వెబ్ సిరీస్ రివ్యూ : న్యూసెన్స్
రేటింగ్ : 3/5
నటీనటులు : నవదీప్, బిందు మాధవి, మహిమా శ్రీనివాస్, నంద గోపాల్, కట్టా ఆంటోనీ, కుమారి, షెల్లీ నబు కుమార్, చరణ్ కురుగొండ, రమేష్ కోనంభొట్ల, శ్వేతా చౌదరి తదితరులు
కథ : ప్రియదర్శిని రామ్
మాటలు : జయసింహ నీలం
స్క్రీన్ ప్లే : ప్రియదర్శిని రామ్, జయసింహ నీలం, శ్రీ ప్రవీణ్ కుమార్
పాటలు : పుట్టా పెంచల్ దాస్
ఛాయాగ్రహణం : వేదరామన్ శంకరన్, అనంత్ నాగ్ కావూరి, ప్రసన్న కుమార్
సంగీతం : సురేష్ బొబ్బిలి
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల
నిర్మాత : టీజీ విశ్వప్రసాద్
క్రియేటర్ & డైరెక్టర్ : శ్రీ ప్రవీణ్ కుమార్
విడుదల తేదీ : మే 12, 2023
ఎపిసోడ్స్ : 6
ఓటీటీ వేదిక : ఆహా!


న్యూస్, న్యూసెస్... ఈ రెండు పదాల మధ్య వ్యత్యాసం చాలా ఉంది. న్యూస్ రాసే జర్నలిస్టులు న్యూసెస్ క్రియేట్ చేస్తే? ఈ నేపథ్యంలో రూపొందిన సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నవదీప్ (Navdeep), బిందు మాధవి జంటగా నటించారు. ఈ సిరీస్  ఎలా ఉందంటే? (Newsense AHA web series review)


కథ (Newsense Web Series Story) : మదనపల్లిలో శివ (నవదీప్) జర్నలిస్ట్. అతని ప్రేయసి నీల (బిందు మాధవి) కూడా జర్నలిస్టే. ఆ ఏరియాలో జర్నలిస్టులంతా కలిసి ఓ గ్రూపుగా ఏర్పడతారు. రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని వార్తలు రాస్తుంటారు. భూకబ్జాలు, మిస్సింగ్ కేసులు, నాటు తుపాకుల దందా... ఏ విషయంలో అయినా సరే వాస్తవాలను దాచి, డబ్బుకు దాసోహం అంటూ నచ్చిన వార్తలు రాయడమే వృత్తిగా పెట్టుకుంటారు. అందువల్ల, ఎవరెవరికి అన్యాయం జరిగింది? ఎస్సై ఎడ్విన్ (నంద గోపాల్) రాకతో జర్నలిస్టులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అంతకు ముందు శివపై దాడి చేసింది ఎవరు? శివ గతం ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Newsense AHA Review) : మదనపల్లి నేపథ్యంలో 'న్యూసెన్స్' తీశారు. అయితే, చూస్తున్నంత సేపు 'మన ఊరిలోనూ ఈ విధంగా జరిగింది' అనుకునేలా సన్నివేశాలను రూపొందించారు. అదీ 'న్యూసెస్' ప్రత్యేకత! సమాజంలో మంచి, చెడు ఉన్నట్లు... జర్నలిస్టుల్లోనూ రెండు రకాలు ఉండొచ్చు. 'న్యూసెన్స్'లో, ఈ సీజన్ వరకూ కేవలం గ్రే షేడ్స్ మాత్రమే చూపించారు. అదీ చాలా సహజంగా తీశారు.


'న్యూసెస్' ప్రారంభమే సిరీస్ చూడటం స్టార్ట్ చేసిన వీక్షకుల్ని మదనపల్లిలోకి తీసుకు వెళుతుంది. మన ఏరియాలో జరుగుతున్న తీరును మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నట్లు అనిపిస్తుంది. కెమెరా వర్క్, ఆర్ట్ డైరెక్షన్, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం అంత చక్కగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & వేల్యూస్ చాలా బావున్నాయి. ఒక్కో ఎపిసోడ్ ఆసక్తి కలిగించడానికి కారణం టెక్నికల్ సపోర్ట్ మాత్రమే కాదు... రైటింగ్ మెయిన్ రీజన్!


కథగా చూస్తే 'న్యూసెన్స్' సిరీస్ అసంపూర్తిగా ముగుస్తుంది. అసలు కథ ఇంకా మొదలు కానే కాలేదు. కేవలం పాత్రలను, పరిస్థితులను మాత్రమే పరిచయం చేశారు. కొన్నిచోట్ల నిడివి ఎక్కువైన, సన్నివేశాలను సాగదీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయినా సరే తర్వాత ఏం జరుగుతుంది? అని చూసేలా చేసిన ఘనత నటీనటులది, మరీ ముఖ్యంగా రచయితది!


