Jiohotstar movie Ponman review in Telugu: మలయాళ కథానాయకుడు బసిల్ జోసెఫ్ (Basil Joseph)కు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'జయ జయ జయ జయహే', 'సూక్ష్మదర్శిని' సినిమాలు తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. ఆయన నటించిన మలయాళ సినిమా 'పొన్‌మాన్' తాజాగా (మార్చి 14న) జియో హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ (Ponman Story): అజేష్ (బసిల్ జోసెఫ్) గోల్డ్ జ్యువెలరీ సేల్స్ ఏజెంట్. కానీ, ఓ ట్విస్ట్ ఉంది. అతను బంగారు నగలు అమ్మేది వివాహాది శుభకార్యాలు జరిగే ఇళ్లల్లో మాత్రమే. అదీ అప్పుగా! పెళ్లిలో బహుమతి (చదివింపులు)గా వచ్చిన డబ్బుల్లో తనకు రావాల్సింది తీసుకుని వెళతాడు.
స్టెఫీ (లిజోమోల్ జోస్) పెళ్లి కోసం బ్రూనో (ఆనంద్ మన్మథన్) కుటుంబం అజేష్ దగ్గర 25 సవర్ల బంగారం తీసుకుంటుంది. చదివింపుల ద్వారా వచ్చిన డబ్బు 13 సవర్లకు మాత్రమే సరిపోతుంది. మిగతా 12 సవర్లు తనకు తిరిగి ఇవ్వమంటే... భర్త మరియానో (సాజిన్ గోపు)తో కలిసి అత్తారింటికి వెళుతుంది స్టెఫీ. అతనొక మొండిఘటం. తనకు సంబంధించిన వస్తువుల మీద కన్నేస్తే కొట్టే రకం. అతడిని ఎదిరించి అజేష్ తన బంగారాన్ని రాబట్టుకున్నాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Ponman OTT Review): 'పొన్‌మాన్' థ్రిల్లరా? డ్రామానా? యాక్షన్ సినిమానా? అసలు ఇదొక కథేనా? వంటి సందేహాలు ప్రేక్షకుల మదిలో సినిమా మొదలైనప్పటి నుంచి అడుగడుగునా కలుగుతాయి. అలాగని బోర్ కొట్టదు. మనల్ని ఆలోచనల్లో పెట్టేసి ఎంగేజ్ చేస్తుంది. థిన్ లైన్ అంటుంటాం కదా! 'పొన్‌మాన్' కథ వెరీ థిన్ లైన్. చిన్న పాయింట్ పట్టుకుని రెండు గంటల పాటు జోతిష్ శంకర్ ఎటూ కదలకుండా కూర్చుని చూసేలా తీశారు.
దర్శకుడు జోతిష్ శంకర్, రచయితలు జీఆర్ ఇందుగోపన్ - జస్టిన్ మాథ్యూ సినిమా ప్రారంభం నుంచి క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లు చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. దాంతో డ్రామా బాగా పడింది. మందు కనిపిస్తే పీకలదాకా తాగేసే వ్యక్తిగా, బలహీనుడిగా హీరోను ఎస్టాబ్లిష్ చేశారు. మరోవైపు సాజిన్ గోపు పాత్రను బలవంతుడిగా, మూర్ఖుడిగా చూపించారు. అతడి నుంచి బసిల్ జోసెఫ్ బంగారాన్ని వెనక్కి తీసుకోవడం అసాధ్యమని చూసే ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది. అయితే, పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేదని ఏదీ ఉండదంటూ పరోక్షంగా సందేశం కూడా ఇచ్చారు.
బంగారం కోసం పెళ్లి కుమార్తెను వెతుకుతూ ఆమె అత్తారింటికి హీరో వెళ్లే సీన్స్, ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అన్నీ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. బ్రూనోని అజేష్ ఎదిరించ లేడని అర్థమైనా, అతను చేసే పనులు నవ్వించడం లేదంటే ఉత్కంఠ పెంచడం చేస్తాయి. బ్రూనోతో చెరువు గట్టు మీద అజేష్ తలపడే సన్నివేశంతో అయితే పది పదిహేను నిమిషాలు టెన్షన్ పెట్టేశారు. పట్టు వదలని విక్రమార్కుడిలా బసిల్ జోసెఫ్ పోరాడే తీరుకు క్లాప్స్ కొట్టాలని అనిపిస్తుంది.
'పొన్‌మాన్'లో పాయింట్ చిన్నదే. కానీ, ఇందులో ఇచ్చిన సందేశం పెద్దది. ఇంట్లో పరిస్థితులకు తలవంచి ఆడపిల్లలు తాళి కట్టించుకుంటున్నారని, వాళ్ల పరిస్థితి మీద ఫోకస్ చేశారు. అలాగే, పనీ పాటా లేకుండా రాజకీయ నాయకుల వెంట తిరిగితే ప్రయోజనం ఉందని చెప్పారు. మతం మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడదని సెటైర్ వేశారు. పట్టుదలతో ప్రయత్నిస్తే కానిది ఏదీ ఉండదని హీరో పాత్ర ద్వారా చూపించారు. దర్శక రచయితలకు సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ నుంచి సపోర్ట్ లభించింది. సినిమాను సహజంగా తీశారు. ఎడిటింగ్, మ్యూజిక్ కూడా ఓకే.
బసిల్ జోసెఫ్ ప్రతి సినిమాకు నటుడిగా మరింత రాటుదేలుతున్నారు. కేవలం క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా నటించడం ఆయన ప్రత్యేకత. అజేష్ పాత్రకు ప్రాణం పోశారు. కామన్ మ్యాన్ క్యారెక్టర్ అంటే బసిల్ గుర్తొచ్చేంతలా ఆయన కథల ఎంపిక, నటన ఉన్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయిగా లిజోమోల్ జోస్ నటన సైతం సహజంగా ఉంది. ఓ సందర్భంలో పెళ్లి కూతురు పరిస్థితి చూసి జాలి కలిగేలా నటించారు. 'ఆవేశం' ఫేమ్ సాజిన్ గోపు మరోసారి నటనతో మెప్పించారు. మిగతా నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు.
'పొన్‌మాన్'లో డ్రామా, వినోదం, ఉత్కంఠ, సందేశం ఉన్నాయి. స్టార్టింగ్ టు ఎండింగ్ వీక్షకులను ఎంగేజ్ చేసే అద్భుతమైన డ్రామా ఉందీ సినిమాలో! వీకెండ్ హ్యాపీగా ఇంట్లో కూర్చుని సినిమా చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్.
PS: పొట్టకూటి కోసం అనండి లేదా జీవనోపాధి అనండి... మార్కండేయ శర్మ (దీపక్ పరంబోల్) పేరు పెట్టి, అతని చేత జీసస్ వేషం వేయించడం కొందరి మనోభావాలను దెబ్బ తీసే అవకాశం ఉంది. కేరళలో చల్తా ఏమో... ఇతర రాష్ట్రాల నుంచి ఆ సన్నివేశం పట్ల వ్యతిరేకత వ్యక్తం కావచ్చు.