Raj Tarun and Malvi Malhotra Movie Review: యువ కథానాయకుడు రాజ్ తరుణ్ పేరు కొన్నాళ్లుగా వార్తల్లో నలుగుతోంది. అతడు తనను మోసం చేశాడని లావణ్య ఆరోపించింది. మాల్వీ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నాడని కూడా చెప్పింది. ఒక వైపు ఈ కాంట్రవర్సీ జరుగుతుండగా... 'పురుషోత్తముడు' విడుదలైంది. సోసోగా ఉందనే టాక్ వచ్చింది తప్ప హిట్ కాలేదు. ఆ సినిమా వారం క్రితం విడుదల కాగా... ఈ రోజు 'తిరగబడర సామీ' థియేటర్లలోకి వచ్చింది. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన చిత్రమిది. 'యజ్ఞం', 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి హిట్ సినిమాలు తీసిన ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.
కథ (Tiragabadara Saami Movie Story): గిరి (రాజ్ తరుణ్) వంద పెళ్లి చూపులకు వెళతాడు. అమ్మాయిలు అతడిని రిజెక్ట్ చేయడానికి కారణం... అతడొక అనాథ. ఓ జాతరలో చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. ఇంకెవరికీ అటువంటి పరిస్థితి రాకూడదని, కుటుంబానికి దూరం కాకూడదని... తప్పిపోయిన వాళ్లను వెతికి కుటుంబాలకు దగ్గర చేయడాన్ని వృత్తిగా మలుచుకుంటాడు. ఆ కుటుంబం ఇచ్చినంత తీసుకుంటాడు. సంపాదన తక్కువ, హైదరాబాద్ బస్తీలోని అనాథలా పెరగడంతో గిరిని పెళ్లి సంబంధాల్లో ఏ అమ్మాయి ఇష్టపడదు. ఆ సమయంలో పరిచయమైన శైలజ (మాల్వీ మల్హోత్రా)తో ప్రేమ చిగురిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు.
గిరి, శైలజ సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఆమెను కొండారెడ్డి (మకరంద్ దేశ్‌పాండే) వెతకడం మొదలు పెడతాడు. శైలజను కొండారెడ్డి ఎందుకు వెతుకుతున్నాడు? ఆమెను వెతికి పెట్టే డీల్ గిరికి వచ్చినప్పుడు అతను ఏం చేశాడు? శైలజ రాకతో గిరి జీవితంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Tiragabadara Saami Movie Review Telugu): అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు చూస్తే చాలని పెద్దలు చెబుతుంటారు. ఒక్కోసారి సినిమా మొదలైన కాసేపటికి... నెక్స్ట్ సీన్లు ఎలా ఉంటాయో ఒక అంచనాకు రావచ్చు. అటువంటి కేటగిరీకి చెందిన సినిమా 'తిరగబడర సామీ'. ప్రారంభం నుంచి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ ముందుకు సాగుతుందీ సినిమా.
'యజ్ఞం', 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి విజయాలు అందించిన ఏఎస్ రవి కుమార్ చౌదరి ఈ సినిమా ఎలా తీశారని ప్రేక్షకులకు అడుగడుగునా సందేహం కలుగుతుంది. ఆయన రచనలో గానీ, దర్శకత్వంలో గానీ మెప్పించే అంశాలు అసలు కనిపించలేదు. ఇంటర్వెల్, ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్లు, క్లైమాక్స్ కొంతలో కొంత బెటర్. ఏదైనా సినిమాకు వెళ్లినప్పుడు బావున్న సన్నివేశాలు గురించి ముందు మాట్లాడుకుని, ఆ తర్వాత బాలేని సన్నివేశాల గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇందులో బావున్న సన్నివేశాలు ఏమిటని వెతుక్కోవాలి.