'న్యూసెస్'లో క్యారెక్టర్లు చాలా ఉన్నాయ్! వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి రచయిత ప్రియదర్శిని రామ్ టైమ్ తీసుకున్నారు. కానీ, ఒక్కో పాత్రకూ ఒక్కో కథను క్రియేట్ చేశారు. ఉదాహరణకు... రాజకీయ నాయకుల నుంచి అందరూ శివతో ఆప్యాయంగా మాట్లాడతారు. అఫ్ కోర్స్... భయానికి, గౌరవానికి మధ్య అతనితో చెప్పించారు. జర్నలిస్ట్ కాబట్టి భయపడుతున్నారని! అదే సమయంలో శివ తల్లిని చులకనగా చూస్తారు. కుమారుడిని ఆస్పత్రికి తీసుకువెళితే డబ్బులు లేక వైద్యునికి లైంగిక సుఖం అందించడానికి అంగీకరిస్తుందామె! ఇంకో సందర్భంలో సరైన ఇల్లు లేదని పెళ్ళాం చేత తిట్లు తింటున్న తోటి జర్నలిస్ట్ కోసం భూ కబ్జా అవకాశాన్ని శివ తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు. రెండొందల కోసం ఓ మహిళకు అక్రమ సంబంధం అంతకడుతూ న్యూస్ రాస్తాడొకడు. అవన్నీ చూస్తే అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరీ నాటకంలో అనిపిస్తుంది. 


'న్యూసెన్స్'లోకి తొంగి చూస్తే... ప్రతి పాత్ర వెనుక బరువైన భావోద్వేగం ఉంటుంది. భూ కబ్జాలు, హత్యలు, ఎత్తుకు పైఎత్తు వేసే రాజకీయ నాయకుల క్రీడ... ఇలా చాలా పలు అంశాలను స్పృశించారు. నేటివిటీకి దగ్గరగా సిరీస్ తెరకెక్కించిన దర్శకుడు, నిడివి విషయంలో ఇంకా జాగ్రత్త  వహిస్తే బావుండేది. అసలు కథలోకి వెళ్లకుండా కేవలం క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వదిలేయడం మెయిన్ మైనస్. 


నటీనటులు ఎలా చేశారు? : నవదీప్ మంచి నటుడు. సరైన క్యారెక్టర్ పడితే ఎంత అద్భుతంగా చేస్తాడనేది చెప్పడానికి 'న్యూసెన్స్' మంచి ఉదాహరణ. చాలా సీన్లలో కళ్ళతో నటించారు. పైకి ఫ్రీగా ఉంటున్నా... తల్లి విషయంలో మనకు తెలిసిన ఓ ఆలోచన అతని మనసులో ఉందని కొన్ని సన్నివేశాల్లో చక్కగా చూపించారు. రెండో సీజన్ చూస్తే... తల్లీ కొడుకుల మధ్య అనుబంధం, భావోద్వేగ ప్రయాణం మరింత ఉండొచ్చు. తల్లిగా షెల్లీ నబు కుమార్ నటన ఆకట్టుకుంటుంది. 


బిందు మాధవి స్క్రీన్ టైమ్ తక్కువ. కానీ, పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్! నవదీప్, బిందు మాధవి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. వీళ్లిద్దరికీ తోడు మహిమా శ్రీనివాస్ కూడా తోడు కావడంతో సీజన్ 2లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూడొచ్చు! ఎడ్విన్ పాత్రలో ప్రేక్షకులకు గుర్తుండేలా నంద గోపాల్ నటించారు. అయ్యప్ప పాత్రలో కట్టా ఆంటోనీ కూడా! మిగతా నటీనటులు కూడా చక్కగా చేశారు.


Also Read : 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'న్యూసెస్'... నేటివిటీకి దగ్గరగా, మన ఊరిలో కథను చూసినట్టు అనిపించే సిరీస్. సహజత్వంతో కూడిన నవదీప్, బిందు మాధవి, నంద గోపాల్ నటన ఆకట్టుకుంటుంది. అసలు కథను దాచి సిరీస్ అసంపూర్తిగా శుభం కార్డు వేయడం కాస్త అసంతృప్తిని మిగులుస్తుంది. అయితే, పిక్చర్ అభీ బాకీ హై దోస్త్! 


జర్నలిస్ట్ శివ, పోలీస్ ఎడ్విన్ మధ్య పోరు ఎలా ఉండబోతుంది? రేణుక (శ్వేతా చౌదరి) భర్తను ఎందుకు చంపేశారు? రాబోయే ఎన్నికల్లో మదనపల్లి జర్నలిస్టులు ఎవరికి సపోర్ట్ చేస్తారు? శివ మీద సువర్చల (మహిమా శ్రీనివాస్) మనసు పడిన విషయం అతనికి, నీలాకు తెలిసిందా? తమిళనాడు నుంచి వచ్చిన మనుషులు తనపై ఎటాక్ చేయడానికి కారణం ఎవరో శివ తెలుసుకున్నాడా? రాజకీయ నాయకుడి దగ్గరకు నీల ఎందుకు వెళ్ళింది? రెండో సీజన్ కోసం చాలా విషయాలు బాకీ ఉన్నాయి!


Also Read : ఛత్రపతి రివ్యూ: బెల్లంకొండ ‘ఛత్రపతి’ రీమేక్ ఎలా ఉంది? న్యాయం చేశారా? చెడగొట్టారా?