సినిమా రివ్యూ : క్రాంతి
రేటింగ్ : 2.5/5
నటీనటులు : రాకేందు మౌళి, ఇనయా సుల్తానా, యమునా శ్రీనిధి, కార్తీక్, భవాని, శ్రావణి త‌దిత‌రులు  
ఛాయాగ్రహణం : కిశోర్ బొయిదాపు 
సంగీతం : జ్ఞాని 
నిర్మాత‌ : భార్గవ్ మన్నె
రచన, ద‌ర్శ‌క‌త్వం : వి. భీమ శంకర్
విడుదల తేదీ : మార్చి 3, 2023


వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి (Rakendu Mouli) సింగర్, రైటర్, లిరిసిస్ట్! ఆయన నటుడు కూడా! నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో'లో, నిఖిల్ 'కిరిక్ పార్టీ'లో హీరోలకు స్నేహితుడిగా కనిపించారు. హీరోగానూ కొన్ని సినిమాలు చేశారు. రాకేందు మౌళి హీరోగా నటించిన తాజా సినిమా 'క్రాంతి' (Kranthi Telugu Movie 2023). వి. భీమ శంకర్ దర్శకత్వంలో భార్గవ్ మన్నే నిర్మించారు. ఆహా ఓటీటీలో సినిమా విడుదలైంది.


కథ (Kranthi Movie Story) : రామ్ (రాకేందు మౌళి) తెలివైన యువకుడు. అతని లక్ష్యం పోలీస్ కావడం! రెండు రోజుల్లో ఎస్సై ట్రైనింగుకు వెళతాడనగా... ప్రేయసి సంధ్య (ఇనయా సుల్తానా) తన ఇంటికి వచ్చి తండ్రితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడమని కోరుతుంది. వాళ్ళ ఇంటికి బయలుదేరిన రామ్, దారిలో సంధ్య మృతదేహం చూసి షాక్ తింటాడు. ఆమెను మర్చిపోలేక, జీవితంలో ముందడుగు వేయలేక బాధలో చాలా భారంగా బతుకును వెళ్లదీస్తుంటాడు. తల్లి (యమునా శ్రీనిధి) కుమారుడి పరిస్థితి చూసి మనోవేదన చెందుతుంది. సంధ్య మరణించిన ఏడాదికి రమ్య (శ్రావణి) అని మరో అమ్మాయి మిస్ అవుతుంది. రామ్ తల్లికి ఆమె బాగా తెలుసు. సొంత కుమార్తె అని భావించేది. ఓసారి రామ్ చేతికి రాఖీ కూడా కట్టింది. రమ్య మాత్రమే కాదు, అప్పటికి కాకినాడలో పదుల సంఖ్యలో అమ్మాయిలు కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్స్ వస్తాయి. పోలీసులు పట్టించుకోరు. అప్పుడు రామ్ ఏం చేశాడు? మహిళలతో అతను ఎటువంటి ఉద్యమం స్టార్ట్ చేశాడు? అమ్మాయిల మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న పెద్ద మనుషులు ఎవరు? వాళ్ళు ఎలా దొరికారు? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ : థిల్లర్ సినిమాలకు ఓటీటీలో ఆదరణ బావుంటోంది. అలాగని, థ్రిల్లర్స్ తీసి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం ఏమీ కాదు. ప్రపంచ సినిమా, వెబ్ సిరీస్‌లకు అలవాటు పడిన ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. దర్శకుడు వి. భీమ శంకర్ తీసిన 'క్రాంతి'లో కొత్తదనం ఉందా? లేదంటే ఎమోషన్స్ ఉన్నాయా? అనేది చూస్తే...  


మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు జరిగిన ఘటనలు ప్రతి రోజూ ఏదో వార్తల్లో చూస్తున్నాం. వింటున్నాం. ఆ కథలను భీమశంకర్ 'క్రాంతి'కి ఎంపిక చేసుకున్నారు. 'రామాయణంలో సీతాదేవిని ఎత్తుకెళ్లినప్పుడు రావణాసురుడు వెళ్లిన మార్గం రాముడికి తెలియకపోతే? మహాభారతంలో ద్రౌపదిని అవమానించినప్పుడు అక్కడ కృష్ణుడు లేకపోతే? పురాణాల్లో మొదలైన స్త్రీల వేధింపులు... ఇంత వరకు ఆగలేదు' అని హీరో చెప్పే మాట కథ, సినిమాలో ఆత్మను ఆవిష్కరిస్తుంది. 'క్రాంతి' ప్రారంభ సన్నివేశాలు సాదాసీదాగా ఉంటాయి. రమ్య మిస్సింగ్ కేసును చేధించాలని హీరో ప్రయత్నించడం ప్రారంభించిన తర్వాతే కథలో వేగం మొదలవుతుంది. 'తాళి కట్టలేని ప్రేమ బరువుగా ఉంటుంది', 'ఒక అమ్మాయి హెల్ప్ అడిగినా ఏ అమ్మయి కష్టాల్లో ఉన్నా వెంటనే వెళ్లి ఆదుకునే వాడిని మగాడు అంటారు', 'కడుపు నొప్పి వస్తే కంగారు పడే మగాడు గొప్పా? పురిటినొప్పులు భరించే ఆడది గొప్పా?' వంటి డైలాగులు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.
'క్రాంతి' థ్రిల్లర్ సినిమా. అయితే, థ్రిల్ కంటే ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాల్లో మహిళల గురించి హీరో చెప్పే డైలాగులు బావున్నాయి. చివర్లో ఇచ్చే సందేశం బావుంది. అవసరమైనది. అయితే, తొమ్మిది రోజుల్లో సినిమా తీయడం వల్ల నిర్మాణ పరంగా, ఛాయాగ్రహణం పరంగా ఆ పరిమితులు తెలుస్తూ ఉంటాయి. కొంత టైమ్ తీసుకుని, బడ్జెట్ ఇంకొంచెం పెట్టి సినిమా తీసుంటే క్వాలిటీ అవుట్ పుట్ వచ్చేది.  


నటీనటులు ఎలా చేశారంటే? : రామ్ పాత్రలో ట్రాన్స్ఫర్మేషన్ చూపించడంలో రాకేందు మౌళి సక్సెస్ అయ్యారు. లుక్ పరంగా కొంచెం వేరియేషన్ చూపించారు. యాక్టింగ్ పరంగా పాత్రకు న్యాయం చేశారు. ఇనయా సుల్తానా కనిపించేది తెరపై తక్కువ సేపే. ఉన్నంతలో ఆమె బాగా చేశారు. రమ్య పాత్రలో శ్రావణి బావున్నారు. కాకినాడ పోలీస్ అధికారిగా ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ కనిపించారు. మిగతా నటీనటుల్లో పెద్దగా గుర్తు పెట్టుకునే ముఖాలు ఏవీ లేవు.


Also Read : 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'క్రాంతి' ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ. సమాజంలో స్త్రీలకు ఎదురవుతున్న సమస్యలను సినిమాలో చూపించారు. కథలో కొత్తదనం కంటే సినిమా చివర్లో మహిళలకు ఇచ్చిన సందేశం బావుంది. అంచనాలు ఏమీ పెట్టుకోకుండా చిన్న చిన్న లోపాలను క్షమిస్తే... వీకెండ్ ఓ లుక్ వేయొచ్చు.  


Also Read : 'పులి మేక' వెబ్ సిరీస్ రివ్యూ : లావణ్యా త్రిపాఠి, ఆది సాయి కుమార్ ఓటీటీ డెబ్యూ ఎలా ఉందంటే?