బీసీ కాలం నాటి కథలతో తీసే ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ సినిమాల్లో కూడా ఎంతో కొంత విషయం ఉంటోంది. స్క్రీన్ ప్లేతో కొందరు మేజిక్ చేస్తుంటే... యాక్షన్ సీన్లు, పాటలతో ఇంకొందరు మెస్మరైజ్ చేస్తున్నారు. ఎటువంటి మేజిక్స్ లేకుండా బోర్ కొట్టిస్తూ ముందుకు సాగింది 'తిరగబడర సామీ'. సినిమా దశ తిరుగుతుందని ఎంత ఎదురు చూసినా సరే నిరాశ తప్ప మరొకటి ఉండదు. ఇప్పటికే వందల సినిమాల్లో చూసిన సన్నివేశాలు వస్తాయి. సాంకేతికంగా సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
మకరంద్ దేశ్‌పాండేను అత్యంత క్రూరుడిగా చూపించడం గానీ, యాక్షన్ సీన్లు గానీ, కామెడీ గానీ... ఏదీ ఆకట్టుకోదు. కితకితలు పెట్టుకున్నా రాని కామెడీ, థ్రిల్ ఇవ్వని సస్పెన్స్ సీన్లు, గూస్ బంప్స్ తెప్పించని యాక్షన్ ఎపిసోడ్స్, ఊహకు అందుకు ముందుకు సాగే కథనం... పట్టుమని పది నిమిషాలు కూడా సినిమా ఎంగేజ్ చేయదు. కొన్ని సన్నివేశాలు చూస్తే సమాజంలో ఈ విధంగా జరుగుతుందా? అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి.
Also Read: బృంద రివ్యూ: Sonyliv OTTలో త్రిష వెబ్ సిరీస్ - సౌత్ క్వీన్ ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?
ఏ దశలోనూ ఆకట్టుకొని కథ, కథనాలతో రాజ్ తరుణ్ (Raj Tarun's Tiragabadara Saami Review) మాత్రం ఏం చేస్తాడు? ఎంత సేపని తన భుజాల మీద సినిమా మోస్తాడు? తన పాత్ర వరకు న్యాయం చేశాడు. మాల్వీ మల్హోత్రా లుక్స్ ఓకే. నటన బాలేదు. ఆవిడ ఫైట్స్ చేసింది. కానీ, సెట్ కాలేదు. కేవలం అందాల ప్రదర్శన చేయడం తప్ప మన్నారా చోప్రా కాస్త కూడా నటించలేదు. మకరంద్ దేశ్‌పాండే లాంటి నటుడి చేత రొటీన్, రెగ్యులర్ సీన్లు చేయించి అతడి మీద ఉన్న ఇంప్రెషన్ పోగెట్టేలా చేశారు. ఆయనకు ఆ తరహా విలనిజం కుదరలేదు. రఘుబాబు, 30 ఇయర్స్ పృథ్వీ, 'తాగుబోతు' రమేశ్, 'బిత్తిరి' సత్తి చేసిన కామెడీ పండలేదు. మిగతా నటీనటుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. జాన్ విజయ్, ప్రగతి, రాజా రవీంద్ర వంటి నటులు ఉన్నా సరైన సీన్లు పడలేదు. వాళ్లూ ఏమీ చేయలేదు.
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ప్రేమ సన్నివేశాలతో మన్నారా చోప్రా అందాల ప్రదర్శనతో సాగిన ఐటమ్ సాంగ్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తాయేమో!? సగటు ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించడం కష్టం. బోరింగ్ సీన్లు వచ్చినప్పుడు థియేటర్లలో నిద్రపోయే అలవాటు ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా మాంచి స్లీపింగ్ పిల్. లేదంటే తలనొప్పి రావడం ఖాయం. 'తిరగబడర సామీ' థియేటర్లకు దూరంగా ఉండటం మంచిది. ఇటువంటి సినిమాలు చేయడం వల్ల రాజ్ తరుణ్ కెరీర్ తిరగబడే ప్రమాదం ఉంది సామీ.
Also Read: బహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?