సినిమా రివ్యూ: జపాన్ 
రేటింగ్: 2/5
నటీనటులు: కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు 
మాటలు (తెలుగులో) : రాకేందు మౌళి
ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు: ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు
దర్శకత్వం: రాజు మురుగన్
విడుదల తేదీ: నవంబర్ 10, 2023  


Karthi Anu Emmanuel's Japan film review : కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన సినిమా 'జపాన్'. సునీల్ కీలక పాత్ర పోషించారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది?  


కథ (Japan Story): హైదరాబాద్ సిటీలోని రాయల్ జ్యువెలరీలో రూ. 200 కోట్ల విలువలైన నగలు, ఆభరణాలు దోచేస్తారు. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ రాబరీ చేశాడని అనుమానిస్తారు. శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్)... ఇద్దరి నేతృత్వంలోని రెండు బృందాలు జపాన్ కోసం వేట మొదలు పెడతాయి. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా అతని కోసం వెతుకుతారు. దోచుకున్న డబ్బుతో సినిమాలు తీసిన జపాన్, స్టార్ హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్) మీద మనసు పారేసుకుంటాడు. ఆమె కోసం వెళితే జపాన్ వెళితే... అతడిని పోలీసులు రౌండప్ చేస్తారు. అప్పుడు రాబరీ గురించి జపాన్ తెలుసుకుంటాడు. తాను ఆ దొంగతనం చేయలేదని చెబుతాడు. 


జపాన్ కాకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? జపాన్ అంటే శ్రీధర్ ఎందుకు భయపడుతున్నాడు? పోలీసులకు చెందిన సీక్రెట్స్ జపాన్ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు, ఏమైంది? అనేది వెండితెరపై చూడాలి. 


విశ్లేషణ (Japan Review): 'జపాన్' ప్రచార చిత్రాలు, ముఖ్యంగా కార్తీ డైలాగులు పలికిన తీరు సినిమాపై ప్రేక్షకుల చూపు పడేలా చేశాయి. అందులోనూ ఇది కార్తీ 25వ సినిమా కావడం, కార్తీతో 'ఖైదీ' & 'కాష్మోరా' వంటి డిఫరెంట్ సినిమాలు తీసిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణం కావడంతో ప్రేక్షకులు అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే...


'జపాన్' స్టార్టింగ్ బావుంటుంది. దొంగ & పోలీస్ మధ్య క్యాట్ & మౌస్ గేమ్ టైపులో ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే... ఆ ఆశలు, భ్రమలు తొలగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. దొంగ & దొంగిలించిన డబ్బులతో సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా సినిమాలు చేసే వ్యక్తిగా కార్తీని చూపించారు. సినిమాలోని సినిమాలో దొంగ, పోలీస్... రెండు క్యారెక్టర్లు కార్తీ చేశారు. బహుశా... దర్శకుడు అది కామెడీ అని ఫీల్ అయ్యి ఉంటారు. స్క్రీన్ మీద ఆ సీన్ చూసే ప్రేక్షకుడు మాత్రం అసలు ఫీల్ కాడు. పైగా, సాగదీసినట్టు ఉంటుంది. అది చూసినప్పుడు 'అత్తారింటికి దారేది'లో బ్రహ్మానందం ఇంట్రడక్షన్ గుర్తుకు వస్తుంది. 'జపాన్'లోని చాలా సన్నివేశాల్లో కామెడీ వర్కవుట్ కాలేదు. మధ్య మధ్యలో కొన్ని నవ్వులు మాత్రమే ఉన్నాయి. 


కామెడీ సీన్లు తీయడం ఒక ఆర్ట్! హీరో కామెడీ టైమింగ్, యాస మాత్రమే బావుంటే సరిపోదు. సన్నివేశాల్లో కంటెంట్ కూడా ఉండాలి. 'జపాన్'లో అది మిస్ అయ్యింది. ప్రతి వారం థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులకు మాత్రం సినిమా రిఫరెన్స్ డైలాగులు, సినిమాలపై వేసిన పంచ్ డైలాగులు నవ్విస్తాయి. పోలీస్ వ్యానులో సింబాలిజం, క్రింజ్, రివ్యూ రైటర్స్, సి సెంటర్ ఆడియన్స్ అంటూ కార్తీ చేసిన సీన్ అందరినీ నవ్విస్తుంది. చివరిలో చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్ బేస్ చేసుకుని సినిమా తీసి ఉంటే పెద్ద హిట్ అయ్యేదని అనిపిస్తుంది. 


టెక్నికల్ అంశాల పరంగా చూసినా 'జపాన్' ఆకట్టుకోవడం కష్టం. సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్, లో లైట్ ప్యాట్రన్స్ ఫాలో అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అనుకున్నవి ఏవీ వర్కవుట్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.  


నటీనటులు ఎలా చేశారంటే... : క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా జపాన్ యాస పలకడం కోసం ఆయన శ్రమించారు. హెయిర్ స్టైల్, డ్రసింగ్ స్టైల్ ఛేంజ్ చేశారు. కార్తీ యాక్టింగ్ & ఎఫర్ట్స్ వరకు ఎటువంటి లోపం లేదు. తన పాత్ర వరకు ఆయన న్యాయం చేశారు.


'ఈ యాక్టింగ్ స్క్రీన్ మీద చేసి ఉంటే నువ్వు పెద్ద హీరోయిన్ అయ్యేదానివి' అని అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)తో కార్తీ డైలాగ్ చెబుతారు. సినిమాలో ఓ సన్నివేశంలో భాగంగా ఆ డైలాగ్ వస్తుంది. అంటే... సినిమాలో సినిమా హీరోయిన్ రోల్ చేశారు కాబట్టి! నిజంగా అనూ ఇమ్మాన్యుయేల్ యాక్టింగ్ మీద ఆ సెటైర్ వేసినట్లు ఉంది. నటిగా ఆవిడ చేసింది ఏమీ లేదు. జస్ట్ గ్లామర్ డాల్ అన్నట్లు కనిపించడం తప్ప! 


లుక్, గెటప్... సరైన క్యారెక్టర్ లభించడంతో సునీల్ సూపర్ అనిపించారు. ఆయన కోసం అన్నట్లు మధ్యలో కామెడీ సీన్లు కూడా ఉన్నాయి. భవాని పాత్రలో విజయ్ మిల్టన్ యాక్టింగ్ ఓకే. కెఎస్ రవికుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. 


Also Read : దీపావళికి తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలే దిక్కు... టాలీవుడ్ స్టార్ సినిమా ఒక్కటీ లేదుగా!


చివరగా చెప్పేది ఏంటంటే... : నటుడిగా కార్తీ బాగా చేశారు. 'జపాన్' యాస కూడా బావుంది. కానీ, సినిమా డిజప్పాయింట్ చేసింది. కొన్ని కామెడీ సీన్లు మాత్రమే నవ్వించాయి. సినిమాలో డైలాగ్ ఉంది... 'థియేటర్లకు జనాలు రావడం మానేశారు' అని! ఇటువంటి సినిమాలకు ప్రేక్షకులు ఎగబడి రావడం కష్టమే. జస్ట్ ఫర్ కార్తీ ఫ్యాన్స్... అదీ అసలు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే!


Also Read : విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ - అంత చెత్త రివ్యూ ఎప్పుడూ రాలేదట!