేట్ చేసేలా ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం బావుంది. కొత్త సౌండ్స్ వినిపించారు. సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాలో ఎక్కువ శాతం జైలులో జరుగుతుంది. ఒకేచోట సినిమా సాగుతున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలగకుండా ప్రొడక్షన్ డిజైన్ ఉంది. కనీసం తెలుగు వరకు అయినా కొన్ని అనవసరమైన సన్నివేశాలకు కత్తెర వేస్తే బావుండేది. ట్విస్టులు ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. 


నటీనటులు ఎలా చేశారంటే... : కన్నడలో శివ రాజ్ కుమార్ స్టార్! ఆయన స్టార్‌ డమ్ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు శ్రీని కొన్ని సీన్లు డిజైన్ చేశారు. శివన్న కూడా కేవలం కళ్ళతో ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. టెక్నాలజీ ద్వారా యంగ్ శివన్నను పతాక సన్నివేశాల్లో చూపించడం ఆయన అభిమానులకు సంతోషం కలిగించే అంశం.


పోలీస్ అధికారి పాత్రలో జయరామ్ సెట్ అయ్యారు. నటుడిగా ఆయనకు ఈ తరహా రోల్స్ చేయడం కొత్త ఏమీ కాదు. వామన్ శ్రీనివాసన్ పాత్రలో ప్రశాంత్ నారాయణన్, విలేకరి లక్ష్మిగా 'కెజియఫ్' మదర్ ఫేమ్ అర్చనా జాయిస్ కనిపించారు. సత్య ప్రకాష్‌కు ఇటువంటి క్యారెక్టర్లు కొత్త కాదు. కానీ, చాలా రోజుల తర్వాత ఆయనకు ఇంపార్టెంట్‌ రోల్‌ లభించింది. హీరోయిజం సీన్లకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడంతో నటీనటులకు తమ టాలెంట్ చూపించే అవకాశం దక్కలేదు. 


Also Read : ఆ పెళ్లి కొడుకు ఎవరో నాకూ చెప్పండయ్యా - అల్లు కామెంట్స్ వైరల్ కావడంతో హీరోయిన్ క్లారిటీ


చివరగా చెప్పేది ఏంటంటే... : యాక్షన్... యాక్షన్... యాక్షన్... జస్ట్ యాక్షన్ సీన్లు, హీరోయిజం ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం ఉంటే హ్యాపీగా సినిమా చూడవచ్చని కోరుకునే ప్రేక్షకుల కోసమే 'ఘోస్ట్'. స్క్రీన్ మీద శివన్న హీరోయిజం తప్ప ఇంకేమీ ఎంటర్టైన్ చేసే అంశాలు లేవు. 


Also Read మహేష్ బాబు సినిమాలో మసాలా బిర్యానీ - నెట్టింట 'గుంటూరు కారం' లీక్డ్ సాంగ్!